మొత్తానికి అనుకున్నంతా అయింది. చాణక్య ఫలితం చూసిన నిర్మాత భోగవిల్లి ప్రసాద్ తను హీరో గోపీచంద్ తో నిర్మించే సినిమాను క్యాన్సిల్ చేసుకున్నారు. కొత్త డైరక్టర్ తో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లాల్సి వుంది. కానీ గోపీచంద్ మార్కెట్ దాదాపు జీరో అయిపోయిందని చాణక్య సినిమా నిరూపించడంతో ఇక తన సినిమాను క్యాన్సిల్ చేసుకోక తప్పలేదు. చాణక్య సినిమా నిర్మాత అనిల్ సుంకరను కాస్త గట్టిగానే దెబ్బతీసింది. ఆయన తట్టుకున్నారు కానీ ఆ ప్రభావం గోపీచంద్ మిగిలిన సినిమాల మీద పడినట్లు క్లియర్ గా కనిపిస్తోంది.
ఇక గోపీచంద్ చేతిలో మిగిలినది డైరక్టర్ సంపత్ నంది సినిమా ఒక్కటే. దాని పరిస్థితి ఏమిటి అన్నది ఇంకా తెలియాల్సి వుంది. ప్రస్తుతానికి అయితే గోపీచంద్ ఏ సినిమా చేయాలి? ఏది చేయకూడదు? అసలు ఏంటి పరిస్థితి అనే మథనంలో వున్నారు. దాని నుంచి తేరుకున్నాక కానీ ఈ ప్రాజెక్టు స్టార్ట్ కాకపోవచ్చు. గోపీచంద్-సంపత్ నంది సినిమాకు భారీ బడ్జెట్ అవసరం అని తెలుస్తోంది. ఇప్పుడు గోపీచంద్ కు వున్న మార్కెట్ అయితే అంత బడ్జెట్ కు అనుకూలంగా అయితే లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.