ఈ మధ్య తెలుగు సినిమాలకు పట్టుకున్న సమస్య ఓపెనింగ్స్. సినిమా మొత్తం రన్ వారం మించి వుండడం అన్నది చాలా రేర్ గా వుంటోంది. వారం తిరిగేసరికి సినిమాలు వచ్చి పడిపోతున్నాయి. ఏం వచ్చినా తొలివారంలోనే రావాలి. దానికి ఎంచుకుంటున్న మార్గం పబ్లిసిటీ. టీవీ, ప్రింట్, వెట్ ల్లో విపరీతంగా పబ్లిసిటీ చేస్తే తప్ప జనం థియేటర్ల వైపు చూడడం లేదు.
అందుకోసం పెద్ద సినిమాలు రెండు కోట్ల వరకు కేవలం పబ్లిసిటీకే ఖర్చు చేస్తున్నాయి. పెద్ద సినిమాల బడ్జెట్ వేరు, ఖర్చు వేరు, వసూళ్లు వేరు. అందువల్ల వాటికా స్టామినా వుంటుంది. కానీ చిత్రంగా చిన్న సినిమాలు కూడా ఇదే దారి ఎంచుకోక తప్పడం లేదు. వెబ్ పబ్లసిటీ లేకుంటే ఓవర్ సీస్ కు తెలియదు. టీవీ పబ్లిసిటీ లేకుంటే ఫ్యామిలీలకు తెలియదు. అందుకే ఇప్పుడు చిన్న సినిమాలు కూడా ఒకటిన్నర నుంచి రెండు వరకు పబ్లిసిటీకి ఖర్చుచేసేందుకు సాహసిస్తున్నాయి.
ఆ మధ్య వచ్చిన ఊహలు గుసగుసలాడే, రామయ్యా వస్తావయ్యా ఇదే తీరుగా ఖర్చు చేసారు. చాలా వరకు ఫలితం సాధించారు. కానీ వాటిని చూసి మిగిలిన వాళ్లు చేసినా ఫలితం దక్కడంలేదు. ఈవారం విడదలైన జోరు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళికి అదే విధంగా ఒకటిన్నర కోట్ల నుంచి రెండు కోట్లు ఖర్చు చేసారు. కానీ తీరా విడుదలయ్యాక ఓపెనింగ్స్ చూస్తే చాలా నిరాశగావున్నాయి. శని, ఆదివారాలు ఏ సినిమాకైనా బాగానేవుంటాయి.
విడుదలైన రోజు కలపితేనే కనీసం మూడు, నాలుగు కోట్లు షేర్ వస్తుంది. అప్పుడే వారం మొత్తం మీద కలిపి కాస్త ధైర్యం పడగల కలెక్షన్లు వుంటాయి. అదృష్టం బాగుంటే రెండో వారంతో బ్రేకీవన్ వస్తుంది. కానీ ఇప్పుడు డబ్బులు ఖర్చు చేసి వ్రతం చెడగొట్టుకుంటున్నారు కానీ, ఫలితం మాత్రం దక్కడం లేదు. ఇదంతా ప్రేక్షకుల అభిరుచులు, అలవాట్లలో వచ్చిన మార్పు, నెల నుంచి మూడు నెలల్లో టీవీలొ సినిమా వచ్చేస్తుందన్న ధైర్యం. టికెట్ ధరలు తెచ్చిన పిరికితనం. అన్నిటింకి మించి మొదటి రోజు సినిమా బాగుందని టాక్ వస్తేనే మర్నాడు వెళ్లాలనుకునే తెలివి.