చిరంజీవి పై ఎన్ని ఆశలో?

ఖాళీగా కనిపిస్తే ప్రతీవోడూ కన్నుకొట్టే వాడే అని వెనకటికి మోటు సామెత ఒకటి వుంది. ఖైదీ నెంబర్ 150తో తన స్టామినా ఏమిటో నిరూపించుకుని, ఆ తరువాతి సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు ఆ…

ఖాళీగా కనిపిస్తే ప్రతీవోడూ కన్నుకొట్టే వాడే అని వెనకటికి మోటు సామెత ఒకటి వుంది. ఖైదీ నెంబర్ 150తో తన స్టామినా ఏమిటో నిరూపించుకుని, ఆ తరువాతి సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు ఆ సినిమా ఫిక్సయింది. డైరక్టరూ ఫిక్సయ్యారు.

కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే సదరు సినిమా ఇంకా ప్రీ ప్రోడక్షన్ స్టేజ్ లోనే వుంది. పైగా ఇది కాస్త భారీ సినిమా అని, రెండేళ్లు పడుతుందని మరో టాక్ వుండనే వుంది. అన్నింటికి మించి ఆ సినిమా సెట్ మీదకు వెళ్లడానికే మరో ఆర్నెల్లు పడుతుందని టాక్.

అదిగో అక్కడ, ఆ పాయింట్ కొంత మంది డైరక్టర్లకు,ముఖ్యంగా ఇద్దరు డైరక్టర్లకు ఆశలు రేకెత్తిస్తోంది. ఆ ఆర్నెల టైమ్ ను కాస్త అటు ఇటు చేసి, తమకు ఇస్తే, 'మెగా సార్' తో ఓ మాంచి కమర్షియల్ సినిమా తీసి చేతిలో పెడతామని ఫీలర్లు వదలుతున్నారు.

ఇప్పుడే ఓ సినిమా పూర్తి చేసిన వాళ్లో, మరో నెల రోజుల్లో సినిమా పూర్తయి ఖాళీగా వుండబోతున్నవాళ్లో, ఈ మేరకు ఫీలర్లు వదుల్తూ, గ్యాసిప్ లు పుట్టిస్తూ, సోషల్ నెట్ వర్క్ లో మెగాభిమానుల పేరిట ట్వీట్ లు చేయిస్తూ, వాటిని రీట్వీట్ చేస్తూ, ఇలా చిరంజీవి దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారట.

కానీ సదరు డైరక్టర్ల సినిమాలు, వాటి 'అశలు' స్టామినాలు క్లియర్ గా తెలిసిన మెగా క్యాంప్ ఉలకక, పలకక సైలెంట్ గా వుందని వినికిడి. ఎన్ని చూసి వుంటారు ఇలాంటి వ్యవహారాలు మెగాస్టారు. ఆయన ముందు కుప్పిగంతులా?