‘ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకూ గురువుగారు బతికుండుంటే ఆయన ఇతివృత్తంగా మరిన్ని సీన్లు, పాటలుండేవి..’ అన్నారు కమల్. ‘ఉత్తమ విలన్’ సినిమా ఆడియో విడుదల వేడుకలో కమల్ ఈ ప్రకటన చేశారు. తమ గురువు కైలాసం బాలచందర్ మరణంపై కమల్ ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. బాలచందర్ ‘ఉత్తమ విలన్’లో నటించడం. ఆయనది ఒక కీలక పాత్ర అని కమల్ ఇది వరేక ప్రకటించారు. బాలచందర్ తన వందో సినిమా ‘అబద్ధం’తో పాటు చాలా సినిమాల్లో కనిపించారు.. సీరియళ్లలో కూడా నటించారు. మరణానంతరం కూడా ఆయన శోభ ఇప్పుడు తెరపై కనిపిస్తున్న నేపథ్యంలో ఈ దర్శక నటుల ప్రస్తావన. నిజజీవిత పాత్రల్లో.. గెస్టు రోల్స్‌లో కనిపించిన వారిని కాకుండా.. నటనను సీరియస్‌గా తీసుకొన్న వారి జాబితా, వివరాలు ఇవి.
ఒక లెజెండరీ దర్శకుడు ఒక భారీ బడ్జెట్ సినిమాలో కీలక పాత్ర పోషించడం ఆసక్తికరమైన అంశమే. ‘ఉత్తమ విలన్’కు సంబంధించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదే సినిమాలో కమల్‌తో అద్భుతం అనదగ్గ చిత్రాలను తీసిన కే.విశ్వనాథ్ కూడా నటించడం. విశ్వనాథ్ తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. ఒకవైపు దర్శకుడిగా సినిమాలను రూపొందిస్తూనే ఈయన నటుడిగా కూడా కనిపిస్తున్నారు.
కేవలం బాలచందర్, విశ్వనాథ్‌లు మాత్రమే కాదు దక్షిణాదిలో ఇలాంటి దర్శక నటులు ఎంతో మంది ఉన్నారు. తెర వెనుక ఉండి సినిమాలు రూపొందించిన వారే తెరపై కూడా నటసార్వభౌములుగా వెలిగారు, వెలుగుతున్నారు. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి.. ఏదో పార్ట్ టైమ్‌గా నటించడం కాకుండా.. నటననూ సీరియస్‌గా తీసుకొని వెలుగు వెలిగిన వారున్నారు. అయితే ఇలాంటి వారు తెలుగులో కన్నా తమిళ భాషలోనే ఎక్కువమంది ఉండటాన్ని కూడా గమనించవచ్చు.
ఈ క్యాటగిరిలో ముందుగా ప్రస్తావించుకోవాల్సింది భాగ్యరాజ్‌ను. ఈ తమిళ దర్శకుడు కమ్ హీరో ఈ రెండు విభాగాల్లోనూ అవార్డులు అందుకొనే స్థాయి ప్రదర్శననిచ్చారు. కెరీర్ ప్రాంరంభంలో ప్రముఖ తమిళ దర్శకుడు భారతిరాజా వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు భాగ్యరాజ్. ‘‘పదహారేళ్ల వయసు’’ ‘‘తూర్పు వెళ్లే రైలు’’ వంటి సినిమాల తమిళ వెర్షన్లకు భారతిరాజా వద్ద భాగ్యరాజ్ సహాయదర్శకుడు. ఆ తరువాత భారతిరాజా రూపొందించిన ‘‘టిక్ టిక్ టిక్’’ వంటి క్రైమ్ థ్రిల్లర్‌కు స్క్రిప్ట్‌ను అందించారు భాగ్యరాజ్. నటనపై మక్కువ గల భాగ్య రాజ్ ‘‘16 వయతినిలే’’ సినిమా నుంచినే ఏదో చిన్న క్యారెక్టర్‌లో కనిపించడం మొదలుపెట్టాడు. భారతిరాజా వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తూనే నటనపై ఆసక్తిని చాటుకొన్న తనే దర్శకుడిగా మారిన తర్వాత చెలరేగిపోయాడు. రంగూపొంగూ లేకపోయినా భాగ్యరాజ్ హీరోగా రాణించాడు. మధ్యతరగతి, తమిళనాడు గ్రామీణ పరిస్థితుల మధ్య సాగే కథలను తయారు చేసుకొని నటుడిగా, దర్శకుడిగా సత్తాచాటాడు భాగ్యరాజ్. ఆయన తమిళంలో చేసిన సినిమాలు బాలీవుడ్‌లో కూడా రీమేక్ అయ్యాయి. తెలుగు సరిగా మాట్లాడలేడు కానీ ఈ హీరో కమ్ దర్శకుడు మనకూ సుపరిచితుడే!
ఇక భాగ్యారాజ్ తరువాత దర్శకనటుల క్యాటగిరిలో స్టార్ స్టేటస్ ఎదిగిన మరో ప్రతిభావంతుడు ఉపేంద్ర. 1995లో కన్నడలో విడుదలైన ‘ఓమ్’ సినిమాతో దర్శకుడిగా సంచలనమే సృష్టించాడు ఉప్పీ. అంతకన్నా ముందే రెండు సినిమాలు చేసినా శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ‘ఓమ్’ ఉప్పీని ఒక్కరాత్రి స్టార్‌ను చేసింది. ఆ తర్వాత ఎక్కువ విరామం ఇవ్వకుండా తన తెరపైకి వచ్చేశాడు. ‘ఏ’ సినిమాతో నటదర్శకుడిగా సత్తాచాటాడు. అక్కడ నుంచి ఉప్పీ సినిమాలు తెలుగులోకి కూడా డబ్ కావడం మొదలైంది. ఇతడికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. మధ్యలో చాలా సంవత్సరాలు ఉప్పీ దర్శకత్వాన్ని పక్కనపెట్టేసి నటనమీదే దృష్టి నిలిపాడు. డైరెక్టర్‌గా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినా అదంత సెక్సస్ ఫుల్‌గా లేదు. అయినా దక్షిణాదిలో ఒక వైవిధ్యమైన దర్శక, నటుడిగా ఉప్పీ ఖ్యాతి శాశ్వతం.
మణివణ్ణన్.. మనకు బాగా పరిచయస్తుడే. తమిళం నుంచి అనువాదమయిన సినిమాలను చూస్తుంటే అందులో మణివణ్ణన్ రోల్‌కు కోట శ్రీనివాసరావో, కోట శంకర్రావో డబ్బింగ్ చెబితే దానికొక పూర్ణత వస్తుంది. మనకు నటుడిగా పరిచయమున్న మణి దర్శకుడిగా దాదాపు 50 సినిమాలు రూపొందించాడు! ఈయన కూడా మొదట మెగాఫోన్ పట్టి తర్వాత తెరపైకి ప్రమోషన్ పొందిన వ్యేక్త. మొదట భారతిరాజా వద్దనే డైలాగ్ రైటర్‌గా ఉండిన మణి అవకాశాలు కలిసిరావడంతో దర్శకత్వ బాధ్యతల్లోకి దిగిపోయాడు. ఆ తర్వాత భారతిరాజా దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోనే విలన్ వేషాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. అలా నటుడిగా కొనసాగుతూనే మెగాఫోన్‌ను కూడా పట్టాడు మణివణ్ణన్ ఈ పరంపరలో ‘అమైదిపడై’ అనే సంచలన సినిమాను రూపొందించాడు. సత్యరాజ్ హీరో నటించిన ఈ సినిమానే తెలుగులో మోహన్ బాబు హీరోగా ‘‘ఎం.ధర్మరాజు ఎం.ఏ’’గా రీమేక్ అయ్యింది. ‘అమైదిపడై’కు సీక్వెల్‌గా మణివణ్ణన్ ‘నాగరాజు చోలన్ ఎం.ఏ, ఎమ్మెల్యే’ తీశాడు. ఇందులో కూడా సత్యరాజ్ హీరోగా నటించాడు. ఇది మణి తీసిన 50వ సినిమా ఇది పూర్తయిన కొన్ని రోజులేక మణి హర్ట్ ఎటాక్‌తో మరణించారు.
దర్శకనటుడిగా ప్రస్తావించుకోగల మరో కన్నడ స్టార్ రవిచంద్రన్. శాండల్ వుడ్‌లో క్రేజీస్టార్‌గా గుర్తింపు పొందిన రవిచంద్రన్ దర్శకత్వంలో తెలుగులో కూడా ఒక సినిమా వచ్చింది. నాగార్జున నటించిన వైవిధ్యమైన సినిమా ‘శాంతి క్రాంతి’కి రవిచంద్రనే దర్శకుడు. కన్నడలో పాతతరం నిర్మాత తనయుడు అయిన రవిచంద్రన్ అనేక రీమేక్ సినిమాల్లో నటిస్తూ, దర్శకత్వం వహించాడు. అలాగే కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా దర్శకుడే! ఈయన కూడా కొన్ని రీమేక్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.
కమల్ సినిమాల్లో కనిపించే వారిలో కూడా చాలా మంది దర్శకులున్నారు. విడుదలకు సిద్ధం అవుతున్న కమల్ సినిమాకు దర్శకత్వం వహించింది కూడా ఎన్నో సినిమాల్లో నటించిన రమేశ్ అరవింద్. అయితే అరవింద్ నటుడిగా గుర్తింపు సంపాదించుకొన్నాకా దర్శకుడయ్యాడు. కాబట్టి పై స్టార్లతో ఈయనకు పోలిక ఉండదు. ‘మహానది’ వంటి అధ్భుతమైన సినిమాను రూపొందించిన సంతానభారతి కమల్ సినిమాల్లోనే కనిపిస్తూ ఉంటాడు. పంచతంత్రం, బ్రహ్మచారి, సత్యమే శివం వంటి కమల్ సినిమాల్లో సంతాన భారతి కనిపిస్తాడు. సీనియర్ దర్శకుడు మౌళి కూడా కమల్ సినిమాలో కనిపించాడు. ఇక సుందర్.సి కూడా దర్శకుడిగా సూపర్ హిట్ సినిమాలు రూపొందించి తర్వాత నటుడయ్యాడు.
తెలుగు వరకూ దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకొని నటుడిగా ట్రయల్స్ వేసిన వ్యక్తిగా విశ్వనాథ్ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డిని ప్రముఖుడిగా చెప్పుకోవాలి. ముందుగా ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ వంటి సినిమాతో దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించి శుభలగ్నం, మావిచిగురు, వినోదం వంటి సినిమాలతో సూపర్ హిట్లను కొట్టాకా.. నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోలను డైరెక్ట్ చేసిన తర్వాత కృష్ణారెడ్డి హీరోగా మారాడు. ఉగాది, అభిషేకం వంటిసినిమాలు చేశాడు. అయితే అవేవీ అంత సెక్సస్ ఫుల్ కాకపోవడంతో వెనక్కుతగ్గాడు. కొసమెరుపు ఏమిటంటే 0లలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘కిరాతకుడు’ సినిమాలో కృష్ణారెడ్డి చిన్న రోల్‌లో కనిపించాడు. అంతకన్నా మునుపే ‘పగడాలపడవ’ అనే సినిమాలో ఎస్వీ హీరోగా నటించారు. అయితే అది విడుదలకు నోచుకోలేదు.
ఇలా దర్శకులుగా తమ ప్రత్యేకతను చాటుకొని తర్వాత నటులుగా మారిన వారెంతో మంది. సముద్రఖని, పి.వాసు వంటి వాళ్లు కూడా ఈ జాబితాలోని ప్రముఖులే. భారతిరాజా కూడా మణిరత్నం తీసిన ‘యువ’ సినిమాలో నటించారు. ఇదీ గత రెండు మూడు దశాబ్దాల్లో తెరవెనుక మెరిసి.. తర్వాత తెరపైకి షిఫ్ట్ అయిన వారి కథ.