ఎమ్బీయస్‌ : నితిన్‌ గడ్కరీ వ్యాపారబంధాలు

నితిన్‌ గడ్కరీ రాజకీయనాయకుడు మాత్రమే కాదు, వ్యాపారస్తుడు కూడా. అతని పూర్తీ గ్రూపుకు సంబంధించిన వివాదాల వలననే మళ్లీ బిజెపి అధ్యకక్షుడు కాలేకపోయాడు. అతని పూర్తీ గ్రూపు ఎస్సార్‌ గ్రూపులోని ఎస్సార్‌ ఆయిల్‌ లిమిటెడ్‌తో…

నితిన్‌ గడ్కరీ రాజకీయనాయకుడు మాత్రమే కాదు, వ్యాపారస్తుడు కూడా. అతని పూర్తీ గ్రూపుకు సంబంధించిన వివాదాల వలననే మళ్లీ బిజెపి అధ్యకక్షుడు కాలేకపోయాడు. అతని పూర్తీ గ్రూపు ఎస్సార్‌ గ్రూపులోని ఎస్సార్‌ ఆయిల్‌ లిమిటెడ్‌తో 2013 ఆగస్టులో టై అప్‌ అయి ఇథనాల్‌ ఆధారిత పెట్రోలు అమ్మడానికి 50 ఔట్‌లెట్స్‌ తెరవడానికి ఒప్పందంపై సంతకం పెట్టింది. తమకు కాబోయే భాగస్వామిని సంతోషపెట్టడానికి ఎస్సార్‌ గ్రూపు దక్షిణ ఫ్రాన్సులో తనకు సంబంధించిన ''సన్‌రేస్‌'' అనే ఒక విహారనౌక (యాట్‌)లో గడ్కరీకి, అతని కుటుంబసభ్యులకు జులైలో మూడు రోజుల విహారయాత్ర ఏర్పాటు చేసింది. ఆ విషయాలను యిప్పుడు ''అవుట్‌లుక్‌'' పత్రిక సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. ఒక వ్యాపారసంస్థ తన క్లయింటుకు అలా ఏర్పాటు చేయడంలో వింతేమీ లేదు కానీ యీయన రాజకీయనాయకుడు కావడం, అది వివాదాలలో యిరుక్కున్న గ్రూపు కావడంతో యీ యాత్రకు సమ్మతించడంలోని ఔచిత్యంపై చర్చ జరుగుతోంది.  

2013 జూన్‌ 30న ఎస్సార్‌ స్టీల్‌ చైర్మన్‌ ఎక్జిక్యూటివ్‌ అసిస్టెంటు ''సన్‌రేస్‌'' కెప్టెన్‌కు ఈ మెయిల్‌ పంపాడు. ''నితిన్‌ గడ్కరీ అనే బిజెపి పార్టీ మాజీ అధ్యకక్షుడు యూరోప్‌లో వున్నారు. మన బోటుపై 2-3 రోజులు గడుపుతారు. ఏర్పాట్లు చేయవలసినది.'' అని. గడ్కరీకి అప్పటికి ఏ పదవీ లేదు కానీ అప్పటికే  యుపిఏ ప్రభ తగ్గుతోందని, ఇంకో ఏడాదిలో జరగబోయే ఎన్నికలలో యుపిఏ తిరిగి రాదని, బిజెపికే అవకాశం వుందని, బిజెపికి మంచిరోజులు వస్తే నితిన్‌ మళ్లీ పుంజుకుంటాడనీ కార్పోరేట్‌ వర్గాలకు తెలుసు. ఎస్సార్‌ గ్రూపు అప్పటికే 2 జి స్కాములో యిరుక్కుని వుంది. లూప్‌ టెలికామ్‌ అనే అనుబంధ సంస్థ ద్వారా 2 జి లైసెన్సులు చేజిక్కించుకోవడానికి టెలికామ్‌ డిపార్ట్‌మెంటును మోసగించిందని ఆరోపిస్తూ సిబిఐ 2011 డిసెంబరు 12న ఐదుగురిపై కేసు పెట్టింది. దానిలో యిద్దురు లూప్‌ వారు యిద్దరు, ఎస్సార్‌ వాళ్లు ముగ్గురు వున్నారు. మాకే సంబంధం లేదని రెండు గ్రూపులూ చెప్పుకున్నాయి. ఇలాటి గ్రూపునుండి సౌకర్యాలు పొందడానికి నితన్‌ సందేహించలేదు. 

సౌకర్యాలు కల్పించడానికి గ్రూపువారూ సంశయించలేదు. అవుట్‌లుక్‌ బయటపెట్టిన యీ మెయిల్స్‌ చూస్తే వారు యుపిఏ కేంద్రమంత్రులు సిఫార్సు చేసినవారికి బలవంతాన తమ సంస్థలో ఉన్నతోదోగ్యాలు యివ్వవలసి వచ్చిందని అర్థమవుతుంది. ఈ వ్యాపారస్తులు రొట్టెకు రెండువైపులా వెన్న పూస్తూనే వుంటారు. ఈ తెలివితేటలు కొందరు ప్రభుత్వాధికారులకు లోపిస్తాయి. 2013 మేలో ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్టుమెంటు వాళ్లు నితిన్‌ గ్రూపు రూ.7 కోట్లు పన్ను ఎగేసిందని కేసు పెట్టారు. ''మా పార్టీ అధికారంలోకి రాగానే యీ అధికారులను రక్షించడానికి అప్పుడు చిదంబరం, సోనియా వుండరు'' అని తెగేసి బహిరంగంగా అన్నాడు నితిన్‌. ఐటీ అధికారులు అభ్యంతరం తెలిపితే మన్నించండి అన్నాడు. కానీ 2014 మే 13 న బిజెపి అధికారంలోకి వస్తూండగానే అధికారులే మమ్మల్ని మన్నించండి, మీరు పన్ను ఎగ్గొట్టమేమిటి, మా మతి మండా అంటూ కేసు ఎత్తేశారు. ఎస్సార్‌ గ్రూపు అలాటి పొరపాట్లు చేయలేదు. నితిన్‌తో ముందు నుంచీ సఖ్యంగానే వుంది. 

నితిన్‌, అతని భార్య కాంచన్‌, పిల్లలు నిఖిల్‌, సారంగ్‌, కేతకి, కుటుంబసభ్యులు మధురా, రుతుజ, నందిని, గడ్కరీ ప్రయివేటు సెక్రటరీ వైభవ్‌ డాంగే మొత్తం 9 మందిని బోటు కెప్టెన్‌ ఫ్రాన్సులోని నైస్‌ ఎయిర్‌పోర్టు నుండి జూలై 7 న హెలికాప్టర్‌లో తన బోటు మీదకు తెప్పించుకున్నాడు. బోటులో యితర సౌకర్యాలతో బాటు హెలిపాడ్‌ కూడా వుంది. 20 మంది సిబ్బంది వున్నారు. విహారం ముగిసిన తర్వాత జులై 9 న మళ్లీ హెలికాప్టర్‌ ద్వారా నైస్‌ ఎయిర్‌పోర్టులో దింపేశారు. వాళ్లు అక్కడినుండి ఫ్రాంక్‌ఫర్ట్‌ మీదుగా ముంబయి చేరుకున్నారు. ఇది జరిగిన ఏడు వారాలకు పూర్తీ-ఎస్సార్‌ గ్రూపు ఒప్పందం కుదిరింది. ఎస్సార్‌ ఆశలు ఫలించాయి. నితిన్‌ ఎంపీగా, మంత్రిగా అయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని మహాన్‌ కోల్‌ బ్లాక్‌లో ఎస్సార్‌ పవర్‌, హిందాల్కో భాగస్వాములుగా వున్నారు. పర్యావరణ శాఖ నుంచి అనుమతులు రాకుండానే ప్రాజెక్టు చాలా మేరకు కట్టేశారు. 

యుపిఏ మంత్రులు జైరాం రమేశ్‌, జయంతీ నటరాజన్‌ ప్రాజెక్టును ముందుకు పోనీయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు నితిన్‌ వంటి కార్పోరేట్‌ మిత్రుడు మంత్రి అయ్యారు. ఆయన రూరల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా వుండగానే భూసేకరణ చట్టానికి సవరణలు ప్రతిపాదించాడు. కార్పోరేట్లు-ప్రభుత్వం కలిసి చేసే పిపిపిలకు 70% మంది స్థానికులు అనుమతి యివ్వాలని, ప్రయివేటు సంస్థల విషయంలో అయితే అది 80% అని యుపిఏ చేసిన చట్టానికి తూట్లు పొడవాలని సూచించినవాడు యితనే. వాటి ఆధారంగానే ఆర్డినెన్సు వెలువడింది. దాన్ని చట్టంగా చేయబోతే యిది రైతులకు వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో బిజెపి పునరాలోచనలో పడింది. కార్పోరేట్‌ బాంధవుడనే ముద్ర పడుతున్నందువలన కాబోలు, నితిన్‌ను నాలుగు నెలల క్రితమే ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. ఇప్పుడు పెట్రోలియం శాఖ డాక్యుమెంట్ల లీకు కేసు నిందితులలో ఎస్సార్‌కు చెందిన వినయ్‌ కుమార్‌ కూడా వున్నారు. ఇప్పుడీ విహారయాత్ర విషయం బయటకు వచ్చాక నితిన్‌ను వివరణ అడిగితే ''అదెలా వుంటుందో చూడ్డానికి వెళ్లాను. అయినా నేను కార్పోరేట్ల దగ్గర్నుంచీ ఎప్పుడూ డబ్బు తీసుకోలేదు.'' అని జవాబిచ్చాడు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]