తాలిబన్ల మీదకు తోసేశారు
సెప్టెంబరు 5 న అఫ్గనిస్తాన్‌లో హత్యకు గురైన సుస్మితా బెనర్జీ చావుకు కారణం తాలిబన్లు అని మొదట్లో వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత అబ్బే తాలిబన్లు కాదు, ఐయస్‌ఐ తయారుచేసిన హక్కావీ సంస్థవారి పనే యిది అన్నారు. ఇప్పుడు వారెవరూ కాదు, సుస్మిత మొగుడే అసలు అపరాధి అని సుస్మిత కుటుంబం అంటోంది. 30 ఏళ్ల క్రితం కలకత్తాలో సుస్మిత ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేది. అఫ్గనిస్తాన్‌కు చెందిన జాుబాజ్ ఖాన్ కలకత్తాలో వడ్డీ వ్యాపారం చేస్తూ వుండేవాడు. ఓ రోజు కాలు విరిగి అదే ఆసుపత్రిలో చేరాడు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆమెకు అప్పుడు 27 ఏళ్ల వయసు. పెళ్లి కాలేదు. అన్న, యిద్దరు తమ్ముళ్లు వున్నారు. తండ్రి ఆర్మీలో ఆఫీసరు. చేస్తూండేవాడు. ఈ కాబూలీవాలాను పెళ్లి చేసుకుంటానంటే వాళ్లు ఠఠ్ కుదరదన్నారు. ఈమె యింట్లోంచి పారిపోయి సయీదాగా పేరు మార్చుకుని 1988లో రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు అతను ఆమెను తన సొంత వూరికి తీసుకెళ్లాడు. అక్కడ తొలి షాక్ తగిలింది. జాుబాజ్‌కు అదివరకే పెళ్లయింది. ఈమెకు అది రోతగా అనిపించినా అతనిపై వల్లమాలిన ప్రేమతో సహించింది.
ఇక బయట వాతావరణం చూడబోతే అప్పుడే అఫ్గనిస్తాన్‌లో నజీబుల్లా ప్రభుత్వానికి, ముజాహిదీన్‌లకు అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇటువంటి పరిస్థితుల్లో 1990లో జాుబాజ్ సుస్మితను తన యింట్లో వదిలేసి కలకత్తాకు వెళ్లిపోయాడు. ఇక యింట్లో హింస ప్రారంభమైంది. మూడేళ్ల తర్వాత తాలిబన్ల శకం ప్రారంభమైంది. ఆడవాళ్లను, పిల్లల్ని వాళ్లు పెడుతున్న కష్టాలు చూడలేక యీమె వారికోసం మెడికల్ క్యాంపులు నిర్వహించసాగింది. తాలిబన్లు వాటిని మూయించేశారు. ఈమె వారి బాధ తట్టుకోలేక ఇండియాకు పారిపోవడానికి ప్రయత్నించింది కానీ విఫలమైంది. అత్తమామలు మరింత కఠినంగా వ్యవహరించారు. చివరకు ఇండియన్ ఎంబసీ సహాయంతో 1995లో ఇండియాకు పారిపోయి వచ్చి కుటుంబాన్ని ఆశ్రయించింది. వాళ్లు పాతవిషయాలు మర్చిపోయి తమ యింట్లోనే పెట్టుకున్నారు.
కొన్ని రోజులకు జాుబాజ్ ఆమె వద్దకు వచ్చి తనను క్షమించమని కోరాడు. అతనిపై వున్న పిచ్చిప్రేమతో ఆమె సరేనని చెప్పి నార్త్ కలకత్తాలో ఒక ఎపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టింది. అతను ఆమెతో వుంటూ మధ్యమధ్యలో ఆఫ్గనిస్తాన్ వెళ్లి వస్తూండేవాడు. సుస్మిత మాత్రం అటు తొంగి చూడలేదు. సుస్మిత తన అనుభవాలతో ‘‘కాబూలీవాలా బెంగాలీ భార్య’’ అనే పుస్తకం రాసింది. అది చాలా బాగా అమ్ముడుపోయింది. దాని ఆధారంగా 2003లో ‘‘ఎస్కేప్ ఫ్రమ్ తాలిబన్’’ అనే సినిమా తయారైంది. దీనితోబాటు ఆమె నాలుగైదు పుస్తకాలు రాసి పేరు తెచ్చుకుంది. కథ యిలా నడుస్తూండగా జాుబాజ్ సోదరుడు మూసా కలకత్తాలో వడ్డీవ్యాపారం గొడవల్లో హత్యకు గురయ్యాడు. ఆఫ్గనిస్తాన్ ఆచారం ప్రకారం అతని భార్యను జాుబాజ్ పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఈ విషయం సుస్మితకు చెప్పకుండా దాచాడు. 2012లో ఆమెకు యిది తెలిసింది. ఇటీవలి కాలంలో భర్త ఆఫ్గనిస్తాన్‌కు తరచుగా వెళ్లడానికి కారణం యిదన్నమాట అనుకుని, తన భర్తను దక్కించుకోవాలనే తాపత్రయంలో సుస్మిత అఫ్గనిస్తాన్ వెళతానంది. 17 ఏళ్ల తర్వాత యిప్పుడెందుకు అంటూ కుటుంబసభ్యులు వారించబోయారు. ‘‘ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితులు మారాయి. మారిన యీ వాతావరణం గురించి నేను కొత్త పుస్తకం రాస్తాను. సమాచార సేకరణకై వెళ్లాలి.’’ అంటూ వాళ్లతో వాదించి అత్తారింటికి వెళ్లింది.
ఇప్పుడు ఆమె హత్యకు గురైంది. చిత్రం ఏమిటంటే ఆమె చావు గురించి జాుబాజ్ అత్తవారింటికి ఫోను చేసి చెప్పలేదు. మీడియాలో వచ్చిన వార్త చూసి బావమరిది ఫోన్ చేస్తే సెల్ ఆఫ్ చేసి వుంది. చివరకు కాబూల్‌లోని ఇండియన్ ఎంబసీకి చెపితే వాళ్లు జాుబాజ్‌ను అడిగారు. ‘‘నా భార్య బంధువుల ఫోన్ నెంబర్లు నా దగ్గర లేవు’’ అని అబద్ధం చెప్పాడతను. 57 ఏళ్ల సుస్మితపై మొగుడికి మోజు తీరిపోయిందని, ఆమెను వదుల్చుకోవడానికి చంపి పారేసి, తాలిబన్లపై ఆ నేరాన్ని నెట్టేస్తున్నాడని, గుడ్డి ప్రేమే ఆమె ప్రాణం తీసిందని అనుకోవాలి.
శరద్ పవార్ సంధిస్తున్న శరాలు
‘‘మహారాష్ట్ర ప్రభుత్వాఫీసుల్లో ఫైళ్లు కదలటం లేదు. సంతకం పెట్టడానికి మంత్రులకు, అధికారులకు చేతులు రావడం లేదో, తాత్కాలిక పక్షవాతం వస్తోందో తెలియడం లేదు’’ అంటూ సెప్టెంబరు 10 న పుణెలో శరద్ పవార్ విరుచుకుపడ్డారు. ఆ ప్రభుత్వంలో ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి అని గుర్తు వస్తే ‘ఇదేమిటిలా?’ అని ఆశ్చర్యం కలుగుతుంది. శరద్ కోపమంతా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మీద, నియమాలు వుల్లఘించకూడదన్న అతని పట్టుదల మీద! పృథ్వీరాజ్‌కు ముందు ఆ పదవిలో వున్న అశోక్ చవాన్ ఆదర్శ్ సొసయిటీ కుంభకోణం విరుచుకుపడడంతో నవంబరు 2010లో దిగిపోవల్సి వచ్చింది. తనపై అలాటి మచ్చ పడకూడదని పృథ్వీరాజ్ సంకల్పించి యిరిగేషన్, కోఆపరేషన్, రియల్ ఎస్టేటు, కార్పోరేట్ రంగాలపై గట్టిగా దృష్టి సారించాడు. ఎన్‌సిపి ఆర్థికమూలాలు ఆ రంగాల్లో వున్నాయి కాబట్టి ఆ పార్టీ నాయకుడిగా శరద్ పవార్ అతనిపై మండిపడుతున్నాడు. ఎందుకంటే బిజెపి-శివసేన రోజుల్లో కూడా ఎన్‌సిపి ఆర్థిక వ్యవహారాల జోలికి వెళ్లడానికి అందరూ భయపడేవారు.
మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకును క్షాళన చేయడానికి పృథ్వీరాజ్ పూనుకోగానే తమ పార్టీ అభ్యర్థిని డైరక్టరుగా పెట్టాలని ఎన్‌సిపి పట్టుబట్టింది. కానీ పృథ్వీరాజ్ వినలేదు పైగా వొర్లి-హాజీ మస్తాన్ సీ లింక్ ప్రాజెక్టుకు చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రత్యామ్నాయాలు వెతకమని అడిగాడు. బాండ్రాలో గవర్నమెంటు ఉద్యోగులకు కాలనీ కట్టాలని అతని ప్రభుత్వం సంకల్పించి రూ.150 కోట్లు ముందుగా కట్టాలనే షరతుపై మూడు కంపెనీలకు కాంట్రాక్టు యిచ్చింది. రెండు కంపెనీలు కట్టాయి కానీ ఎన్‌సిపికి సన్నిహితంగా వుండే కంపెనీ మాత్రం కట్టలేదు. అయినా వాళ్లకు కాంట్రాక్టు యివ్వాలని ఎన్‌సిపి పట్టుబడుతోంది, ముఖ్యమంత్రి ఒప్పుకోవటం లేదు. పుణెలో పెద్ద నిర్మాణసంస్థ నడుపుతున్న అతుల్ చోర్దియా అనే అతను ఎన్‌సిపికి ఆప్తుడు. అతను ఎన్‌సిపి వారి పత్రికలో వ్యాసం రాస్తూ ‘ప్రభుత్వవిధానాలు రియల్ ఎస్టేటు రంగాన్ని దెబ్బ తీస్తున్నాయంటూ’ ఆరోపించాడు. ఇప్పుడు శరద్ పవార్ బిల్డర్ల లాబీ వాదనలనే తన ముఖత్ణ వెలిబుచ్చాడు.
ఎందుకిదంతా అంటే – యిలా బెదిరించి, వచ్చే పార్లమెంటు ఎన్నికలలో 2009లో పొత్తులో భాగంగా కాంగ్రెసు యిచ్చిన 22 సీట్లు నిలుపుకోవడానికే అంటున్నారు. ఎన్‌సిపి నాయకులు చాలామంది అనేక స్కాముల్లో యిరుక్కోవడం వలన కాంగ్రెసు 3 సీట్లు తగ్గిద్దామని చూస్తోందని భోగట్టా. దాన్ని నిలవరించడానికి శరద్ యీ వ్యాఖ్యలు చేశాట్ట. కానీ పృథ్వీరాజ్ ఊరుకోలేదు. తన ఆఫీసు నుండి ఒక ప్రకటన వెలువరించాడు. ‘‘ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన 34 మాసాల్లో 27,500 ఫైళ్లు ఆయన వద్దకు వచ్చాయి. 95% అనగా 26,100 ఫైళ్లు క్లియర్ చేశారు.’’ అని. దీనితో బాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తన పార్టీ మంత్రులకు లేఖలు రాశాడు – ‘‘మీ శాఖల తాలూకు ఫైళ్లు ఫైనాన్స్ డిపార్టుమెంటులో పెండిరగులో వుంటే వెంటనే మాకు తెలియపరచండి.’’ అని. ఫైనాన్సు మంత్రి వేరెవరో కాదు, శరద్ పవార్ సోదరుని కుమారుడు అజిత్ పవారే!
– ఎమ్బీయస్ ప్రసాద్