చిరు 150వ సినిమా అంశం మళ్లీ తెరపైకొచ్చింది. ఎన్నికల తర్వాత ఆ సినిమా ఉంటుందని శ్రీకాకుళంలో అభిమానులనుద్దేశించి చిరంజీవి ప్రకటించినట్టు సమాచారం అందుతోంది. శ్రీకాకుళంలో అభిమాన సంఘం ఏర్పాటు చేసిన ఓ వేడుకకి కేంద్రమంత్రి కిల్లి కృపారాణి హాజరయ్యారు. ఆమె ఫోన్‌కి కాల్ చేసి అభిమానులతో ముచ్చటించారు చిరు.
150వ సినిమాకోసం కథలు వింటున్నానని, మంచి కథ దొరకగానే ఆ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళతామని ప్రకటించారు. నిజానికి చిరంజీవి 150వ సినిమా చేయనని ఎప్పుడూ అనలేదు. మంచి కథ, మంచి కథ అంటున్నారు. ఆ కథనే ఇప్పటిదాకా చిరంజీవి దగ్గరకు రాలేదు. చిన్నికృష్ణ కథని విన్నాను కానీ… ఇంకా మంచి కథలు ఏవైనా దొరుకుతాయో చూస్తున్నా అన్నాడు. అంటే చిన్నికృష్ణ చెప్పిన కథ మంచిది కాదనే కదా అర్థం.
వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. శంకర్ లాంటి దర్శకులు ముందుకొస్తే చిరు సినిమాకి కెప్టెన్ మారుతాడు కానీ… ప్రస్తుతానికి మాత్రం వినాయక్‌తోనే ఆ సినిమాని తీయాలని చిరు ప్లాన్ చేశారు. ఎటొచ్చీ కథే సరైనది దొరకడం లేదు. మరి ఆ కథ ఎప్పుడు దొరుకుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఎన్నికల తర్వాత సమీకరణలు ఏమైనా మారి చిరు కీలక పదవిని అధిరోహిస్తే మాత్రం 150 సినిమా మళ్లీ వాయిదా పడుతుందంటున్నారు.