రోజులు గడిచే కొద్దీ లాలూపై ప్రజల భ్రమలు తొలగాయి. అతని అనుచరులు విశృంఖలంగా ప్రవర్తించసాగారు. శాంతిభద్రతలు క్షీణించాయి. అవినీతి, బంధుప్రీతి, మీడియాపై ఆంక్షలు యివన్నీ వెలుగులోకి వచ్చి అతనికి ప్రజాదరణ తగ్గింది. లాలూ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన సందర్భంగా 1993లో టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ ఉత్తమ్ అతన్ని ఘాటుగా విమర్శిస్తూ వ్యాసం రాశాడు. వెంటనే కారులో వెళుతూంటే అతనిపై తుపాకీతో దాడి జరిగింది. అయితే బుల్లెట్టు ఫ్రంట్‌సీటులో యిరుక్కుంది. ఆ రాత్రే లాలూ టైమ్స్ ఆఫ్ ఇండియాకి వచ్చి ‘‘ఉత్తమ్, నీపై దాడి ఎందుకు జరిగింది? నీకైమైనా ఆస్తి గొడవలున్నాయా? ప్రభుత్వపరంగా ఏమైనా చేయమంటావా?’’ అని అడిగాడు, దాడితో తనకు ఏ సంబంధమూ లేదని చూపుకోవడానికి! అర్ధరాత్రి పోయాక ఢిల్లీ నుండి కాంగ్రెసు పార్టీకి చెందిన కేంద్రమంత్రి రాజేష్ పైలట్ ఢిల్లీ నుండి ఫోన్ చేసి ‘‘లాలూ నీపై దాడి చేయించా డనుకుంటున్నావా? చెప్పు విచారణ జరిపిస్తాం’’ అని ఆఫర్ చేశాడు. అబ్బే లేదు అని ఉత్తమ్ అనడంతో రాజేష్ నిరుత్సాహపడ్డాడు. సాక్ష్యాలేమీ లేనపుడు ఉత్తిపుణ్యాన ఆరోపణలు చేయకూడదని ఉత్తమ్ అనుకున్నాడు.
1995 అసెంబ్లీ ఎన్నికలలో నెగ్గి లాలూ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. 1996లో యింకో అయిదు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయనగా లాలూ రాంచీకి వెళ్లాడు. పివి నరసింహారావు ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని, రాబోయే ఎన్నికలలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడవచ్చని, దానిలో లాలూ ప్రధాన భూమిక పోషిస్తూ, అయితే గియితే లాలూ ప్రధాని అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ఇటువంటి అస్థిర మిశ్రమ ప్రభుత్వానికి ప్రధానిగా వుండడం కంటె దానిలో ముఖ్యపాత్రధారిగా వుండి కావలసిన పనులు చేయించుకోవడం మంచిదని లాలూ అంచనా. రాంచీకి వెళ్లినపుడు అతని వద్దకు ఒక విషయం తెచ్చారు. అమిత్ ఖరే అనే ఐయేయస్ ఆఫీసర్ వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్నాడు. చాయిబాసా అనే పట్టణంలో పశుసంవర్ధక శాఖలో అక్రమాల గురించి ఫిర్యాదు వస్తే తన టీముతో వెళ్లి పరిశోధించాడు. అక్కడి ట్రెజరీ ఆఫీసర్లు అనేక సార్లు అర్ధరాత్రి పూట ట్రెజరీ తెరిచి క్యాష్ విత్‌డ్రా చేశారని, కోట్లాది రూపాయలకు చెక్కులు జారీ చేశారనీ తేలింది. ఈ అక్రమాలలో రాంచీ, పట్నాలలోని ఉన్నతాధికారుల పాత్ర కూడా వుందని బయటకు వచ్చింది. డిప్యూటీ కమిషనర్ నివేదిక రాసి యిచ్చాడు. దానిపై ఏం చేయాలి? అని రాంచీ వచ్చిన లాలూని అడిగారు. అతి కొద్దికాలంలో దేశాన్ని ఏలబోతున్నామన్న వూపులో వున్న లాలూ ‘‘నేరం చేసినవారిపై చర్యలు తీసుకోండి, కావాలంటే అరెస్టు చేయండి’’ అని చెప్పేశాడు.
అరెస్టుల పర్వం ప్రారంభమయ్యాక తక్కిన జిల్లాల్లో కూడా యిలాటివి జరిగాయని బయటకు వచ్చింది. పశుసంవర్ధక శాఖ ఉద్యోగస్తులు జీతాలు తక్కువ. రీజనల్ డైరక్టరుకి కూడా అప్పట్లో నెలకు 12000 రూ.ల జీతం. మరి అలాటప్పుడు వాళ్ల పిల్లల పెళ్లిళ్లకు భారీగా ఎలా ఖర్చు పెట్టగలుగుతున్నారు? అవినీతి జరిగినట్లే కదా. కానీ బయటపెట్టడం ఎలా? టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ఒక ఉపాయాన్ని కనిపెట్టారు. పశు సంవర్ధక శాఖ అధికారులు తమ గ్రామాల్లో, పట్టణాల్లో కట్టిన, కడుతున్న బంగళాలపై వీళ్లు దృష్టి సారించారు. రోజూ ఒకరి యింటి ఫోటో వేయడం, దీని ఖరీదు ఎంత వుంటుందో ఊహించండి అంటూ పాఠకులను అడగడం..! ఇల్లు ఎక్కడుందో రాసి, అది ఎవరిదని గ్రామస్తులు అనుకుంటున్నారో, వారు ఏ శాఖలో పని చేస్తున్నారో రాసేవారు. దీని వలన పాఠకులు తమకు తెలిసిన యిళ్ల గురించి కూడా సమాచారం పంపసాగారు. తమ పేరు వెల్లడిరచవద్దని కోరేవారు. ఆ శాఖలో ఎంత అవినీతి వుందో అందరికీ అర్థం కాసాగింది. ఇలా ఒక వారం గడిచేసరికి ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్ ఫోన్ చేసి ‘‘పట్నాలో కడుతున్న ఒక యింటి ఫోటో కూడా వేయండి. మాకున్న సమాచారం ప్రకారం అది ముఖ్యమంత్రి లాలూదో, లేక ఆయన బావమరదులదో అయి వుండాలి. ఎవరిదని అడగడానికి వెళితే మా అధికారులను కొడుతున్నారు. మీ పిల్లల్ని, పెళ్లాల్ని ఎత్తుకుపోతామని బెదిరిస్తున్నారు. మీరు ఫోటో వేస్తే కాన్పూరునుండి స్పెషల్ టీముని రప్పించడానికి నాకు వీలు పడుతుంది.’’ అని కోరాడు.
అప్పుడు ఉత్తమ్ తన స్టాఫ్ ఫోటోగ్రాఫర్ కృష్ణ మోహన్‌ను పంపి ఆ బిల్డింగ్‌ను కాస్త దూరంలో వున్న వేరే బిల్డింగ్‌నుండి టాప్ ఏంగిల్‌లో ఫోటో తీయించాడు. ఇలా తీయించిన విషయం లాలూ మనుష్యులకు తెలిసింది. అయితే ఫోటోతీసినది కృష్ణమోహన్ సోదరుడు కృష్ణ మురారి అని వాళ్లు కన్‌ఫ్యూజ్ అయ్యారు. అతను పని చేసే ‘‘హిందూస్తాన్ టైమ్స్’’ సంపాదకుడు ఘోష్‌కి ఫోన్ చేసి ‘‘మీరేదైనా ఫోటో వేయబోతూ వుంటే ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాతే వేయండి’’ అని చెప్పారు. ఆయనకు ఏమీ అర్థం కాలేదు. ఉత్తమ్‌కి ఫోన్ చేసి ‘‘మీరేమైనా పట్నాలో బిల్డింగ్ ఫోటో వేయబోతున్నారా?’’ అని అడిగాడు. ‘‘అబ్బే, మేం వేసే ఫోటోలన్నీ జిల్లాలవే. పట్నాలోవి ఏమీ వేయడం లేదు.’’ అని ఉత్తమ్ అబద్ధమాడాడు. ఆయన వూరుకున్నాడు. కానీ కాస్సేపటికి ఓ మంత్రి ‘‘హిందూస్తాన్ టైమ్స్’’ ఆఫీసుకి వచ్చి ‘‘మీ ఫోటోగ్రాఫర్ ఏవో ఫోటో తీసాట్టగా’’ అనడంతో మళ్లీ ఉత్తమ్‌కు ఫోన్ చేశాడు. ఉత్తమ్ మళ్లీ అదే అబద్ధం ఆడి, యిక ఆగితే లాభం లేదనుకుని అవేళే ఆ ఫోటోను పబ్లిష్ చేసేశాడు. ‘ఈ బిల్డింగ్ ఎవరిదో ఇన్‌కమ్ టాక్స్ డిపార్టుమెంట్‌వారు కనుక్కోలేకుండా వున్నారు’ అని శీర్షిక పెట్టారు.
మరి కొన్ని రోజులకు పట్నా మ్యూజియం ఎదురుగా కడుతున్న 5 బెడ్‌రూముల భవంతి ఎవరిదో కనుక్కోండి అంటూ ఒక అజ్ఞాత వ్యక్తి ఉత్తమ్‌కు ఫోన్ చేశాడు. కాపలాగా వున్న గార్డులను అడిగితే వాళ్లు నోరు విప్పటం లేదు. టైమ్స్ వాళ్లు వెతికి, వెతికి ఆ బిల్డింగ్ కాంట్రాక్టరు ఎవరో, ఆర్కిటెక్ట్ ఎవరో కనిపెట్టారు. వెళ్లి అడగబోతే వాళ్లు నోరు విప్పకుండా పారిపోయారు. రెవెన్యూ డిపార్టుమెంటు రికార్డులు వెతికితే స్వాతంత్య్రానికి పూర్వం ఒక బెంగాలీ ఆయనకు ప్రభుత్వం ఆ స్థలాన్ని లీజుకి యిచ్చిందని, తర్వాత ఆయన కలకత్తాకు తరలి వెళ్లి అక్కడే చనిపోయాడని తెలిసింది. ఇక ఆర్కిటెక్ట్ మీదే దృష్టి పెట్టాలని ఉత్తమ్ అనుకుంటూండగా పట్నాలో టైమ్స్ ముద్రించే ప్రెస్ యజమాని సుధీర్ జైన్ డిన్నర్‌కు పిలిచాడు. అక్కడ ఒకతన్ని పరిచయం చేసి ‘ఇతనే నువ్వు వెతికే ఆర్కిటెక్ట్’ అన్నాడు. ఎంత అడిగినా తనకు ఆ బిల్డింగ్ పని అప్పచెప్పిన క్లయింట్ పేరు చెప్పలేదు సరి కదా తన పేరు బయటకు వస్తే తను ఊరు వదలి పారిపోవాల్సి వస్తుందని చెప్పాడతను. ఉత్తమ్ ఆ ఫోటోను తన పేపర్లో వేసి ఓనర్లు ఎవరో తెలియడం లేదు అని రాశాడు. దానిపై ఎవరో కేసు వేశారు. చివరకు హై కోర్టు దాన్ని స్వాధీనం చేసుకుని కోర్టు రికర్డు రూముగా మార్చింది. ఆ తీర్పు వినగానే కొందరు పశు సంవర్ధక శాఖ అధికారులు కోర్టుకి వచ్చి ‘81 మంది సభ్యులున్న హౌసింగ్ కోపరేటివ్ ఏర్పరచుకుని మేం కట్టుకున్నాం’’ అని అఫడవిట్ దాఖలు చేశారు. ఆ 81 మంది ఎవరయ్యా అంటే ఆ శాఖ అధికారులు లేదా దాణా సప్లయిర్లు!
ఇవన్నీ బయటకు రావడంతో సిబిఐ చేత విచారణ చేయించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కలకత్తాలో ఏసియన్ ఏజ్‌లో పని చేస్తున్న రవి రా అనే జర్నలిస్టు బిహార్ ముఖ్యమంత్రికి కూడా హస్తం వుందని ఆరోపిస్తూ వ్యాసాలు రాశాడు. ఇలా తన ఆస్తులపై ప్రజల దృష్టి పడేట్టు చేస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియాను కట్టడి చేయాలని లాలూ భావించాడు. ‘రేపు ఉదయం 9 గంటలకు ఓ సారి కలవండి’ అని ఉత్తమ్‌కు లాలూ ఫోన్ చేశాడు. చాలా ఆలస్యంగా నిద్ర లేచే అంత పొద్దున్నే రమ్మనడం ఏమిటా అనుకుంటూ ఉత్తమ్ వెళ్లాడు. అక్కడ విజిలెన్స్ బ్యూరో చీఫ్ , బిహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ జబీర్ హుస్సేన్ కూడా వున్నారు. ‘‘మీ పత్రిక బిజెపికి బాకా పత్రికలా పనిచేస్తోంది. వాళ్ల ఆరోపణలు వేస్తున్నారు కానీ మా వివరణలు వేయడం లేదు’’ అని లాలూ నిందించాడు. ‘అలాటి సందర్భం ఒక్కటైనా చూపించండి’ అని ఉత్తమ్ సవాలు చేశాడు. మిగతా యిద్దరు అసలు విషయానికి వస్తే మంచిది కదా అని లాలూకి సూచించారు. లాలూ ఓరaాకు సైగ చేయగా, ఓరaా తన ఫైల్లోంచి ఒక డాక్యుమెంటు తీసి ఉత్తమ్‌కు యిచ్చాడు. ‘‘దాణా కుంభకోణం గురించిన అసలు వాస్తవం యిది. దీన్ని మీరు ప్రచురించగలరా?’ అని లాలూ వెక్కిరించాడు. పబ్లిక్ ఎక్కవుంట్స్ కమిటీ చైర్మన్ ముఖ్యమంత్రికి ఆ కుంభకోణం గురించి రాసిన ఉత్తరం అది. ‘‘మేము యిప్పటికే దానిపై విచారణ జరుపుతున్నాం కాబట్టి ప్రభుత్వపరంగా మీరు ఎలాటి విచారణ చేపట్టవద్దు’’ అని అతను కోరాడు. ముఖ్యమంత్రి దానిపై సంతకం చేసి పోలీసు డైరక్టర్ జనరల్‌కు పంపించాడు.-(సశేషం)
ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2013)