‘జబర్దస్త్‌’ పోషకులు అంతలా ఉలిక్కిపడ్డారే….

ఏదేమైనా.. తెలుగు జనాలు భలే విచిత్రమైన వాళ్లే. ఒకవైపు వారి అభిరుచులు అన్నీ ఒక రకంగా ఉన్నాయి. వారి అభిరుచికి అనుగుణంగానే.. ఒక సినీ నటుడు మాట్లాడితే జనాలు తట్టుకోలేకపోయారు. బూతు టీవీ షోలకు…

ఏదేమైనా.. తెలుగు జనాలు భలే విచిత్రమైన వాళ్లే. ఒకవైపు వారి అభిరుచులు అన్నీ ఒక రకంగా ఉన్నాయి. వారి అభిరుచికి అనుగుణంగానే.. ఒక సినీ నటుడు మాట్లాడితే జనాలు తట్టుకోలేకపోయారు. బూతు టీవీ షోలకు మహారాజా పోషకుల్లాంటి తెలుగు వారి నుంచి ఈ తరహా రియాక్షన్‌ అస్సలు ఎక్స్‌పెక్ట్‌ చేసినది కాదు. వీరు వారేనా.. వారు వీరేనా? అనుకోవాల్సి వస్తోంది.

ఈ ఉపోద్ఘాతం అంతా.. నటుడు చలపతిరావు వ్యాఖ్యానాలపై జనాల రియాక్షన్‌ గురించి. చలపతిరావు వ్యవహారం తెలుగు మీడియాను, సోషల్‌ మీడియాను అట్టుడికించిందని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. బహుశా ఈస్థాయి రియాక్షన్‌ వస్తుందని చలపతిరావు అస్సలు ఊహించి ఉండరు. ఆయన మాత్రమే కాదు.. చలపతిరావు వ్యాఖ్యానాలపై జనాల స్పందనను చూసిన తర్వాత అంతా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి.

మరి ఈ విషయంలో తెలుగు జనాలను, నెటిజనులను అభినందించడమే కాదు.. వీరి స్పందన కలిగిస్తున్న ఆశ్చర్యాన్నికూడా ప్రస్తావించుకోవాలి. ఏ తెలుగు ప్రేక్షకులు అయితే.. జబర్దస్త్‌, పటాస్‌ వంటి షోలకు పోషకులుగా వ్యవహరిస్తున్నారో.. అదే ప్రేక్షకులు చలపతిరావు మాటలపై మాత్రం ఉలిక్కి పడ్డారు. 'పక్కలోకి..' అనే ఒకే ఒక్క మాటతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చలపతిపై విరుచుకుపడ్డారు. ఆయనకు ఇంగితం లేదు, సంస్కారం లేదు, బుద్ధిలేదు.. అంటూ విరుచుకుపడ్డారు. చలపతికి ఎన్ని రకాలుగా బుద్ధి చెప్పాలో అన్ని రకాలుగానూ చెప్పారు.

కాళ్లు విరగొడతాం.. చేతులు కట్టేస్తాం.. అంటూ కేసులు కూడా పెట్టేశారు. ఇప్పుడు చూస్తుంటే.. చలపతిరావును సభ్య సమాజం నుంచి వెలిసినంతగా స్పందన వస్తోంది. ఇప్పుడే కాదు.. రానున్న రోజుల్లో చలపతిరావుపై బూతు ముద్ర, నీఛమైన మాట మాట్లాడాడు అనే అభియోగం.. తొలగిపోయేలా లేదు. తన యాభైయేళ్ల కెరీర్‌తో సంపాదించుకున్న ఇమేజ్‌ను చలపతిరావు ఒకే ఒక్క మాటతో కోల్పోయినట్టుగా ఉన్నారు. దీనిపై చలపతిరావు క్షమాపణలు చెప్పారు అనడం కన్నా ఆయన చేత చెప్పించారు. ఆయన మాత్రమే కాదు.. మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్‌ కూడా క్షమాపణలు చెప్పింది.

అయినా.. అది చలపతిరావు వ్యక్తిగత వ్యాఖ్యానం అయినా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ స్పందించడం విడ్డూరం. వారు మాత్రమేనా.. శ్రీముఖి లాంటి వాళ్లు కూడా చలపతి రావు వ్యాఖ్యానాలను ఖండించేయడం విడ్డూరం. మళ్లీ సాయంత్రం టీవీ ముందు కూర్చుంటే.. 'పటాస్‌' వంటి షోలో శ్రీముఖి లీలలకు హద్దంటూ ఏమీ ఉండదు. కనీసం కాబోయే మొగుడు ముందుకు కూడా కొన్ని వయ్యారాలను ఉంచుకోకుండా.. మొత్తం ఆ షోలో తన సహచర యాంకర్‌ వద్దే ఒలగపోస్తూ ఉంటుంది శ్రీముఖి.

హిందీ కామెడీ కమ్‌ బూతు షోల స్ఫూర్తితో తెలుగులో మొదలైన జబర్ధస్త్‌, పటాస్‌.. ఇవి హిట్టయ్యేసరికి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన బోలెడన్ని ఈ తరహా షోలు.. ఇప్పుడు వీటిదే రాజ్యం. టెలివిజన్‌ రేటింగ్స్‌లో ఇవే ముందున్నాయి. ఒకటి కాదు రెండుకాదు.. మూడు నాలుగేళ్ల నుంచి జబర్ధస్త్‌ టాప్‌ రేటింగ్స్‌తో కొనసాగుతోంది. టెలివిజన్‌ ట్రెండ్స్‌ ఎక్కువ కాలం ఒకేలా ఉండవు. రోజూ వచ్చే కార్యక్రమాలను జనాలు ఎక్కువ కాలం ఆదరించారు.. దీంతో ట్రెండ్స్‌ మారిపోతూ ఉంటాయి. అయితే.. జబర్ధస్త్‌కు మాత్రం అలాంటి ప్రమాదం లేదు. సంవత్సరాలకు సంవత్సరాలు గడిచిపోతున్నా.. ఆ కార్యక్రమం కొనసాగుతోంది. అది కూడా రేటింగ్స్‌లో టాప్‌ రేంజ్‌లో ఉంది. ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న టీవీ చానల్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది.

మరి అలాంటి షోను ప్రసారం చేస్తున్న రామోజీరావు టీవీ చానల్‌ను నిందించే జనాలున్నారు, రామోజీరావు ఫక్తు వ్యాపారిగా మారిపోయాడని.. ఆయనకు విలువల్లేవని.. అందుకే అలాంటి బూతు షోను రన్‌ చేయిస్తున్నాడని ధ్వజమెత్తే వాళ్లు ఉన్నారు. ఈ కార్యక్రమ ప్రసారంలో ఈటీవీ యాజమాన్యానికే సర్వహక్కులూ ఉంటాయి. కాబట్టి.. నిందించాలంటే యాజమాన్యాన్నే అనాలి. అయితే కులాభిమానంతోనో, మరోరకమైన లెక్కలతోనో.. ఈటీవీ యాజమాన్యం పేరెత్తలేని కొంతమంది.. నాగబాబును, రోజాను కార్నర్‌ చేస్తూ ఉంటారు. రోజాపై కంప్లైంట్‌ కూడా చేశారు. మరి ఈ షోను ప్రసారం చేసే చానల్‌పై ఫిర్యాదు చేయకుండా.. రోజాపై ఫిర్యాదు చేయడం ఏమిటో మరి.

అయినా.. వాళ్లనూ వీళ్లను అని ఏం ప్రయోజనం. ఆ బూతు షోకు మహారాజ పోషకులు ప్రేక్షకులే కదా. లేదు.. మేము ఇలాంటి బూతు కార్యక్రమాలు చూడం.. అని జనాలు బలంగా అనుకుంటే.. రెండోవారం జబర్ధస్త్‌ రేటింగ్స్‌ ఎక్కడికి పడతాయి? జాడ్యం రామోజీరావు దగ్గరలేదు.. జనాల దగ్గర  ఉంది. జబర్దస్త్‌ తర్వాత అంతకు మించిన హాట్‌ షోగా పేర్గాంచింది 'పటాస్‌' అనే కార్యక్రమం. జబర్ధస్త్‌తో ఏవో కొంతమంది మొహానికి రంగులు వేసుకుని.. వెకిలి కామెడీని చేస్తుంటారు. అయితే.. పటాస్‌ అనే కార్యక్రమంలో ఒక మేల్‌ యాంకర్‌, మరో ఫిమేల్‌ యాంకర్‌.. రెచ్చిపోతూ ఉంటారు.

వీళ్లతో పోల్చుకుంటే చలపతిరావు వ్యాఖ్య ఎంతో మేలు. రవి, శ్రీముఖి అనే వీళ్లిద్దరూ చేసే అతి చూడగలవి కాదు. అంత అనాగరికంగా, అంత పచ్చిగా, ద్వంద్వార్థాలతో.. వీరు సాగించే సంబాషణకు ఒక హద్దంటూ లేకుండా పోతోంది. మాట్లాడితే డబుల్‌ మీనింగే.. దాన్ని డబుల్‌ మీనింగ్‌ అనకూడదేమో.. సింగిల్‌ మీనింగే, అది బూతు మీనింగే ఉంటుంది.

కొంతమంది కాలేజీ స్టూడెంట్లను కూర్చోబెట్టి శ్రీముఖి, రవి అనే ఇద్దరూ వేసే వెకిలి వేషాల షో కూడా టాప్‌ రేటింగ్స్‌తోనే నడుస్తోంది. మరి ఈ కార్యక్రమం విషయంలో రవి, శ్రీముఖిలను దోషులుగా  తేల్చవచ్చు. అయితే.. అసలైన దోషులు వారు కాదు.. ఇలాంటి కార్యక్రమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులు. తమ షో సూపర్‌ హిట్టని.. అందులో పాల్గొనడానికి కొన్ని వందల మంది కాలేజీ స్టూడెంట్స్‌ గేటు బయట వేచి చూస్తున్నారని.. దాన్ని ఒక్కమాట అన్నా సహించేది లేదని.. రవి అనేవాడు ఒక న్యూస్‌ చానల్‌లో రెచ్చిపోతుంటే.. ఆ వాదన వింటున్న వారికి రక్తపోటు పెరగకమానదు. చేస్తున్నది థర్డ్‌గ్రేడ్‌ పని.. దాన్ని కూడా ఈ రేంజ్‌లో సమర్థించుకోవడమా!

కేవలం జబర్దస్త్‌, పటాస్‌లనే కాదు.. ఇలాంటి షోలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. షోని ఎంత బూతులతో నింపితే.. అది అంత హిట్‌ అవుతుందనే థియరీతో అన్ని టీవీ చానళ్లూ తలా ఒక వేషం వేయిస్తున్నాయి. సుమ లాంటి యాంకర్లు కూడా.. తాము నిర్వహించే రియాలిటీ షోలో డబుల్‌ మీనింగ్‌ డైలాగులను పిల్లల చేత పలికించడానికి తాపత్రయ పడుతున్నారు.

విశేషం ఏమిటంటే.. ఈ బూతు షోల పోటీలో.. ఈనాడు నెట్‌వర్క్‌ చాంఫియన్‌గా నిలుస్తోంది. వారి వ్యాపారం వారిది. వారిని అని ఏం ప్రయోజనం లేదు. అయితే ఎటొచ్చీ చలపతిరావు వ్యాఖ్యానాలు విని ఉలిక్కిపడి.. ఆయనపై విరుచుకుపడిన వాళ్లు.. బూతు షోలను ఆదరిస్తుండమే.. విడ్డూరం. లేదా.. బూతు షోలను ఆదరించే జనాలు చలపతిరావు బూతులను తట్టుకోలేకపోవడం మరింత విడ్డూరం. చలపతిరావును అనేముందు.. ప్రతిరోజూ టీవీలో తామేం చూస్తున్నామో, యూబ్యూట్‌లో వెదుక్కొని మరీ తాము జబర్ధస్త్‌ షోలను చూస్తున్నామనే విషయం గుర్తుంచుకోవాలి.