ఒకవైపు కనీసం అరడజను మంది ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమైన పరిస్థితుల్లో, ఆస్ట్రేలియా జట్టుకు ఎదురులేని గాబా స్టేడియంలో ఆ జట్టుతో తలపడుతోంది టీమిండియా. అయితే కొంతమంది జట్టుకు దూరమవ్వడంతో ఏర్పడిన లోటును పూడ్చగల సమర్థులు టీమిండియాకు అందుబాటులో ఉందనే విషయం ఈ పరిస్థితుల్లోనే రుజువవుతూ ఉంది.
బ్రిస్బెన్ టెస్టుకు రవి అశ్విన్, జడేజా వంటి బ్యాటింగ్ చేయగల బౌలర్లు దూరం అయ్యారు. వారి లోటును చక్కగా భర్తీ చేస్తూ.. కొత్త కెరటాలుగా ఎగిశారు శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్.
వరల్డ్ బెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ ను పేస్ కు బౌన్స్ కూ స్వర్గధామం అయిన పిచ్ మీద.. అది కూడా జట్టు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ శార్దూల్, సుందర్ లు బ్యాటింగ్ చేసిన వైనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే!
వీరిలో వాషింగ్టన్ సుందర్ కు ఇది తొలి టెస్టు. అయితే ఎక్కడా చిన్నపాటి తొణుకు కూడా లేకుండా దుమ్మురేగొట్టాడు. ఒకవైపు ఆరు మంది ప్రధాన బ్యాట్స్ మెన్ 200 పరుగులు అయినా చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. ప్రత్యర్థి జట్టు దాదాపు 200 పరుగుల లీడ్ లో ఉంది. అప్పటికే ఆస్ట్రేలియన్ కామెంటరేటర్లు.. ఈ టెస్టు మ్యాచ్ నే తమ జట్టు గెలవబోతోంది అన్నట్టుగా మొదలుపెట్టారు.
టాప్ ఆర్డర్ పని పూర్తయ్యిందని.. లోయరార్డర్ లో అంతా అనుభవలేమి కుర్రాళ్లే కాబట్టి.. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్లకు వారిని పెవిలియన్ కు పంపడం ఏ మాత్రం కష్టం కాదనే రీతిన వారి కామెంటరీ సాగింది. అయితే ఆ అంచనాలను తలకిందుల చేస్తూ.. సుందర్, శార్దూల్ లు ఏడో వికెట్ కు 123 పరుగులు జోడించి.. ఆస్ట్రేలియన్ జట్టు ఆధిక్యాన్ని పూర్తిగా తగ్గించి వేశారు!
మ్యాచ్ ను రసవత్తరంగా మార్చారు ఈ ఇద్దరు కుర్రాళ్లూ. బ్రిస్బేన్ స్టేడియంలోకి రండి మీ పని పడతాం.. అన్నట్టుగా ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు కూడా టీమిండియాను స్లెడ్జ్ చేశారు. ఈ పిచ్ ను తమకు పెట్టని కోటగా భావిస్తుంది టీమ్ ఆస్ట్రేలియా. అంత కాన్ఫిడెంట్ గా ఉన్న ఆస్ట్రేలియన్ టీమ్.. శార్దూల్, సుందర్ లు ఆడుతున్న వైనాన్ని చూసి చేష్టలుడిగింది.
ఆసీస్ పేస్ దళాన్ని ఎదుర్కుంటన్న భయమేదీ లేకుండా.. స్ట్రోక్ మేకింగ్ తో శార్దూల్, సుందర్ లు చక్కగా ఆడారు. టాప్ ఆర్డర్ ను త్వరగా పెవిలియన్ కు పంపించిన ఆనందంలో ఉన్న ఆసీస్ ఆటగాళ్లకు శార్దూల్, సుందర్ ఝలక్ ఇచ్చారు. వీరిలో ఠాకూర్ 67 పరుగులు చేయడా, సుందర్ 62 పరుగులు చేశాడు.
ఠాకూర్ ఔట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఓవరాల్ గా ఆస్ట్రేలియా 33 పరుగుల తొలి ఇన్నింగ్స్ భాగస్వామ్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు సాధించింది.
ఈ మ్యాచ్ మరో రెండు రోజుల ఆట మిగిలింది. వర్షం అవకాశాలు కూడా ఉన్నాయి. మరో రెండు రోజులూ వర్షం పడకపోయినా డ్రా అవకాశాలున్నాయి. అదే సమయంలో ఫలితం వచ్చే అవకాశాలూ లేకపోలేదు. రేపు ఉదయం టీమిండియా బౌలర్లు ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ ను త్వరగా పెవిలియన్ కు పంపగలిగితే.. మ్యాచ్ కచ్చితంగా ఫలితం వస్తుంది. అది భారత్ కు అనుకూలంగా కూడా ఉండవచ్చు.
బౌలర్లు రెండో ఇన్నింగ్స్ లో బాగా రాణించి, శార్దూల్ – సుందర్ ల స్ఫూర్తితో రెండో ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మెన్ రాణిస్తే.. ఆసీస్ కు పెట్టని కోటలో ఆ జట్టును ఓడించడం టీమిండియాకు సుసాధ్యమే.