ఈ ఏడాది సమ్మర్ లో ఇండియాలో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పలు వాయిదా అనంతరం యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఆట గా ఐపీఎల్ ఈ ఏడాది సూపర్ సక్సెస్ అయ్యింది. గ్యాలరీల్లో జనాలు లేకపోయినా.. టీవీల్లో అయితే ఫుల్ రేటింగ్స్ ను సంపాదించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఈ సారి కూడా బీసీసీఐకి బంగారు బాతుగానే గుడ్లు పెట్టిందని తెలుస్తోంది. అనేక రంగాలు కరోనాతో దెబ్బతిన్న ఈ సంవత్సరంలో కూడా ఐపీఎల్ నిర్వహణ ద్వారా బీసీసీఐ ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని సంపాదించుకుందట!
ఇది వరకటితో పోలిస్తే.. ఈ ఏడాది టీవీ వ్యూయర్ షిప్ ద్వారా వచ్చిన మొత్తం 25 శాతం అధికమట! ఇలా కరోనా ఏడాది కూడా ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి భారీ మొత్తం సమకూరిందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా అనేక క్రీడా పోటీలు జరగడం లేదు.
కేవలం ప్రైవేట్ లీగులు మాత్రమే సాగుతున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ ను నిర్వహించారు. ఒక దశలో ఈ ఏడాదికి ఈ లీగ్ లేనట్టే అని వార్తలు వచ్చినా ఆ తర్వాత మాత్రం వెనక్కు తగ్గకుండా యూఏఈ వేదికగా నిర్వహించారు.
దీంతో ఆటగాళ్లకూ భారీ మొత్తాలు సమకూరాయి. ప్రాంచైజ్ లు భారీ మొత్తాలను యథాతథంగా వెచ్చించాయి. వారికి కూడా లాభాలు అందినట్టే. బీసీసీఐకి టైటిల్ స్పాన్సర్ తో సహా కొన్ని విషయాల్లో లాభాలు తగ్గినట్టుగా మొదట్లోనే స్పష్టత వచ్చింది. కానీ.. అంతిమంగా నాలుగు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని సంపాదించుకుందట. ఈ వంతున ప్రాంచైజ్ లు కూడా లాభపడ్డట్టే.
ఈ లీగ్ నిర్వహణకు సహరించిన యూఏఈ క్రికెట్ బోర్డుకు కూడా బీసీసీఐ భారీ బహుమానమే ఇచ్చిందట. వంద కోట్ల రూపాయల మొత్తాన్ని యూఏఈ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ బహుకరించినట్టుగా సమాచారం.
మిగతా నిర్వహణ ఖర్చులు ఎలాగూ బీసీసీఐ నే పెట్టుకున్నట్టుంది. లీగ్ సందర్భంగా మొత్తం మూడు వేల కరోనా పరీక్షలను నిర్వహించి, అత్యంత పకడ్బంధీగా లీగ్ నిర్వహించి బీసీసీఐ తన సత్తా నిరూపించుకున్నట్టే!