కథలన్నీ హీరో చుట్టూనే తిరుగుతాయి. కొరటాల కథలు కూడా అంతే. కాకపోతే హీరోతో పాటు మరో బలమైన క్యారెక్టర్ ను కూడా సైమల్టేనియస్ గా రన్ చేస్తుంటాడు కొరటాల. తన మొదటి సినిమా నుంచి కొరటాల ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అది ఈ దర్శకుడి బలం.
మొదటి సినిమా మిర్చిలో దేవ లాంటి బలమైన పాత్ర సృష్టించాడు. ఆ క్యారెక్టర్ కు సీనియర్ ఆర్టిస్ట్ సత్యరాజ్ ను తీసుకున్నాడు. రెండో సినిమా శ్రీమంతుడులో జగపతి బాబు పాత్ర కూడా అలాంటిదే. హీరో తర్వాత హీరో లాంటి క్యారెక్టర్ అది.
ఇక మూడో సినిమా జనతా గ్యారేజ్ లో సత్యం పాత్ర ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలిసిందే. హీరోతో సమానంగా ఎలివేట్ అయ్యే ఈ పాత్ర కోసం సీనియర్ మోస్ట్ మోహన్ లాల్ ను రంగంలోకి దింపారు. ఇలా తన ప్రతి సినిమాలో ఓ బలమైన పాత్రను సృష్టించిన కొరటాల.. కొత్త సినిమా విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు.
మహేష్ హీరోగా “భరత్ అనే నేను” సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు కొరటాల. ఈ సినిమాలో కూడా ఓ కీలకమైన పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం శరత్ కుమార్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. సినిమాలో మహేష్ కు తండ్రిగా నటించాల్సిన పాత్ర అదే. ఆ క్యారెక్టర్ కు బలమైన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందట. ఈ సినిమాతో శరత్ కుమార్ కూడా తెలుగులో మరోసారి పాపులర్ అవుతాడేమో..!