ప్రపంచకప్ లో టీమిండియా శుభారంభం!

క్రికెట్ వరల్డ్ కప్ ఆరంభం అయ్యాకా వివిధ జట్లు తమ తమ తొలి మ్యాచ్ లనే గాక రెండో మ్యాచ్ లను ఆడేసిన అనంతరం టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆడింది. సౌతాఫ్రికాతో…

క్రికెట్ వరల్డ్ కప్ ఆరంభం అయ్యాకా వివిధ జట్లు తమ తమ తొలి మ్యాచ్ లనే గాక రెండో మ్యాచ్ లను ఆడేసిన అనంతరం టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆడింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ ద్వారా ఈసారి వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం మొదలైంది. తొలి మ్యాచ్ లో విజయంతో కొహ్లీ సేన శుభారంభం చేసింది. ఆరు వికెట్ల తేడాతో ప్రొటిస్ పై టీమిండియా విజయం సాధించింది.

బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ సఫారీలపై టీమిండియా ఆటగాళ్లు ఆధిక్యత కనబరిచారు. బుమ్రా, చాహల్ లు తొలి మ్యాచ్ లోనే సత్తాచూపించి.. తమ ఫామ్ ను కొనసాగిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు. బౌలింగ్ విభాగంలో ఈ ప్రపంచకప్ లో టీమిండియా ఆశలను మోస్తున్న బౌలర్లు వీరిద్దరూ. వీరిపై క్రికెట్ విశ్లేషకులు కూడా భారీ అంచనాలనే పెంచారు. అందుకు తగ్గట్టుగా తొలి మ్యాచ్ లో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు ఈ బౌలర్లిద్దరూ.

ఈ విజయంలో భారత్ కు మరో సానుకూలాంశం రోహిత్ శర్మ టచ్లోకి రావడం. సెంచరీ చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించడమేగాక విదేశీ పిచ్ లపై రాణించలేడు అనే ముద్రను కూడా పోగొట్టుకోవడంలో కీలకమైన అడుగు వేశాడు రోహిత్. కొహ్లీ ఫెయిల్ అయితే టీమిండియాకు కష్టమనే భావన మధ్యన ఈ మ్యాచ్ లో రోహిత్ గెలిపించడం విశేషం.

విజయం మాత్రమే కాకుండా.. ఆశలు పెట్టుకున్న ఆటగాళ్ల రాణింపుతో ప్రపంచకప్ లో టీమిండియాకు అవకాశాలు మరింత పెరిగాయి. తన తదుపరి మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. ఇక వరసగా మూడు పరాజయాలతో సౌతాఫ్రికా జట్టు ఇబ్బందుల్లో పడిపోయింది.

తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ తో ఓడిన దక్షిణాఫ్రికా, రెండో మ్యాచ్ లో బంగ్లా చేతిలోనూ ఓడింది. సెమిస్ రేస్ లో నిలవాలంటే.. తదుపరి అన్ని మ్యాచ్ లనూ ఆ జట్టు నెగ్గాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు.

పరిటాల శ్రీరామ్..చలో సింగపూర్ అంటారా?