ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కునే దుర్మార్గమైన ఆట ఇది. పోయినసారి ఈ ఆటను చాలా తెలివిగా ఆడారు చంద్రబాబు. ఏకంగా 23మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల్లా కొనుక్కున్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ సీట్లు, ఇతర పదవులు ఎరచూపి.. ఎన్నికల సమయంలో వారిని వాడుకుని వదిలేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిపై చర్య తీసుకోవాలని వైసీపీ మొత్తుకున్నా పవిత్రమైన స్పీకర్ కుర్చీలో కూర్చున్న “పెద్దాయన” కూడా పెడచెవిన పెట్టారు.
పాపం ఊరికే పోతుందా.. గోడదూకిన వాళ్లు, దాన్ని సమర్థించిన స్పీకర్.. అందరూ గోదాట్లో కలిసిపోయారు. టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇప్పుడీ ఆట ఆడే ఛాన్స్ వైసీపీకి వచ్చింది. జగన్ కనుసైగ చేస్తే.. చంద్రబాబు ఆయన బామ్మర్ది తప్ప మిగతా టీడీపీ అంతా ఖాళీ అయ్యే పరిస్థితి. కానీ విలువల గురించి మాట్లాడ్డమే కాదు, చేతల్లో కూడా చూపించే వ్యక్తి జగన్. అందుకే చంద్రబాబు ఆడిన అలాంటి దుర్మార్గమైన ఆటల జోలికిపోలేదు.
అయితే గతంలో చంద్రబాబు ఆడిన ఆ దుర్మార్గమైన కొనుగోళ్ల ఆటను ఇప్పుడు బీజేపీ షురూ చేయాలనుకుంటోంది. కారణం చంద్రబాబుపై బీజేపీకి పీకలదాకా కోపం ఉండటమే. దేశమంతా వెలిగిపోతున్నా.. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మరీ దిగజారడానికి చంద్రబాబే కారణం. అందుకే బీజేపీ నేతలు “టార్గెట్ టీడీపీ” అంటున్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నానితో ఈ గేమ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నానిని బీజేపీలోకి లాగి.. ఆయన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది ఎమ్మెల్యేలను కూడా కమలదళంలో కలిపేసుకోవాలని ఆ పార్టీ ఆలోచన. కేంద్ర అధినాయకత్వం సూచనలతోనే ఈ పథకాన్ని అమలులో పెట్టబోతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. 2024 ఎన్నికల టైమ్ కి టీడీపీలో పెద్ద తలకాయల్ని, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను వీలైనంత వరకు తమవైపు లాక్కోవాలనేది వీరి ఆలోచన.
అలాచేస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీకి బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అవుతుంది. ఫిరాయింపులను జగన్ ప్రోత్సహించకుండా సైలెంట్ గా ఉండటంతో.. బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతోంది. రాష్ట్రనేతల్లో అంత విషయం లేదు కానీ.. అమిత్ షా లాంటి రాజకీయ చాణుక్యులు రంగంలోకి దిగితే ఏపీలో టీడీపీని ఖాళీ చేయడం పెద్ద పనేంకాదు.