సైరా యూనిట్ ఆశలు అన్నీ శనివారం నుంచి ప్రారంభమయ్యే దసరా సీజన్ మీదనే. అక్టోబర్ 2 సెలవు అని, ఓవర్ సీస్ లో మంగళవారం కాబట్టి ఆఫర్లు వస్తాయని, మాంచి ప్రీమియర్ లెక్కలు కనిపిస్తాయని అంచనా వేసారు. కానీ అక్కడే తప్పులో కాలేసారు కూడా. ఆంధ్రలో రేట్లు అతి భయంకరంగా పెంచేసారు. నేల నుంచి బాల్కనీ వరకు ఉత్తరాంధ్రలో 300 రూపాయలు, మిగిలిన చోట్లు రెండు వందలు, కొన్నిచోట్ల 150 మాదిరిగా ఫిక్స్ చేసుకున్నారు. కోర్టు నుంచి ఈ మేరకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
అయితే వారంరోజుల పాటు ఇంత పెద్ద రేట్ల మీద సినిమాను నిలబెట్టడం అంత సులువుకాదు అని ఆలోచించలేదు. అనుభవం పండిన దిల్ రాజు లాంటివాళ్లు ఇది రిస్క్ అని చెప్పినా పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. దాంతో సినిమా బాగుందని టాక్ వచ్చినా, ఫ్యామిలీ లు ఫ్యామిలీలు సినిమాలు వెళ్లడానికి జంకుతున్నాయి. పైగా వారం మధ్యలో సినిమా విడుదల కావడం, పరీక్షలు వుండడం కూడా మైనస్ అయింది.
ఇలాంటి నేపథ్యంలో శనివారం నుంచి కలెక్షన్లు కుమ్మతాయని అంచనా వేసారు. శని, ఆది, సోమ, మంగళ, బుధ ఈ అయిదు రోజులు చాలు అని, బయ్యర్లు బయటపడతారని అంచనా వేసారు. అలా అంచనా వేసిన శనివారం రానే వచ్చింది. కానీ రోజు రోజుకు కిందకు జారుతున్నట్లే, శనివారం కూడా కిందకే జారింది. అంతేకానీ మీదకు లేవలేదు.
ఇక మిగిలిన ఆశలు ఆది, సోమ, మంగళ, బుధ వారాలు. ఆదివారం, సోమవారం ట్రెండ్ చూస్తే ఆ ఆశలు నిలబడతాయో లేదో తెలుస్తుంది. ఇప్పటికి ఓవర్ సీస్ నుంచి తెలుగునాట వరకు బయ్యర్లు సగం రికవరీ అయ్యారు. అయితే ఇలా రికవరీ అయిన దాంట్లో ఫిక్స్ డ్ హైర్ లు, అడ్వాన్స్ లు వగైరా వున్నాయి. ఫుల్ రన్ పూర్తి అయితే తప్ప అసలు సంగతి తేలదు.