దేవుడు ఆదేశించాడు… రజనీ ఏమవుతాడో!

– ఆసక్తిని రేకెత్తిస్తున్న సూపర్‌ స్టార్‌ రాజకీయం Advertisement -చిరంజీవి ఉందంతం మరవకనే ఎంట్రీకి రజనీ రెడీ -ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ అవుతాడా? చిరంజీవికి తోడవుతాడా? -అభిమానంలోనే కాదు, నిర్దయలోనూ తమిళులు తమిళులే -రజనీ రాజకీయానికి…

– ఆసక్తిని రేకెత్తిస్తున్న సూపర్‌ స్టార్‌ రాజకీయం

-చిరంజీవి ఉందంతం మరవకనే ఎంట్రీకి రజనీ రెడీ

-ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ అవుతాడా? చిరంజీవికి తోడవుతాడా?

-అభిమానంలోనే కాదు, నిర్దయలోనూ తమిళులు తమిళులే

-రజనీ రాజకీయానికి అన్నింటికన్నా పెద్ద ప్రతిబంధకమదే!

రాజకీయాలతో మమేకమవుతూనే సినిమాల్లో ఎదిగిన వాడు ఎంజీఆర్‌.

రాజకీయాల్లో ఏం జరుగుతూందో తెలుసుకుంటూనే ఎదిగిన వాడు ఎన్టీఆర్‌.

రాజకీయాలు దైవ నిర్ణయం అంటూ ఇప్పటి దాకా లాక్కొచ్చిన వాడు రజనీ కాంత్‌.

పేదవాడికి ఏం కావాలో, ఏం ఇవ్వాలో తెలుసుకుని, ఎదిగింది ఎంజీఆర్‌.

ఎమ్జీఆర్‌ బాటే నా బాట అన్నట్లు సాగింది ఎన్టీఆర్‌.

మరి అసలు బాటలో కాలు పెట్టకుంటాడానే అడ్డంగా రాళ్లు పడుతున్న వైనం రజనీది.

నేను పక్కా లోకల్‌ అన్న సిద్దాంతం ప్రస్తావించాల్సిన అవసరం లేకపోయింది ఎమ్జీఆర్‌కు.

స్టేట్‌-సెంట్రల్‌ ఫీలింగ్‌ రెచ్చగొడితే తప్ప పని జరగలేదు ఎన్టీఆర్‌కు.

లోకల్‌ ఫీలింగ్‌నే లెగ్‌ బ్రేక్‌లా అడ్డం పడుతోంది రజనీకి.

ఇదీ రాజకీయం

సెలబ్రిటీ హోదా వేరు. రాజకీయం వేరు. పబ్లిక్‌లో వుంటే ఏమైనా అంటాడు శ్రీశ్రీ. రాజకీయం అంటే పక్కా పబ్లిక్‌. ఎవరైనా మాట వేయచ్చు. ఓటుహక్కు లేని వాడితో సహా. అందుకే సినిమా వాళ్లు రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. మర్యాద, మన్నన, అడుగడుగు దండాలు అలవాటైన సినిమా జనం రాజకీయాల్లోని వ్యవహారాలు తట్టుకోలేరు.

అయితే ఈ లాజిక్‌ కేవలం ముఖ్యమంత్రి లాంటి కీలక పదవులు ఆశించేవారికి వర్తించదు. వారు ఆ అధికార సాధన కోసం ఎంత కిందకి అయినా వచ్చి, మరీ నిలదొక్కుకుంటారు. కానీ ఎంపీ, ఎమ్మెల్యే లేదా మంత్రి పదవుల వరకు మాత్రమే వచ్చే సినిమా జనాలు వన్‌ఫైన్‌ మార్నింగ్‌ వాటికి గుఢ్‌ బై చెప్పడం ఖాయం. ఎందుకంటే అక్కడి పరిస్థితి అలాంటిది. అక్కడ విమర్శలకు లాజిక్‌లు వుండవు. అక్కడ మాటల తూటాలకు ఆధారాలు, అర్థం పర్థం అన్నవి అసలే వుండవు. ఎదుటి మనిషి మీద విరుచుకుపడిపోవడమే.

ఎమ్జీఆర్‌, ఎన్టీఆర్‌ ఇలాంటివి అన్నీ ఎదుర్కోనే ఓ స్థాయికి వచ్చారు. ఆ తరువాత చిరంజీవి ప్రయత్నించారు కానీ ఫలితం సాధించలేకపోయారు. కర్ణాటకలో ఎంతో చరిష్మా వున్న నటులు ఓ స్థాయికి మాత్రమే రాగలిగారు తప్ప, కీలక అధికార స్థానానికి చేరుకోలేకపోయారు.

ఇదీ గతం

రజనీ నడచి వచ్చిన దూరం తక్కువేమీ కాదు. సాదా సీదా చిన్న పాత్రల దగ్గర నుంచి విలనీ మీదుగా, సూపర్‌ హీరో పాత్రల వరకు చేరుకోవడం మాత్రమే కాదు. తమిళ నాట ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే రాజకీయ నాయకులు జయలలిత, కరుణానిధిల స్థాయి ఆరాధనా స్థాయిని అందుకున్నారు. వ్యక్తి పూజ అన్నది తమిళ జనాలకు కొత్త కాదు.

అది రాజకీయాల్లో అయినా, సినిమాల్లో అయినా, అందువల్ల కేవలం రజనీ మాత్రమే ఈ స్థాయికి చేరుకున్నారు అని మాత్రం అనలేం. ఎమ్జీఆర్‌ సంగతి పక్కన పెడితే, విజయకాంత్‌, శరత్‌ కుమార్‌ లాంటి వాళ్లు ఓ స్థాయిక మాత్రమే రాగలిగారు. విజయ్‌, అజిత్‌ లాంటి వాళ్లు అంతకు మించిన జనాభిమానాన్ని సంపాదించారు. కమల్‌ కూడా మంచి సంఖ్యలో అభిమానులను కలిగి వున్నారు.

కానీ వీరందరూ వేరు, రజనీ వేరు. ఒక విధంగా చెప్పాలంటే, రజనీ అంతకు మించి. సినిమా నటుల్లో సూపర్‌ మాన్‌ లాంటి వాడు రజనీ. అతని చరిష్మా లాజిక్‌లకు అందనంత రేంజ్‌కు ఏనాడో చేరుకుంది. అతను తెరపై ఏం చేసినా చెల్లేంతగా మారిపోయింది. అన్న అడుగేస్తా మాస్‌, అన్న నడిచొస్తే మాస్‌ అన్నట్లుగా, తెరపై రజనీ ఏం చేసినా చెల్లుతుంది. అమాంతం రెక్కలు మొలుచుకు వచ్చి, అకాశంలో అలా అలా ఎగిరినా, రజనీ ఫ్యాన్స్‌ అభిమానంగా చూస్తారు తప్ప, లాజిక్‌లు అడగరు.

దీనికి తోడు రజనీ విభిన్న వ్యక్తిత్వం కూడా అతనిపై అభిమానులకు ఆరాధనా భావాన్ని పెంచాయి. కేవలం సినిమాలో నటించినపుడు తప్ప, మిగిలిన సమయాల్లో ఆయన చాలా సాదా సీదాగా వుండడం, ఎలాంటి మహామహులనయినా అదే విధంగా కలవడం, వీలయినపుడల్లా హిమాలయాల్లో కాలినడకన పర్యటించడం, ఇలాంటివి అన్నీ రజనీ పట్ల జనాల్లో మంచి అభిప్రాయాన్ని పెంచాయి.

అప్పటి నుంచి అభిమానులో, రాజకీయ పార్టీలో రజనీని పదే పదే రాజకీయాల్లోకి రమ్మని పిలవడం అన్నది కామన్‌ అయిపోయింది. రజనీకి రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో వుంది. అది వాస్తవం. అలా వుంది కాబట్టే, సినిమాల్లో డైలాగుల రూపంలో కావచ్చు, ఎవరైనా అడిగితే బదులు ఇస్తూ కావచ్చు, రాజకీయాల్లోకి రాను అని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. అది దైవ నిర్ణయం మాత్రమే అని చెబుతూ వచ్చారు.

అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం రజనీ రాజకీయాల్లోకి రావడానికి సరైన టైమ్‌ కోసం చూస్తున్నారని, ప్రతి ఎన్నికల ముందు కరుణానిధి, జయలలిత ఎవరో ఒకరు బలంగా వుండడం గమనించి వెనకడుగు వేస్తూ వచ్చారని అంటారు. 2014 ఎన్నికల సమయంలో మోడీ ఎలాగైనా రజనీని రాజకీయాల్లోకి దింపాలని ప్రయత్నించారు కానీ, వీలు పడలేదు. జయలలిత బలంగా వుండడమే అందుకు కారణం తప్ప, రజనీ వెనకడుగుకు వేరే కారణం లేదు. ఇప్పుడు రజనీ రాజకీయాల్లోకి రావాలని డిసైడ్‌ అయ్యారు అంటే తమిళనాట రాజకీయ శూన్యత వుండడం తప్ప మరేమీ కాదు.

ఇదీ వర్తమానం…

సూపర్‌ స్టార్‌ రజనీ రాజకీయ రంగ ప్రవేశం దాదాపు ఖాయమైనట్లే అనుకోవాలి. ఎందుకంటే ఆ మేరకు వివిధ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. రజనీ కూడా ఆ మేరకు రెడీ అయిపోయినట్లు ఆయన మాటలు చేతలు స్పష్టం చేస్తున్నాయి. అంతకు మించి రజనీపై విరుచుకు పడుతున్న వివిధ వర్గాల విమర్శలు ఇంకా స్పష్టంగా చెబుతున్నాయి రజనీ రాజకీయ రంగ ప్రవేశం పక్కా అయిందని.

తమిళ జనాలకు రాజకీయాలు కొత్త కాదు. రాజకీయ పార్టీలు కొత్త కాదు. విమర్శలు అంతకన్నా కొత్త కాదు. కానీ తమిళ జనాలు చాలా చిత్రమైన వారు. వాళ్లకు లోకల్‌ పీలింగ్‌ ఎక్కువ. తమిళ భాష అంటే ప్రాణం. తమిళ రచయితలంటే అపార గౌరవం. పక్క రాష్ట్రాల సంగతి తమకు అనవసరం. తమ అవసరం తమది అని పోరాడగలరు. కానీ అదే సమయంలో అభిమానిస్తే, మాత్రం ప్రాణం ఇచ్చేస్తారు.

అక్కడ మళ్లీ లోకల్‌ నాన్‌ లోకల్‌ అన్నదే చూడరు. అమ్మ అని గుండెల్లో పెట్టుకున్న జయలలిత మూలాలు కర్ణాటకలో వున్నాయని తెలిసి కూడా అమోఘంగా ఆరాధించారు. మహరాష్ట్రలో పుట్టి, తమిళ నాట హీరో అయిన శివాజీరావు గైక్వాడ్‌ను రజనీ కాంత్‌ను చేసుకుని, తమ మనిషిగా ఆరాధించారు. కానీ, వాళ్లు సినిమాల్లో ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన అజిత్‌ కూడా అంతే పూర్తిగా లోకల్‌ కాదు.

కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసరికి రజనీ లోకల్‌ స్టాండ్‌ అన్నదే కీలక పాయింట్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి దాకా, అంటే రజనీ రాజకీయాలకు దూరంగా వున్నంత కాలం ఇవేవీ వినిపించలేదు. కనిపించలేదు. కానీ ఇప్పుడు పబ్లిక్‌లోకి వస్తారు అని తెలిసే సరికి ఎన్నో గొంతులు లేస్తున్నాయి. ఈ గొంతుల్లో చాలా మటుకు నిన్న మొన్నటి వరకు రజనీ అంటే అపార గౌరవం వెలిబుచ్చినవే. రజనీని అధ్భుతంగా పొగిడినవే. కానీ ఇప్పుడు వీళ్లందరికీ రజనీ నాన్‌ లోకల్‌గా, కనిపిస్తున్నాడు.

అయితే కేవలం నాన్‌ లోకల్‌ అన్న పాయింట్‌ లేవనెత్తడం అన్నది రజనీని అడ్డుకోవడం కోసం వాడుకుంటున్న ట్రంప్‌ కార్డుగా కనిపిస్తోంది. అసలు కారణం వేరేగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రజనీ షెడ్యూలు కులాలకు చెందిన వాడా? అన్నది గూగుల్‌లో చిరకాలంగా తెగ వెదుకుతున్న విషయంగా వుంది. రజనీ కూడా చాలా ప్లాన్డ్‌గా ఈ విషయంలో వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది. కబాలి సినిమా ప్రారంభంలో ఆయన పుస్తకం చదివే సీన్‌ వుంటుంది. అక్కడ నుంచే ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా చేస్తున్న సినిమాలో కూడా ఆ విధమైన జాగ్రత్తలు కొన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ నాయుకులు, కిట్టని వారు పాయింట్లు నేరుగా మాట్లాడరు. జనాలకు నప్పే వీక్‌ అండ్‌ లీక్‌ పాయింట్‌ ఎక్కడుందా అని చూసుకుంటారు. రజనీ విషయంలో వారికి నప్పనివి చాలా వున్నాయి. తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను తాము పూరిద్దాం అనుకుంటే, రజనీ అడ్డం పడుతున్నాడన్న బాధకావచ్చు. కులాల సమస్య వుండొచ్చు. ఇంకేమైనా వుండొచ్చు. కానీ అవేమీ నేరుగా ప్రస్తావించడానికి వీలుకాని సమస్యలు. అందుకే వారికి అందుబాటులో దొరికిన ఆయుధం, లోకల్‌… నాన్‌ లోకల్‌.

మరి భవిష్యత్‌?

రజనీకి తమిళ నాట వున్న చరిష్మా ఇంతా అంతా కాదు. అది అంగీకరించాల్సిన వాస్తవం. ఇప్పుడు ఏ కొందరో రజనీ నాన్‌ లోకల్‌ అన్న పాయింట్‌  లేవనెత్తినా పెద్దగా నష్టం జరిగే అవకాశం వుండదు. ఎందుకంటే రజనీ ఫ్యాన్స్‌కు ఈ విషయం తెలియంది కాదు. కొత్త పాయింట్‌ కాదు. వాళ్లు దానికి లోబడే ఇన్నాళ్లు రజనీని అభిమానించుకుంటూ వచ్చారు. ఇక ముందూ అలాగే వుంటారు. ఓటు కూడా వేస్తారు. పైగా భాజపా లాంటి పార్టీ మద్దతు అన్నది రజనీకి ప్లస్‌ అవుతుంది.

కానీ రజనీ ఎంతకాలం రాజకీయాల్లో నిలదొక్కుకుంటారు అన్నదే సమస్య. ఎందుకంటే రజనీకి చుట్టుపక్కల సరైన మంత్రాంగం, బలంలేదు. కుటుంబాన్ని రజనీ పూర్తిగా అదుపులో వుంచుకోలేరు. ఇప్పటికే అనేకసార్లు ఇది రుజువయింది. కుమార్తెలను ఆయన ఏనాడూ ఏవిధంగానూ కట్టడి చేయలేదు. అదే విధంగా భార్య, పిల్లల ఆర్థిక లావాదేవీలు అనేకంగా రజనీ సినిమాలను ఇబ్బంది పెట్టాయి. అప్పుడూ రజనీ ఏమీ కట్టడిచేసినట్లు కనిపించలేదు.

ఒకసారి అధికారం చేతిలోకి వచ్చాక, రజనీ తన కుటుంబ సభ్యులను కానీ, తన చుట్టూ వున్న వారిని కానీ ఏ విధంగా కట్టడి చేస్తారన్న దానిపై ఆయన రాజకీయ భవిష్యత్‌ ఆధారపడి వుంటుంది. సినిమా రంగం కాదు, టెక్నికల్‌గా తప్పించుకోవడానికి. రాజకీయాల్లో నైతికత కీలకంగా వుంటుంది. ప్రతిపక్షాలు పాయింట్‌ దొరికితే ఈ నైతికత మీదనే బాణాలు ఎక్కుపెడతాయి.

వీటన్నింటిని రజనీ తట్టుకోవాల్సి వుంటుంది. పైగా తమిళనాట రాజకీయ చైతన్య ఎక్కువ. ఎంత అమ్మ జయలలిత అయినా, టెర్మ్‌కు ఓసారి తీసి పక్కన పెట్టారు. ఎంత తమ ప్రియతమ కరుణానిధి అయినా టెర్మ్‌కోసారి తీసి పక్కన పెట్టారు. అందువల్ల ఎంత రజనీ అయినా తేడా వస్తే తీసి పక్కన పెట్టడానికి తమిళ ప్రజలు వెనుకాడరు. ఎంత సినిమా అభిమానం వున్నా, విజయ్‌కాంత్‌ను చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిర్థాక్షిణ్యంగా పక్కన పెట్టేసారు.

కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, ఫక్తు రాజకీయ నాయకులు అయితే, అధికారం వున్నా, లేకపోయినా రాజకీయాలను అంటి పెట్టుకునే వుంటారు. కానీ సినిమా నటులు అలా కాదు. అధికారం లేకపోతే వారికి రాజకీయాలపై ఆసక్తి సన్నగిల్లిపోతుంది. పోరాడి, పోరాడి మళ్లీ అధికారం సాధించాలనే ఆలోచన తక్కువ. సమయం వచ్చినపుడు జనం ముందుకు వస్తే చాలు అనుకుంటారు.

అది గతంలో తెలుగునాట ఎందరో సినిమా నటులు ప్రూవ్‌ చేసారు. ఒకసారి ఓడిపోయిన తరువాత మళ్లీ రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలా తక్కువమంది. చిరంజీవి అయితే అధికారం లేకపోయేసరికి అల్లల్లాడిపోయి, పార్టీని గుత్తకు ఇచ్చేసి మంత్రిపదవి పుచ్చుకున్నారు. తీరా ఆ మంత్రిపదవి అయిపోయాక, మళ్లీ నటనకు వచ్చేసి, జనాలను మర్చిపోయారు. రజనీ కూడా ఇందుకు అతీతం అనుకోవడానికి లేదు. అందువల్ల తమిళనాట రజనీ తరంగం అన్నది పాల పొంగు కావడానికే ఎక్కువ అవకాశం వుంది.

-ఆర్వీ

(బాక్స్‌..1)

కొత్త సీసాలో.. పాత సారా కాకూడదు…!

డీఎంకేను చీల్చుకుని వచ్చి.. అన్నాడీఎంకేను ఏర్పాటు చేసి అనేక మందికి రాజకీయ జన్మను ఇచ్చాడు ఎంజీఆర్‌. ఇక కాంగ్రెస్‌ వ్యతిరేకతనే పునాదిగా చేసుకుని పార్టీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ అనేక మంది రాజకీయ ఎదుగుదలకు గొడుగుపట్టాడు. తెలుగునాట తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే అనేక మంది అనామకులు రాజకీయ నేతలుగా ఎదిగారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన వారు.. అని మాత్రమే కాకుండా ఎన్టీఆర్‌ పార్టీ అనేక మంది రాజకీయ నాయకులకు జన్మనిచ్చింది. అలా ఎన్టీఆర్‌ ద్వారా రాజకీయ జన్మను పొందిన వారిలో చాలా మంది ఆయనను దించేసే సమయంలో తమ వంతుగా గొంతుకోశారు.. అది వేరే సంగతి.

మరి రజనీకాంత్‌ రాజకీయ పార్టీ తమిళనాట కొత్తగా ఏమైనా ట్రెండ్‌ తీసుకొస్తుందా? అంటే.. అంత సీన్‌ లేదనేది సుస్పష్టం అవుతోంది. మహా అంటే కొన్నిచోట్ల అభిమాన సంఘం నేతలకు టికెట్లు దక్కవచ్చు. కానీ.. జయలలిత మరణంతో అనేక మంది రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంలో పడిపోయింది. వారంతా రాజకీయ నిరుద్యోగులు అవుతున్నారు. ప్రస్తుతానికి అన్నాడీఎంకే చేతిలో అధికారం ఉంది కాబట్టి వారంతా కొంత కుదురుగా ఉన్నారు. కానీ రజనీ పార్టీ వస్తే.. వారంతా తమ రాజకీయ భవితవ్యం కోసం అటు వైపు వెళ్లిపోతారనేది సుస్పష్టమైన అంశం.

ప్రస్తుతానికి అన్నాడీఎంకేలో ఉండి వీలైనంతగా దండుకుని.. రజనీకాంత్‌ పార్టీ రాగానే, ఎమ్మెల్యేలం, ఎంపీలం, మంత్రులం.. అనే హోదాలతో అటు వైపు వెళ్లొచ్చని చాలామంది నేతలు ఆశిస్తున్నారు. ఇన్నాళ్లూ జయ పేరుతో బతికిపోయారు. ఇప్పుడామె లేదు. రజనీ వస్తే.. ఆయన కాళ్ల మీద పడిపోవచ్చనేది అన్నాడీఎంకే నేతల లెక్క. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ విషయంలో బయటపడిపోయారు.

మరి అన్నాడీఎంకే రాజకీయ నిరుద్యోగులంతా వెళ్లి రజనీ పార్టీలో చేరితే.. రజనీ ఏం చేయగలడు? దీంతో కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా మారుతుంది పరిస్థితి. జయ మరణంతో దిక్కుదివాణం లేకుండా తయారైన వారి కోసమే రజనీ పార్టీని ఏర్పాటు చేసినట్టు అవుతుంది. మరి ఆ ముద్ర పడకూడదనుకుంటే.. రాజకీయాల్లో నవతరానికి అవకాశం ఇస్తూ.. అంతటా కొత్త వారినే బరిలో నిలిపి.. తన ఛరిష్మాను నిరూపించుకుంటే అప్పుడు రజనీ తన సత్తాను చాటినట్టు అవుతుంది. అలాగాక ఫిరాయింపు రాజకీయాలను నమ్ముకుంటే, అన్నాడీఎంకే నేతలను నమ్ముకుంటే రజనీపై సామాన్యుడిని ఆకట్టుకోలేడు.

(బాక్స్‌ 2)

ఆరోగ్యం ఎంత వరకూ సహకరిస్తుంది?

ఇదే పెద్ద మిస్టరీ. రజనీ వయసు మరీ ఎక్కువేమీ కాదు. కానీ.. ఈ వయసులోనే ఆయన విరామాల్లేకుండా సినిమాలను పూర్తి చేయలేకపోతున్నాడు. వైద్య చికిత్సల కోసం అమెరికాకు వెళ్లొచ్చిన దాఖలాలున్నాయి. మరి రాజకీయంలో రాణించడానికి క్రేజ్‌, అభిమానం, డబ్బు చాలవు. వీటన్నింటికీ మించిన ఓపిక, శక్తి ఉండాలి. రజనీకి హెల్దీగా ఉన్నారా? వారం పదిరోజుల పాటు ఆగకుండా రోడ్‌ షో అయినా చేయగలడా? అనేవి సందేహాలే. రజనీ రాజకీయాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగల అంశం ఆయన ఆరోగ్యం. ఇదే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని, గెలుపోటములను నిర్దేశించబోతోంది.

(బాక్స్‌ 3)

బీజేపీ.. ప్లస్‌ అవుతుందా, మైనస్సా..?

రజనీకాంత్‌పై బీజేపీ ఆశలు అమితంగా ఉన్నాయి. తలైవాను తమ పార్టీలోకే తెచ్చుకోవాలనేది కమలం పార్టీ కోరిక. అలా కాకపోతే కనీసం పొత్తుతో అయినా ముందుకు వెళ్లాలనేది కమలం పార్టీ ఆశ. రజనీ పార్టీ రజనీ పెట్టుకోవచ్చు.. కొన్ని సీట్లను కమలానికి ఇస్తే చాలు. ఇదీ బీజేపీ ప్రతిపాదన. కనీసం రజనీ సహకారంతో అయినా తమిళనాట పాగా వేయాలని కమలం పార్టీ ఆశిస్తోంది. మాకు కొన్ని సీట్లను ఇస్తే చాలు.. రజనీకి అన్ని రకాల సహకారం ఇస్తాం.. అన్నట్టుగా వ్యవహరిస్తోంది బీజేపీ.

రజనీ కూడా కమలం పార్టీని వ్యతిరేకిస్తూ ముందుకు వెళ్లేలా లేడు. కమలంతో సాన్నిహిత్యంగా ఉండేలా ఉంది రజనీ రాజకీయం. మరి బీజేపీ విధానాల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉండే తమిళనాట ఆ పార్టీతో అంటకాగితే అది రజనీకి మైనస్‌ పాయింటే అయ్యేలా ఉంది. మూడేళ్ల పాలనలో దక్షిణాదిన విపరీతమైన అభిమానాన్ని సంపాదించేయలేదు నరేంద్రమోడీ. మత రాజకీయాలు చెల్లుబాటు అయ్యేచోట కమలం సంచలనాలు నమోదు చేసింది కానీ, మిగతా చోట్ల అంత సీన్‌లేదు. పైపెచ్చూ అదనంగా వ్యతిరేకతను సంపాదించుకుంది. అలాంటి బీజేపీతో కలిసి తమిళనాట రాజకీయాల్లో రాణిచడం రజనీకి అంత వీజీకాదు.

రజనీనే నాన్‌లోకల్‌ అనేమాట వినిపిస్తోంది. దానికి తోడు ఆయన బీజేపీని వెంట తీసుకెళ్తే.. నాన్‌లోకల్‌ ఫీలింగ్‌ మరింత పెరిగే అవకాశాలుంటాయి. రజనీ, బీజేపీల స్నేహం మైనస్‌ పాయింటే. కానీ ఒకటైతే కచ్చితంగా జరుగుతుంది. రజనీ పార్టీని ఏర్పాటు చేసిన అతి తక్కువ సమయంలోనే తమిళనాడుకు ఎన్నికలు వస్తాయి. రజనీ పార్టీ పెడితే .. పేకమేడలా కూలుతుంది పళనిసామి ప్రభుత్వం. అప్పడు రాష్ట్రపతి పాలన రావొచ్చు.. అదును చూసి, రజనీకాంత్‌ కాస్త కుదురుకోగానే.. కేంద్రం ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వొచ్చు!