నాలుగేళ్ల క్రితం ఈజిప్టులో ముబారక్ పాలనపై 'అరబ్ స్ప్రింగ్' (వసంతం) పేర ప్రజల తిరుగుబాటు జరిగింది. దానికి నాందిగా కైరోలోని తహరీర్ స్క్వేర్‌లో జనవరి 25 న పౌరులు నిరసన ప్రదర్శనలు చేశారు. దేశమంతా శాంతియుతంగా ఆందోళనలు, సమ్మెలు జరిగాయి. అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పక్షాలు చేతులు కలపడంతో భయపడిన ముబారక్ ప్రభుత్వం దాన్ని అణచాలని చూసింది. వెయ్యిమంది చనిపోయారు. ఆరువేలమంది గాయపడ్డారు. చివరకు ముబారక్ తన ఉపాధ్యక్షుడికి అధికారం అప్పగించి, గద్దె దిగిపోయాడు. అయినా ప్రజలు శాంతించకపోవడంతో ఆ ఉపాధ్యక్షుడు అధికారాన్ని సైన్యానికి అప్పగించి తను తప్పుకున్నాడు. ఫిబ్రవరి 13 న సైన్యాధికారి రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి, పార్లమెంటును రద్దు చేసి ఆర్నెల్ల సైన్యపాలన తర్వాత ఎన్నికలు నిర్వహించి తాము గద్దె దిగుతామని చెప్పాడు. ముబారక్‌పై విచారణ జరిపినట్లే జరిపి కేసులు నీరుకారుస్తూ వచ్చారు. దానిపై ప్రజలు మండిపడ్డారు. 2012లో జరిగిన ఎన్నికలలో ముస్లిం బ్రదర్‌హుడ్ నాయకుడు మహమ్మద్ మోర్సీని గెలిపించి అధికారంలోకి తెచ్చారు. అయితే సెక్యులరిస్టులు, సైన్యం మోర్సీని వ్యతిరేకించారు. 2013 జులైలో రక్షణ మంత్రి జనరల్ అబ్దెల్ ఫతా ఎల్ సిసి అమెరికా మద్దతుతో మోర్సీపై కుట్ర జరిపి అధికారంలోకి వచ్చాడు. 2014లో తనను అధ్యక్షుడిగా ఎన్నిక చేసేసుకున్నాడు. హోస్నీ ముబారక్‌పై అన్ని కేసులు ఎత్తేశాడు.
ఇప్పుడు సైన్యం సహాయంతో, అమెరికా మద్దతుతో, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యిచ్చిన ఆర్థికసహాయంతో, మధ్యప్రాచ్యంలో ఎటువంటి ప్రజాస్వామ్యమూ వర్ధిల్లకూడదనే పట్టుదలతో వున్న సౌదీ అరేబియా అందిస్తున్న నిధులతో ఈజిప్టును తన దాదాపు నియంతలా పాలిస్తున్నాడు. తను విరోధులుగా భావించిన వారినందరినీ హింసాయుతంగానో, చట్టప్రకారమో మట్టుపెడుతున్నాడు. ఈ విషయంలో జడ్జిలు అతనికి పూర్తిగా సహకరిస్తున్నారు. సైన్యం, పోలీసులు, న్యాయవ్యవస్థ మూకుమ్మడిగా ప్రజలపై చేస్తున్న దాడి యిది అంటున్నారు పరిశీలకులు. 2013 నుండి ప్రభుత్వం 29 వేల ముస్లిం బ్రదర్‌హుడ్ సభ్యులను జైల్లో పెట్టాడు. మూకుమ్మడిగా విచారణ జరిపించి, మూకుమ్మడిగానే మరణశిక్ష విధించారు. ఒక చోట వారి సంఖ్య అయితే 529 అయితే, మరో చోట 183. నిరసన తెలిపినందుకు జైళ్లల్లో పెట్టిన అన్ని పార్టీల వారి సంఖ్య 40 వేలు. ఈ చట్టం పేరుతో ప్రజాబలం వున్న నాయకులందరినీ ఖైదులో కూర్చోబెట్టారు. 230 మందికి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. ఈ జనవరి 25న ఈజిప్టు తిరుగుబాటు నాల్గవ వార్షికోత్సవం జరుపుదామని కొందరు తహరీర్ స్క్వేర్‌లో ప్రవేశిద్దామని చూస్తే పోలీసులు తరిమివేశారు. నియంతకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ఆనాటి విప్లవం ఛాయలు ఎక్కడా మిగలకుండా వుండాలని కడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ గోడలపై రాసిన నినాదాలు తుడిపివేసి రంగులేసేశారు. ముస్లిం బ్రదర్‌హుడ్‌కు పట్టున్న అలెగ్జాండ్రాలో జరిగిన నిరసన ప్రదర్శలపై పోలీసులు విరుచుకుపడ్డారు. కాల్పుల్లో ఒక 17 ఏళ్ల కుర్రాడు చచ్చిపోయాడు.
ఇతని నిరంకుశ పాలన యిలా సాగుతుంటే ప్రజలు ఎలా భరిస్తున్నారన్న సందేహం వస్తుంది. నాలుగేళ్లగా నడుస్తున్న సంక్షోభంతో విసిగిపోయిన ప్రజలు ఏదో ఒకలాగ శాంతి నెలకొంటే చాలని చూస్తున్నారు. వారి సరిహద్దు దేశాలలో ఐయస్ దారుణ మారణకాండ జరుపుతోంది, మరో వైపు లిబ్యాలో అంతర్యుద్ధంతో కుతకుతలాడుతోంది. తను లేకపోతే, గట్టినా నిలబడకపోతే ఈజిప్టు గతీ యింతే, ప్రజాస్వామ్యపు హక్కుల కోసం పట్టుబడితే అశాంతి, అల్లర్లు తప్ప వేరేమీ దక్కవు అని ఎల్ సిసి ప్రజలకు చెపుతున్నాడు. హక్కుల గురించి పట్టణ ప్రజల్లో వున్నంత అవగాహన గ్రామీణ ప్రాంతాలలో లేదు. ఈజిప్టు ఉత్తరభాగంలో తహరీర్ స్క్వేర్ ప్రభావం లేదు. అక్కణ్నుంచి చాలామంది సైన్యంలో చేరుతున్నారు. ఇవి చూసి సిసి పాలనకు ఎదురు లేదు అనుకుంటే పొరపాటు. అతనికి కార్మిక వర్గాల నుంచి, రైతుల నుంచి ఆర్థికపరమైన కారణాల చేత వ్యతిరేకత ఎదురవుతోంది. ఐఎంఎఫ్ షరతులకు తలవొగ్గి పత్తిపై సబ్సిడీలు తగ్గించడం రైతుల పొట్ట కొట్టింది. 20 ఏళ్ల క్రితం ఈజిప్టు రైతులు 4 లక్షల టన్నుల పత్తిని ఉత్పత్తి చేసేవారు. గ్లోబలైజేషన్ వచ్చి, ప్రపంచ మార్కెట్ ధరలను శాసించడం మొదలుపెట్టడంతో ధరలు తగ్గడంతో వారు పత్తి ఉత్పత్తి తగ్గించేశారు. సబ్సిడీలు తగ్గించడంతో ఇంకా తగ్గించేశారు. గత ఏడాది 1.27 లక్షల టన్నులు పండిస్తే, యీ ఏడాది అంతకంటె తక్కువగా వుంటుంది అంటున్నారు. ఇలా వాణిజ్యపంటల ఉత్పత్తి తగ్గడం దేశానికి మేలు చేయదని మనం అనుకుంటాం. కానీ 2014 నవంబరులో కైరో పర్యటించిన ఐఎంఎఫ్ బృందం ఈజిప్టు చేపట్టిన ఆర్థిక సంస్కరణలపై హర్షం వ్యక్తం చేసి, దానికి ఫుల్ మార్కులు వేసింది.
ఇక కార్మికుల సంగతికి వస్తే మహల్లా ప్రాంతంలోని టెక్స్‌టైల్ మిల్స్ కార్మికులు ఒక సంఘటిత శక్తిగా ఏర్పడి తమకు కావలసినవి సాధించుకుంటున్నారు. 2006లో సమ్మె చేసి బోనస్సులు సాధించుకున్నారు. అది చూసి దేశమంతా కార్మికులు మాకూ కావాలంటూ ఆందోళనలు దిగారు. అవి రెండేళ్లపాటు సాగాయి. సిసి ప్రభుత్వం అందరినీ వంచుతోంది కానీ కార్మికులను ఏమీ చేయలేకుండా వుంది. వారి పోరు తట్టుకోలేక తన ప్రధానమంత్రి హజీమ్ ఎల్ బెబ్లాయీని తప్పించి అతని స్థానంలో ఇబ్రహీం మెహలెబ్‌ను తెచ్చాడు. అతను వస్తూనే ''కార్మికుల దేశభక్తిని నమ్ముకునే ముందుకు సాగుతున్నాం'' అన్నాడు. దేశభక్తి మాట ఎలా వున్నా మా భుక్తికి మాత్రం లోటు వస్తే వూరుకోం అంటున్నారు జౌళి పరిశ్రమలోని కార్మికులు. ప్రభుత్వరంగంలోని అనేక ఫ్యాక్టరీలకు స్వయంసమృద్ధి లేదు. మూసేద్దామంటే కార్మికులు వూరుకోరని భయం. 2014 డిసెంబరులో మహల్లా కార్మికులు పరిశ్రమల మంత్రిని కలిసి కాటన్ టెక్స్‌టైల్ పరిశ్రమను జాతీయ పథకంగా ప్రకటించాలని, తీసేసిన సబ్సిడీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అతను నిరాకరించాడు. వీళ్లు జనవరిలో సమ్మె మొదలుపెట్టారు. రాజకీయ కార్యకర్తలను కాల్పించగల, జైళ్లలో తోయించగల సిసి కార్మికుల విషయంలో మాత్రం యింకా ఏమీ చేయలేకుండా వున్నాడు. కార్మికులు, రైతులు చేతులు కలిపితే మాత్రం సిసి పని అయిందే, అప్పుడు ఐఎంఎఫ్ యిచ్చిన సర్టిఫికెట్టు, సౌదీ అరేబియా డబ్బు, అమెరికా ప్రశంసలు ఎందుకూ పనికి రావు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)