ఇంగ్లాండ్‌ ఇంటికి.. బంగ్లా క్వార్టర్స్‌కి

క్రికెట్‌కి పుట్టిల్లుగా ఇంగ్లాండ్‌ గురించి చెప్పుకుంటాం. ఒకప్పుడు క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ రారాజుగా వెలిగింది. అప్పుడప్పుడూ అన్ని జట్లలానే ఇంగ్లాండ్‌ బలహీనమవుతున్నా, వెంటనే పుంజుకోవడం ఇంగ్లాండ్‌కి కొత్తేమీ కాదు. క్రికెట్‌ పుట్టింది తమ దేశంలోనేనని గొప్పగా…

క్రికెట్‌కి పుట్టిల్లుగా ఇంగ్లాండ్‌ గురించి చెప్పుకుంటాం. ఒకప్పుడు క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ రారాజుగా వెలిగింది. అప్పుడప్పుడూ అన్ని జట్లలానే ఇంగ్లాండ్‌ బలహీనమవుతున్నా, వెంటనే పుంజుకోవడం ఇంగ్లాండ్‌కి కొత్తేమీ కాదు. క్రికెట్‌ పుట్టింది తమ దేశంలోనేనని గొప్పగా చెప్పుకునే ఇంగ్లాండ్‌.. వన్డే వరల్డ్‌ కప్‌ని చేజిక్కించుకోవడంలో మాత్రం ఇప్పటిదాకా సఫలం కాలేదు. తాజాగా మరోమారు ఇంగ్లాండ్‌కి నిరాశే ఎదురయ్యింది. కప్‌ సంగతి తర్వాత, కనీసం క్వార్టర్స్‌కి చేరలేకపోయింది ఇంగ్లాండ్‌.

బంగ్లాదేశ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ పరాజయం పాలయ్యింది. క్రికెట్‌లో పసికూనలుగా చెప్పబడే జట్లలో బంగ్లాదేశ్‌ కూడా ఒకటి. అనూహ్య సంచనాలు బంగ్లాదేశ్‌కి కొత్తేమీ కాదు. అలానే ఈ వరల్డ్‌ కప్‌లోనూ బంగ్లాదేశ్‌ సంచలనం నమోదు చేసింది. కీలక మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ని ఇంటిదారి పట్టించింది బంగ్లాదేశ్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌, 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది.

276 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌, 260 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఇంకో తొమ్మిది బంతులు మిగిలి వుండగానే, వికెట్లు పారేసుకోవడంతో మ్యాచ్‌ని కోల్పోవడమే కాక, ఇంగ్లాండ్‌ వరల్డ్‌ కప్‌ నుంచి కూడా ఔట్‌ అవడం గమనార్హం. ఇంగ్లాండ్‌పై సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించిన మహ్మదుల్లాకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఇదిలా వుంటే, వరల్డ్‌ కప్‌లో బంగ్లా క్వార్టర్స్‌కి చేరింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌, భారత్‌తో తలపడే అవకాశాలున్నాయి.