పవన్‌కళ్యాణ్ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాడో లేదోగానీ, బీజేపీలోకి వెళ్తాడనీ, టీడీపీతో కలిసేందుకు చర్చలు కూడా జరిగాయనీ రకరకాల ప్రచారాలైతే జోరుగా సాగుతున్నాయి. మీడియా ముందుకొచ్చే సందర్భాలే అతి తక్కువ పవన్‌కళ్యాణ్ విషయంలో. అలా వచ్చినప్పుడల్లా సమాజమ్మీద తనకున్న ప్రత్యేకమైన శ్రద్ధని తన మాటల్లో చాటుకుంటుంటాడు పవన్‌కళ్యాణ్.
తాజాగా, పవన్‌కళ్యాన్ టీడీపీ నేత గెటప్‌లో ఓ ఫొటో ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇది ఫ్యాన్స్‌ని కాస్తంత ఇబ్బంది పెడ్తున్నట్టే, టీడీపీ శ్రేణుల్లో అలజడి రేపుతోంది. నందమూరి – మెగా ఫ్యామిలీల మధ్య సినీ వార్ గురించి తెలియనిదెవరికి.? బద్ధ వైరం గల కుటుంబాలు.. అనే పేరు పడిపోయింది.
రాజకీయాల్లోనూ చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ చాలా మాటల యుద్ధాలు జరిగాయి. పవన్‌కళ్యాణ్ విషయంలోనూ టీడీపీ నేతలు గతంలో ఒకటీ అరా విమర్శలు చేసి వున్నారు. మరి, అవన్నీ మర్చిపోయి పవన్‌ని టీడీపీలోకి ఆ పార్టీ నేతలు ఆహ్వానిస్తారా.? అసలంటూ పవన్‌కళ్యాణ్‌కి రాజకీయాల్లో రీ`ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యం వుందో లేదో.. ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది.
మొన్నామధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జూ.ఎన్టీఆర్ ఫొటోలను తమ ఫెక్సీలపై పెట్టి టీడీపీతో మైండ్ గేమ్ ఆడిరది. అది కాస్తా బాగా పేలింది. టీడీపీలో గందరగోళం ఏర్పడిరది. ఇప్పుడు అదే స్ట్రాటజీ టీడీపీ ప్లే చేస్తున్నట్లుగా కన్పిస్తోంది. అన్న చాటు తమ్ముడు కాకపోయినా, అన్నయ్యమీద అమితమైనా అభిమానం పవన్‌కళ్యాణ్‌కి వుంది.
చాలాకాలంగా పవన్, చిరంజీవిల మధ్య ఎడమొహం పెడమొహంగా వాతావరణం వున్నప్పటికీ, తల్లిదండ్రులు, అన్నయ్య ` వదిన, ఆ తర్వాత మీరు.. అంటూ అభిమానుల్ని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించాడు. సో, అన్నయ్యని కాదని పవన్ పొలిటికల్ స్టెప్ వేసే అవకాశాలు చాలా తక్కువే. పవన్‌ని టీడీపీ నేత గెటప్‌లోకి టీడీపీకి చెందిన సానుభూతిపరులు మార్చేయడం వెనుక, చిరంజీవిని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఆలోచనే దాగుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్, చిరు సామాజిక వర్గం ఓట్లపై చాలా ఆశలే పెట్టుకుంది. 2014 ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు తమకు ఎన్నో కొన్ని సీట్లు తెచ్చిపెడ్తాయన్నది కాంగ్రెస్ ఆలోచన. పవన్ గనుక టీడీపీలోకి లాగితే, ఆ ఓట్లన్నీ టీడీపీకి పడ్తాయని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారట. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అందరి విషయంలోనూ అనుకోడానికి వీల్లేదు. అలా అంచనాలకు అందని కొందరిలో పవన్ కూడా ఒకడు.
గతంలో కాంగ్రెస్ నేతల పంచెలూడగొట్టి కొట్టండంటూ ప్రజారాజ్యం పార్టీ యూత్ వింగ్ యువరాజ్యం అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన పవన్‌కళ్యాణ్, చిరంజీవి పిలిచినా కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించే అవకాశాల్లేవు. అదే సమయంలో పవన్ తనదంటూ కొత్త పార్టీ పెట్టేందుకూ అవకాశాలు అతి తక్కువే.
మొత్తమ్మీద, టీడీపీ మైండ్ గేమ్.. అటు పవన్ అభిమానుల్నీ, ఇటు టీడీపీ శ్రేణుల్నీ కన్ఫ్యూజన్లో పడేసింది. ఈ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ కావాలంటే పవన్ పెదవి విప్పాల్సిందే. కానీ, పవన్ పెదవి విప్పడం అంత తేలికైన విషయమేమీ కాదు.