షారూఖ్ ఖాన్ ముంబయిలోని బాంద్రా బీచ్ వద్ద సముద్రానికి ఎదురుగా ''మన్నత్'' పేర భవంతి కట్టుకున్నాడు. 2002లో రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అతనికి ఆ ప్లాటు లీజు కిచ్చింది. కొన్ని షరతులతో అక్కడ యిల్లు కట్టుకోవడానికి జిల్లా కలక్టరు అనుమతి యిచ్చాడు. ఇల్లు కట్టుకోవడంతో మనవాడు ఆగలేదు. 2007లో యింటి ముందు వున్న రోడ్డుపై 1.5 మీటర్ల ఎత్తులో 70 మీటర్ల పొడవుతో ఓ ర్యాంప్ (రోడ్డు మీద వంతెన) కట్టేసి, దానిమీద తన వ్యాన్ పార్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది ఆక్రమణ కిందే వస్తుంది. సముద్రతీరంలో అక్రమనిర్మాణం కాబట్టి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అథారిటీ కూడా చర్య తీసుకోవచ్చు. అయినా అతని పలుకుబడి చూసి మునిసిపాలిటీ అధికారులు కానీ కోస్టల్ అధికారులు కానీ నోరెత్తలేదు. అయితే అతని కర్మానికి ఆ వీధిలోనే కాస్త ముందుకు వెళితే 300 ఏళ్ల నాటి మౌంట్ మేరీ బేసిలికా చర్చ్ వుంది. దానికి అనేక మంది క్రైస్తవులు వెళుతూ వుంటారు. ఏటా లక్షలాది భక్తులు పాల్గొనే పెద్ద ఉత్సవం కూడా జరుగుతూంటుంది. 2010లో అలాటి ఉత్సవం జరిగినపుడు యీ ర్యాంప్‌పై ప్రజల ఒత్తిడి పడకుండా పోలీసులు ఆ రోడ్డుకి అడ్డంకులు (బ్యారికేడ్లు) కట్టేసి భక్తులను అటువైపు వెళ్లనీయకుండా చేసి వారికి యిబ్బంది కలిగించారు. ఎందుకా అని ఆరా తీస్తే షారుఖ్ గారి అక్రమ నిర్మాణాన్ని కాపాడడానికి అని తెలిసి వారు మండిపడ్డారు. కాథలిక్ సంస్థలు అనేకం కలిసి షారుఖ్‌పై ఫిర్యాదులు గుప్పించారు. వారికి స్థానిక కాలనీవాసుల సంఘాలు తోడయ్యాయి. కానీ కార్పోరేషన్ పట్టించుకోలేదు. 2013 నాటికి వారి ఆందోళన తారస్థాయికి చేరింది. 300 మంది కాలనీవాసులు, క్రైస్తవ సంఘాలవారు ఉత్సవం మొదటి రోజున అడ్డంకి వద్ద కొన్ని గంటలపాటు నినాదాలు యిచ్చి నిరసన వ్యక్తం చేశారు. మునిసిపల్ కమిషనర్, మునిసిపల్ మంత్రి, ముఖ్యమంత్రి.. ఎవరూ స్పందించలేదు.
అప్పుడు వాచ్‌డాగ్ ఫౌండేషన్ రంగంలోకి దిగింది. గాడ్‌ఫ్రే పిమెంటా అనే లాయరు, నికొలస్ అల్‌మీడా అనే కార్పోరేటరు దానిలో ప్రముఖులు. ఇద్దరూ కలిసి నడుం కట్టారు. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి పోట్లాడితే ర్యాంప్ కూల్చేయమని ఆయన అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ సెక్రటరీకి లేఖ పంపించారు, రెండు సార్లు. అయినా ఆచరణలో ఏమీ జరగలేదు. మునిసిపల్ కమీషనర్‌ను వెళ్లి నిలదీస్తే ఆయన ఆ వార్డుకి లేఖ రాసి సంగతేమిటో చూడమన్నాడు. ఆచరణ శూన్యం. బాబా సిద్దిఖి అనే మాజీ ఎమ్మెల్యే, ప్రియా దత్ (సునీల్ దత్ కుమార్తె) అనే మాజీ ఎంపీ.. అందరూ విని నోరు చప్పరించినవారే తప్ప సాయపడలేదు. కమిషనర్‌పై, షారూఖ్ పై క్రిమినల్ కంప్లయింట్ యిచ్చి కేసు పెట్టారు. కోర్టు దాన్ని పెండింగులో పెట్టింది. ఇక వీళ్లు షారూఖ్ ఖాన్ యింటి గురించి, దానికి యిచ్చిన అనుమతుల గురించి సమాచార హక్కు కింద వివరాలు కోరారు. పన్నెండు సార్లు అప్లయి చేయగా అప్పుడు వెలుగులోకి వచ్చింది – లీజు సంగతీ, షరతుల సంగతీ. షరతు ఉల్లంఘిస్తే ఆ ప్లాటును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వెసులుబాటు కూడా వుంది. ఒక ఫారంలో షారుఖ్, అతని భార్య గౌరి సంతకాలు వున్నాయి కానీ పైనంతా ఖాళీగానే వుంది. అయినా డిపార్టుమెంటు వాళ్లు అనుమతి యిచ్చేశారు! షారుఖ్ పలుకుబడి స్థాయి తెలుపుతుందిది.
కితం ఏడాది బిజెపి అధికారంలోకి రావడంతో పోరాట వీరులకు ధైర్యం, అధికారులకు భయం కలిగింది. బిజెపి ఎమ్మెల్యే అశీశ్ షెలార్, ఎంపి పూనమ్ మహాజన్ మునిసిపల్ కమిషనర్‌కు లేఖలు రాసి సంగతేమిటో చూడమన్నారు. వాచ్‌డాగ్ ఫౌండేషన్ వారు ఫిబ్రవరి 3 న మునిసిపల్ కమిషనర్‌కు లేఖ రాశారు – 24 గంటల్లో మీరు కూల్చేయకపోతే మేం పిల్ దాఖలు చేస్తాం, మీ పరువు బజారు కెక్కిస్తాం అని. ''చెన్నయ్ ఎక్స్‌ప్రెస్'' సినిమాలో షారుఖ్ మాటిమాటికీ 'డోంట్ అండర్‌ఎస్టిమేట్ పవర్ ఆఫ్ కామన్ మ్యాన్' అని చెప్పిన డైలాగు సారాంశం యిదే కాబోలు అనుకుని కమిషనర్ ఫిబ్రవరి 6 న షారుఖ్‌కు 'ర్యాంప్ మీ అంతట మీరే కూల్చేస్తారా, మమ్మల్ని కూల్చేయమంటారా?' అని నోటీసు పంపారు. షారూఖ్ సమాధానం ఏమిచ్చాడో తెలియదు కానీ ఫిబ్రవరి 14 న 35 మంది మునిసిపల్ అధికారులు, 40 మంది కార్మికులు వచ్చి దాన్ని కూల్చేశారు. కూల్చినందుకు అయిన ఖర్చును షారుఖ్ దగ్గర వసూలు చేస్తారని పుకారు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)