ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విరుచుకుపడ్డారు. ఆదివారం మీడియాతో రామ కృష్ణ మాట్లాడుతూ బీజేపీ రాజకీయ పార్టీనా? లేక కులపార్టీనా? అని ప్రశ్నించారు.
ఏపీలో బీజేపీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కాళ్లదగ్గరికి తీసుకెళ్లాడని ధ్వజమెత్తారు. ముద్రగడ ఫొటో పెట్టుకునే తిరుపతిలో బీజేపీ ఓట్లు అడుక్కోవాల్సి వస్తుందేమోనని ఎద్దేవా చేశారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు బీజేపీకి గట్టి గుణపాఠం చెబుతారని రామకృష్ణ హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో మోడీ పప్పులుడకవని ఆయన తేల్చి చెప్పారు.
ఈ నెల 26న ఢిల్లీలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని రైతులు చేపట్టే ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతు ఇస్తున్నట్టు రామకృష్ణ తెలిపారు.
ప్రధాని నరేంద్రమోడీ కార్పొరేట్ల పక్షమా, రైతుల పక్షమో తేల్చి చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలను అప్రజాస్వామికంగా తీసుకొచ్చారని ఆయన ధ్వజమెత్తారు.