నిందాపూర్వకమైన మాటలతోనే నాన్నకు ప్రేమతో దర్శకుడు సుకుమార్ కు ఒక ఫ్యాన్ నీరాజనాలు పలికాడు. విభిన్న మైన సినిమా తీశాడంటూ సుక్కూ ని ఆకాశానికి ఎత్తేశాడు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో షేర్ అవుతున్న ఈ ఆసక్తి కరమైన 'నాన్నకు ప్రేమతో' షార్ట్ రివ్యూ ఇలా ఉంది…
-కుళ్ళు జోకులు, వెటకారపు పంచ్‌లు, చిన్నాపెద్దా తేడా లేకుండా వాళ్ళ క్యారెక్టరైజేషన్‌తో సంబంధం లేకుండా వెర్రి పుష్పాలను చేయడం… వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌లు వుండగా.. ఎవరికి కావాలయ్యా నీ ఎమోషన్!
-రివేంజ్ డ్రామా అంటే ఎలా వుండాలి? ఒక్క వీరోచితమైన డైలాగ్ లేదు, కనీసం ఒక పీక కూడా తెగలేదు, అంతెందుకు చిన్న స్కూటర్ కూడా గాల్లో లేవలేదు, అందునా ఎన్టీఆర్ వంటి మాస్ హీరోని పెట్టుకుని సినిమా ఇలా తీశావేమయ్యా!
-సినిమాకి వచ్చామా, అర్థంపర్థంలేని సీన్లు చూశామా, పగలబడి విరగబడి నవ్వామా, కాసేపు కేకలు వేసుకున్నామా.. అన్నట్లుండకుండా.. ఫ్రిజుల్లో, ఏసీ రూముల్లో దాచుకున్న మా మెదళ్ళను బయటికి ఎందుకు తీయాలయ్యా!
-ఏం ఫైటయ్యా అది.. హీరోయిన్ చెప్పు జరిపితే వాళ్ళనివాళ్ళే విలన్లు కొట్టేసుకుంటే ఇక మా హీరో ఎందుకయ్యా!
-హీరోయిన్ని పాటల్లో కాకుండా నటనకు ప్రాధాన్యం వున్న కొన్ని సీన్లలో ఇరికించి.. ఎందుకయ్యా సాగదీశావు?
-తెలివి తక్కువవాడు, తెలివిగలవాడు, అతి తెలివిగలవాడు, వాడికి మించిన మరొక తెలివిగలవాడు.. ఏందయ్యా ఈ గోల? మాకు అర్థం కావాలా వద్దా!
చివరిగా: మేము సినిమా చూసేటప్పుడు మా కళ్ళు, చెవులు మాత్రమే పనిచేయాలి.. అలాకాదని మా మెదడుకి పనిచెప్పాలని చూస్తే ‘‘నీకు నెక్ట్స్ సినిమా వుండదు’’