ఎమ్బీయస్‌ : వార్ధక్యంలో కూడా తిరగబడడం మానలేదు

కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పార్టీ కురువృద్ధుడు 91 ఏళ్ల విఎస్‌ అచ్యుతానందన్‌ ఫిబ్రవరి 21 న కేరళలోని అళప్పుళాలో జరిగిన పార్టీ రాష్ట్రసమావేశంలో నిరసనతో వాకౌట్‌ చేశారు. 50 ఏళ్ల క్రితం 1964…

కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పార్టీ కురువృద్ధుడు 91 ఏళ్ల విఎస్‌ అచ్యుతానందన్‌ ఫిబ్రవరి 21 న కేరళలోని అళప్పుళాలో జరిగిన పార్టీ రాష్ట్రసమావేశంలో నిరసనతో వాకౌట్‌ చేశారు. 50 ఏళ్ల క్రితం 1964 ఏప్రిల్‌లో అప్పటి ఐక్య కమ్యూనిస్టు పార్టీ జాతీయ కౌన్సిల్‌ నుండి కూడా యిలాగే వాకౌట్‌ చేశారు. తేడా అల్లా అప్పుడు ఆయనతో పాటు 30 మంది కామ్రేడ్లు వెంటనడిచారు. ఇప్పుడు ఆయన ఒంటరిగా బయటకు వెళ్లాడు. కారణం- సిద్ధాంతపరంగా యిన్నేళ్లలో సిపిఎంలో వచ్చిన మార్పు ! అచ్యుతానందన్‌ వెళ్లిపోయినది – తనకు ఏదో పదవి దక్కలేదని కాదు. అవినీతికి మారుపేరుగా పేరు తెచ్చుకున్న రాష్ట్ర సెక్రటరీగా వున్న పినరాయి విజయన్‌ పార్టీ ప్రతిష్ట తీస్తున్నాడని ఆయన కేంద్ర నాయకత్వానికి రహస్యలేఖ రాస్తే అది విజయన్‌ పక్షమే వహించింది. ఇటు విజయన్‌ వర్గం ఆయనను పార్టీ వ్యతిరేకిగా ముద్ర కొడుతోంది. అదీ ఆయన అలకకు కారణం. 

విజయన్‌ వ్యవహారాలతో విసిగి పోటీ కమ్యూనిస్టు పార్టీ పెట్టిన టిపి చంథ్రేఖరన్‌ హత్యకు గురయ్యాడు. ఆ హంతకులను విజయన్‌ రక్షిస్తున్నాడని అచ్యుతానందన్‌ ఆరోపణ. పార్లమెంటు ఎన్నికల సమయంలో లెఫ్ట్‌ ఫ్రంట్‌లో ఎన్నో ఏళ్లగా వున్న రివల్యూషనరీ సోషలిస్టు పార్టీకి టిక్కెట్టు యివ్వకపోవడంతో అది కాంగ్రెస్‌ ఫ్రంట్‌లోకి చేరిపోయింది. ఆ విషయంలో కూడా విజయన్‌ను తప్పుపట్టడం జరిగింది. అచ్యుతానందన్‌ గతంలో కూడా అనేకసార్లు యిలాటి ఆరోపణలు చేశారు. పార్టీ పాలిట్‌ బ్యూరో వాటిపై చర్య తీసుకోలేదు, ఆయనపైనా తీసుకోలేదు. ఆయన వయసును, అనుభవాన్ని, ప్రజాదరణను వాళ్లు విస్మరించలేకపోయారు. ఇప్పడీ ఉత్తరాన్ని ఎవరు లీక్‌ చేశారో తెలియదు కానీ, ''మలయాళ మనోరమ''లో ఆ ఉత్తరం అచ్చయింది. రాష్ట్ర యూనిట్‌లో విజయన్‌ వర్గం బలంగా వుంది. వాళ్లు సమావేశానికి ముందుగానే అచ్యుతానందన్‌ పార్టీ వ్యతిరేకి ఒక తీర్మానాన్ని పాస్‌ చేసి పంపిణీ చేశారు. ఆయన యీ తీర్మానానికి అభ్యంతరం తెలుపుతూ బయటకు నడిచాడు. 

అచ్యుతానందన్‌ సమావేశం నుండి వెళ్లిపోగానే తిరిగి రప్పించడానికి ప్రకాశ్‌ కరాట్‌ ఆయనకు ఫోన్‌ చేశాడు. ఉపయోగం లేకపోయింది. ఆయన విధించిన షరతులు అమలు చేయడం మాకు సాధ్యం కాదు అన్నాడు కరాట్‌. త్రిపుర వంటి చిన్న రాష్ట్రంలోనే సిపిఎం పాలిస్తోంది. బెంగాల్‌లో తిరిగి అధికారంలోకి వచ్చే సూచనలు కనబడటం లేదు. కేరళలో ప్రతిపక్షంలో వున్నా ఎంతో కొంత బేస్‌ వుంది. ఇప్పుడీయన మాట వింటే మెజారిటీలో వున్న విజయన్‌ వర్గం పార్టీ విడిచి వెళ్లిపోతే ఎలాగ అని వారి బెంగ. పాలిట్‌ బ్యూరోలో సభ్యులు విజయన్‌ తీర్మానాన్ని తప్పుపడుతూనే అచ్యుతానందన్‌ క్రమశిక్షణారాహిత్యాన్ని కూడా ఖండిస్తూ చర్య తీసుకోవలసినదే అన్నారు. అయితే ఆయన పక్షం వహించిన సీతారాం యేచూరి అలా చేస్తే పార్టీ ప్రతిష్ట జాతీయస్థాయిలో దెబ్బ తింటుంది అని వాదించాడు. ప్రకాశ్‌ కూడా ఔనన్నాడు. 

ఏౖప్రిల్‌లో జరగబోయే పార్టీ కాన్ఫరెన్సులో ప్రకాశ్‌ స్థానంలో యేచూరి వస్తే పాలిట్‌ బ్యూరో దృక్పథం మారవచ్చు. విజయన్‌ వర్గం పంపిణీ చేయించిన తీర్మానంలో అతన్ని లవలీన్‌ కుంభకోణంలో అచ్యుతానందనే యిరికించాడన్న ఆరోపణ వుంటే దాన్ని పాలిట్‌ బ్యూరో తీసేయించింది. రాష్ట్ర సెక్రటరీగా మూడు పర్యాయాలు చేసిన విజయన్‌ తను తప్పుకుని కొడియేరి బాలకృష్ణన్‌కు బాధ్యతలు అప్పగించాడు. అతను విజయన్‌కు కాస్త పగ్గాలు వేసి, పెద్దాయనతో రాజీ పడాలని కేంద్ర నాయకత్వానికి సూచిస్తున్నాడు. మార్చి 20 నాటి పాలిట్‌ బ్యూరో సమావేశం దాకా ఓపిక పట్టమని అచ్యుతానందన్‌కు నచ్చచెపుతున్నాడు. అచ్యుతానందన్‌ కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా వున్నారు. ఆ పదవిలో కొనసాగుతారా, లేక రాజకీయాల్లోంచి తప్పుకుంటారా అన్నది ముందుముందు తెలియాలి. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

mbsprasad@gmail.com