ఎమ్బీయస్‌: తెలంగాణ మెడకు రాయి- రాయల తెలంగాణ 2

Click here for part 1 Advertisement జయపాల్‌ రెడ్డిగారికి తోడు దామోదర రాజనరసింహ కూడా యిరకాటంలో పడ్డారు. గత ఆర్నెల్లగా కాంగ్రెసు అధిష్టానం ఆయనకు తెగ విలువ యిచ్చేసింది. అప్పటిదాకా సారథ్యం వహిస్తూ…

Click here for part 1

జయపాల్‌ రెడ్డిగారికి తోడు దామోదర రాజనరసింహ కూడా యిరకాటంలో పడ్డారు. గత ఆర్నెల్లగా కాంగ్రెసు అధిష్టానం ఆయనకు తెగ విలువ యిచ్చేసింది. అప్పటిదాకా సారథ్యం వహిస్తూ వచ్చిన జానారెడ్డిగార్ని పక్కన పడేసి, యీయన్ని పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌ యిమ్మన్నారు. అప్పణ్నుంచి యీయన 'తెలంగాణ సాధించిన వీరుడు'  పాత్ర ధరించడం మొదలుపెట్టారు. తెరాస ఏ డిమాండ్లు పెడితే అవే తనూ చెపితే 'మేం ఎక్కడా రాజీ పడం' అనే యిమేజి బిల్డప్‌ యిచ్చారు. చూడబోతే ఆయన చెప్పినది ఏదీ జరగడం లేదు. హైదరాబాదు పరిమితి ఎంసిఎచ్‌ అంటే ముఠా వారు జిఎచ్‌ఎంసి అన్నారు, హైదరాబాదుపై శాంతిభద్రలు, ఆంక్షలు ఒప్పుకోం అంటే గవర్నరు చేతికి యిస్తాం అంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఎదురు చూడని విధంగా రాయల తెలంగాణ అన్నారు. పిలిచి 'నువ్వెళ్లి మిగతావాళ్లని కన్విన్స్‌ చేసి రా' అన్నారు.

తను ప్రేమించి, హంస రాయబారం నడిపిన దమయంతి స్వయంవరానికి నల మహారాజు వెళుతూంటే ఇంద్రాది దేవతలు దారిలో తగిలారు. నువ్వో ఉపకారం చేయాలి అన్నారు. సరే అని మాటిచ్చేశాడు మహానుభావుడు. అప్పుడు చెప్పారు – 'అదృశ్యరూపుడిగా వెళ్లే శక్తి నీకిస్తాం. నువ్వు దమయంతిని రహస్యంగా కలిసి, మా గురించి గొప్పగా చెప్పి, దమయంతిని కన్విన్స్‌ చేసి మాలో ఒకరిని పెళ్లాడేట్లా చేయాలి' అని. తెల్లబోయినా నలమహారాజు సరేనన్నాడు – యిచ్చిన మాట కోసం. ఇప్పుడు రాజనరసింహ కూడా రాజ'నల'సింహ అయ్యారు.

పోలిక ఏమిటంటే – రాయల తెలంగాణ ఏర్పడితే రెడ్లను ఆకట్టుకోవచ్చని కాంగ్రెసు ప్లానుట. ఆంధ్రలో నాయకత్వం కమ్మ లేదా కాపుకి పోయినా, తెలంగాణలో రెడ్డి ముఖ్యమంత్రి అయేందుకు భూమిక తయారుచేశారట. కాంగ్రెసుకు వెన్నుదన్నుగా నిలిచిన రెడ్లకు యిది ఆ పార్టీ యిచ్చే కానుకట. ఇదే జరిగితే దామోదరకు ముఖ్యమంత్రి పదవి హుళక్కి. విభజన జరిగితే దళిత, బిసి, మైనారిటీలకు అధికారం వచ్చేస్తుందని వూదరగొట్టి (ఎలా వస్తుందో నాకు అస్సలు అర్థం కాదు) ప్రచారం చేయడంతో దామోదర పాపం తెలంగాణ సిఎం సీటుపై ఆశ పెట్టుకుని వుంటారు. ఇప్పుడు యీ రాయల తెలంగాణ పేరు చెప్పి రెడ్డికి పదవి అప్పగించాలంటే ఆయనకు దుఃఖం వస్తుంది. తనకు నష్టం కలిగే పనిని సానుకూలం చేసే పని హై కమాండ్‌ తనకే అప్పగించింది. అదే కాంగ్రెస్‌ చేసిన తమాషా, ఏం ఆ పనిని ఆస్థాన శకునిగా వున్న జయపాల్‌ రెడ్డిగారికి అప్పగించవచ్చుగా, ఆయనతో మంతనాలాడవచ్చుగా. లేదా జానారెడ్డికి చెప్పవచ్చుగా. వాళ్లు రెడ్లు. రాయల తెలంగాణ అనగానే వెంటనే – 'ఏం రెడ్లు రాజ్యం చేద్దామనా?' అంటారేమో అని ఆ పని దళితుడికి అప్పగించారు.  

తెలంగాణలో మొదటినుండి రాజకీయంగా రెడ్లు, వెలమలే పోటీ పడ్డారు. రెడ్లదే పై చేయి అవుతూ వచ్చింది. ఇప్పటిదాకా వెంగళరావు ఒక్కరే వెలమ ముఖ్యమంత్రి. తెరాస ఆవిర్భవించినపుడు కెసియార్‌ వెలమ కాబట్టి వెలమలు ఎక్కువగా ఆదరించారు. ముఖ్యమైన పదవులను కెసియార్‌ కుటుంబసభ్యులు, బంధువులు అలంకరించారు. కెసియార్‌తో పాటు నడిచిన తక్కినవారు అతిత్వరలోనే తప్పుకున్నారు. ఆలె నరేంద్ర – కెసియార్‌తో యించుమించు సమానస్థాయిలో  కొంతకాలం వున్నారు, తర్వాత దూరమయ్యారు. సంతోష్‌రెడ్డి కొంతకాలం వుండి పార్టీ మారిపోయారు. విజయశాంతి కొన్నాళ్లు వెలిగారు. తర్వాత వేదిక మీద వున్నా మాట్లాడించ నివ్వలేదు. తెరాసలో వున్న ముఖ్యమైన నాయకుల్లో రెడ్డి – నాయిని నరసింహారెడ్డి ఒకరే. ఆయనకు ముఖ్యమైన బాధ్యతలు ఏవీ అప్పగించినట్టు తోచదు. టిక్కెట్ల పంపిణీలో కూడా ఆయన మాట చెల్లుతుందనుకోను. ఏదో అప్పుడప్పుడు ప్రకటనలు యివ్వడానికి, టీవీ చర్చల్లో మాట్లాడడానికి పనికి వస్తారంతే.

తెరాస ఎదుగుతున్నకొద్దీ వెలమలలో కొంత వుత్సాహం వచ్చినమాట నిజం. కొందరు యితర పార్టీల్లోంచి వచ్చి చేరారు. నాగం జనార్దనరెడ్డి తెరాసలో చేరబోయి, ఆగిపోయి, బిజెపిలో చేరడానికి కులం ఒక కారణమేమో తెలియదు. 10 జిల్లాల తెలంగాణ ఏర్పడితే కనీసం ఒక ఛాన్సుకైనా వెలమ ముఖ్యమంత్రి వస్తాడని అనుకుంటున్న తరుణంలో యిప్పుడు కాంగ్రెసు రాయల తెలంగాణ తెచ్చింది. రాయలసీమలో రెడ్ల ప్రాబల్యం ఎలాగూ వుంది, వాళ్లు తెలంగాణ రెడ్లతో కలిస్తే – వాళ్లదే పై చేయి అవుతుంది. పైగా కర్నూలు, మెహబూబ్‌ నగర్‌ జిల్లాల వారికి బాంధవ్యాలు కూడా వున్నాయి.

రెడ్డి, వెలమ గొడవ మాట ఎలా వున్నా రాయల తెలంగాణ ఏర్పడితే తెరాస బలం పలుచనవుతుంది. పది జిల్లాల తెలంగాణలో తెరాసకు 30% సీట్లు కచ్చితంగా వస్తాయనుకుంటే 12 జిల్లాల రాయల తెలంగాణలో అది 25%కు తగ్గిపోతుంది. బిజెపి బూచి చూపించి, తెలంగాణ జిల్లాలలో కూడా సీట్లు సంపాదించి మజ్లిస్‌ తన బలాన్ని 6% సీట్ల నుండి 12% శాతం సీట్లకు పెంచుకోవచ్చు. హైదరాబాదులో సీమాంధ్రులకు రక్షణ కల్పించే భారం వహిస్తామని కాన్వాస్‌ చేసుకుంటే 15% సీట్లు కూడా రావచ్చు. ఇప్పటివరకు తెలంగాణలో ప్రధానపార్టీలు కాంగ్రెసు, తెరాస అనుకుంటే ఆ రెండు జిల్లాలు వచ్చి కలిస్తే అక్కడ బలంగా వున్న టిడిపి, వైకాపాలు యీ రాష్ట్రంలో భాగమై అవి కూడా రాయల తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ శాతం ఓట్లు, సీట్లు తెచ్చుకుంటాయి. కాంగ్రెసు సంగతి సరేసరి.

ఈ విధంగా చూస్తే రాయల తెలంగాణకు అంగీకరించడం అంటే తెరాసకు ఆత్మహత్యాసదృశమే. అందుకే అది రేపు నిరసనలు, ఎల్లుండి బంద్‌ అంటోంది. అది అంతటితో ఆగదు. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన పార్టీలన్నీ తెలంగాణ ద్రోహులే అంటుంది. ఆ మాట ఒక్కటి చాలు – కాంగ్రెసు, బిజెపిలను వణికించడానికి. ఒకరితో మరొకరు పోటీపడి దీన్ని నిరాకరిస్తారు. టి-జాక్‌, టి-ఉద్యమకారుల సంగతి సరేసరి. వాళ్లూ ససేమిరా అంటారు. (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)

Click here for part 1

[email protected]