''..పవర్ స్టార్ అన్నది ఓ ఇంగ్లీష్ పదం. అది సినిమాలో నా హీరో పేరు. ఆ హీరో మీరు అనుకునే హీరోలా వుండడం అన్నది యాదృచ్ఛికం…'' ఇదీ ఆర్జీవీ మాట.
ఈ రోజు ఆయన వరుస పెట్టి వదిలిన రెండు డజన్ల స్టిల్స్ తెలుగునాట సంచలనం సృష్టించాయి. అపారంగా ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిని పోలిన నటులను తీసుకువచ్చి, పవర్ స్టార్ అనే పేరు పెట్టి, ఆ టైటిల్ మధ్యలో జనసేన సింబల్ అయిన గాజు గ్లాసు లోగో పెట్టడం అంటే మామూలు విషయం కాదు.
దీని గురించే ఆర్జీవిని 'గ్రేట్ ఆంధ్ర' కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు వేసింది.
ఇలా అనుకుంటున్నారు అని మీడియాలో పేర్లు పెట్టకుండా, ఫొటోలు వాడకుండా గ్యాసిప్ లు రాస్తేనే ఇండస్ట్రీ కిందా మీదా అయిపోతుంది. వుయ్ ఆర్ విత్ యు, వుయ్ ఆర్ వన్ అంటూ హడావుడి చేస్తుంది…?
నేను అదే విజువలైజ్ చేస్తున్నాను
నేను అనేదీ అదే. మీరు గ్యాసిప్ ను సినిమా ఫార్మ్ లో విజువలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ మరింత ఎక్కువ గడబిడ చేయాలి కదా?
ఎందుకు? నేను ఓ కథ రాసుకున్నాను. అందులో హీరో సినిమా నటుడు. పార్టీ పెట్టి దారుణంగా ఓడిపోయాడు. ఫార్మ్ హవుస్ లో తన అన్న, గురువు లాంటి సన్నిహితుడు ఇలా కొందరితో కూర్చుని అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది?అన్నది డిస్కస్ చేసాడు. దీంట్లో తప్పేం వుంది?
తప్పేం వుందా? మీరు చెబుతున్నది అంతా పవన్ కళ్యాణ్, మెగాస్టార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరుల గురించి అని అర్థం అవుతోంది కదా? చూపిస్తున్నది కూడా వారినే కదా?
ఎవరు చెప్పారు? ఇది పూర్తిగా యాధృచ్ఛికం. మనుషులను పోలిన మనుషులు వుంటారు.
అంటే ఒకే సినిమాలో, అది కూడా ఒకే సీన్ లో అందరూ కూడా ఇలా మనుషులను పోలిన మనుషులు వుండడం యాధృచ్ఛికమా?
అవును. కావాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద ఒట్టు. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయనకు ఈ సినిమాకు ఏ సంబంధం లేదు.
మరి గాజు గ్లాసు ఎందుకు వచ్చింది మధ్యలో?
నా సినిమాలో హీరో కి గాజు గ్లాసులో టీ తాగే అలవాటు వుంటుంది. అందుకే అది కూడా పోస్టర్ లో వాడాను.
మీరు వంటికి పూర్తిగా ఆముదం రాసుకున్నట్లు వుంటారు. లాజికల్ ఆన్సర్ లు ఇవ్వండి సర్
నాకన్నా లాజికల్ గా మాట్లాడేవాడిని చూపించండి. శివలో నాగార్జున సైకిల్ చైను వాడాడు. అందుకే పోస్టర్ మీద వేసాను. ఈ సినిమాలో హీరో తరచు గాజు గ్లాసులో టీ తాగుతాడు. అంతే
ఇంతకీ ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నారు. ఏం చూపించబోతున్నారు.
అది ఇప్పుడు కాదు, సినిమా చూడాల్సిందే.
సినిమాలో పవన్ తన సన్నిహితులైన వారి మీద కాస్త గట్టిగా కోపం పడతాడని వినిపిస్తోంది.
పవన్ అని అనకండి. నా సినిమాలో హీరో పవర్ స్టార్.
అంటే హీరో పేరే పవర్ స్టార్ నా? వేరే పేరు వుండదా? పిలుపు ఎలా వుంటుంది?
పేరే పవర్ స్టార్. తమ్ముడు, బాబు అని, అన్నయ్యా, గురూజీ అనీ పిలుపులు వుంటాయి. పేర్లు వుండవు.
సరే, మనుషుల్ని పోలిన మనుషులు వుంటారు. అందరూ ఒకే ఫ్రేమ్ లోకి ఎలా వస్తారు? ఒకే కథలోకి ఎలా వస్తారు?
అదే యాధృచ్ఛికం అంటున్నా కదా.
ఇలాంటి వాళ్లు అంతా మీకే ఎక్కడ దొరుకుతారు?
నేను తీయాలనుకుంటున్నా కాబట్టి దొరికారు. మీరు ట్రయ్ చేస్తే మీకూ దొరుకుతారు.
మీ దగ్గర అన్నింటికి సమాధానాలు వుంటాయను కుంటాను రెడీగా వుంటాయి కదా?
అదేం లేదు. నేను క్లారిటీతో వున్నా. మీరు క్లారిటీగా అడిగితే క్లారిటీగా చెబుతా అంతే.
వి.రాజా