పది రోజుల్లో ఈ ఏడాదిలో వచ్చిన హిందీ చిత్రాల్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘పి.కె.’ మరో నాలుగైదు రోజుల్లో మూడు వందల కోట్లు డొమెస్టిక్ సర్క్యూట్‌లోనే సాధించి ఇండియాలో ఈ ఫీట్ సాధించిన తొలి చిత్రంగా నిలుస్తుందనేది ఖాయమైపోయింది. ఈ చిత్రం వసూళ్లు డ్రాప్ అవుతాయని అనుకుంటూ ఉంటే స్టడీగా భారీ వసూళ్లు సాధిస్తూ సంచలనాలు నమోదు చేస్తోంది.
త్రీ ఇడియట్స్ తరహాలో ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా కన్సిస్టెంట్‌గా కలెక్షన్స్ రాబడుతూ కంటెంట్ ఈజ్ కింగ్ అనేది ఈ చిత్రం ఇంకోసారి నిరూపిస్తోంది. ఇలాంటి సినిమాకి బాక్సాఫీస్ రికార్డులు నెలకొల్పే అవకాశాలు లేవని చివరకు చిత్రం చూసిన తర్వాత కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు.
కానీ ‘పి.కె.’ రిలీజ్ అయింది మొదలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తూనే ఉంది. తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పిన ఈ చిత్రం మూడు వందల కోట్ల మైలురాయిని దాటి ఎంత వసూలు చేస్తుందా అని అంతా చర్చించుకుంటున్నారు. రాబోయే పెద్ద చిత్రాలకి ఇప్పట్లో సాధ్యపడని రేంజ్ ఫిగర్లతో ‘పి.కె.’ బాక్సాఫీస్ జర్నీ ఎండ్ అయ్యేలాగుంది.