నరాలు తెగే ఉత్కంఠ అంటే ఏంటో చిన్న జట్లే ఎక్కువగా రుచి చూపిస్తున్నాయి క్రికెట్ అభిమానులకి. ఆ మధ్య ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్‌లో జరిగిన మ్యాచ్ మంచి కిక్ ఇచ్చింది. ఆ తర్వాత అంతటి కిక్.. అంటే చిన్న జట్ల మధ్యనే చాలా సందర్భాల్లో జరిగిందనొచ్చు. తాజాగా ఐర్లాండ్, జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠను సృష్టించింది.
ఉత్కంఠ పోరులో జింబాబ్వే ఓటమి పాలైనా, ఆ జట్టు ఆటగాళ్ళు ప్రదర్శించిన తెగువను మాత్రం అభినందించకుండా వుండలేం. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారీ స్కోర్ సాధించింది. 50 ఓవర్లలో 331 పరుగులు చేసింది ఐర్లాండ్. 332 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగన జింబాబ్వే, ఓ దశలో లక్ష్యాన్ని సాధించేలానే పరుగుల వరద పారించింది. అయినాసరే, ఐర్లాండ్ పట్టు విడవలేదు. చివరి ఓవర్‌లో మూడు బంతుల్లో రెండు వికెట్లు తీసి, తమ జట్టుకు విజయాన్ని అందించాడు ఐర్లాండ్ బౌలర్ కసాక్. జింబాబ్వే 49.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
చివరి ఓవర్‌లో రెండు వికెట్లు కాపాడుకోగలిగి వుంటే, మ్యాచ్‌ని గెలిచేదే జింబాబ్వే. ఐర్లాండ్ ఆటగాళ్ళలో జోయ్‌సె సెంచరీ చేస్తే, జింబాబ్వే ఆటగాళ్ళలో టేలర్ సెంచరీ సాధించాడు. ఐర్లాండ్ ఆటగాడు ఆండీ 97 పరుగులకు ఔటయితే, జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ 96 పరుగులు చేశాడు.