మొత్తానికి మళ్లీ ఆర్జీవీ లైన్లోకి వచ్చేసారు. అర్జున్ రెడ్డి సినిమా ఆయనకు అదనుకు దొరికింది. కాంగ్రెస్ నాయకుడు విహెచ్ హనుమంతరావుతో ఢీ అంటే ఢీ అంటున్నారు. అర్జున్ రెడ్డి పోస్టర్లు చింపడంపై హనుమంతరావుపై రామ్ గోపాల్ వర్మ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్జీవీని హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వనంటూ హనుమంతరావు ఖస్సుమన్నారు.
దీనికి బదులుగా తనను అడ్డుకోవడం కాదు, థియేటర్ కు వెళ్లకుండా హనుమంతరావు తన మనవలు, మనవరాళ్లను అడ్డుకోవాలని చెణకు విసిరారు. అంతే కాదు, హైదరాబాద్ లో అడ్డుకోవడం కాదు, శుక్రవారం ఉదయం 10.30కి ప్రసాద్ ఐమాక్స్ కు వస్తున్నా అడ్డుకోండి చూస్తా అంటూ సవాల్ విసిరారు. పైగా బస్తీమే సవాల్ అని కూడా కోట్ చేసారు.
మరి హనుమంతరావు ఈ సవాల్ ను ఎలా స్వీకరిస్తారో? రాష్ట్రం విడిపోయింది. తెలంగాణలో నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ లేదు. ఇలాంటి వాటి వల్ల హనుమన్న ఇలా అయిపోయారేమో కానీ ఒకప్పుడు తెలంగాణాలో కాస్త గట్టినేతే. బహుశా ఈ పరిస్థితి అంతా తెలిసే ఆర్జీవీ కాలు దువ్వుతున్నారేమో?
మొత్తానికి ఈ వ్యవహారం అంతా కలిసి అర్జున్ రెడ్డి సినిమాకు బాగా కలిసివస్తోంది.