సూర్య, కార్తీ అంటే చాలు తెలుగు జనాలకు జ్ఞాన్ వేల్ రాజా, స్టూడియో గ్రీన్ గుర్తుకు వస్తాయి. కానీ ఇటీవల వరుసగా సినిమాలు ఫ్లాప్ లు కావడం, డబ్బింగ్, పబ్లిసిటీ ఖర్చులు కూడా రాకపోవడంతో వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది.
పోనీ అలాగని సూర్య సినిమాల కోసం పెద్ద పెద్ద బ్యానర్లు ఏవైనా డబ్బింగ్ కోసం ముందుకు వస్తున్నాయా అంటే అదీ లేదని స్పష్టమైపోతోంది. సూర్య-పాండ్ రాజ్ కాంబినేషన్లో వస్తోందో డిఫరెంట్ సినిమా. దాదాపు అందరూ పిల్లలే..సూర్య తప్ప. దాని పేరు హైకూ..పిల్లలు ఎక్కువగా నటిస్తున్నందున సరైన పేరు. కానీమార్చాలని అనుకుంటున్నారు. అది వేరే సంగతి. ఈ సినిమాను సూర్య తన స్వంత బ్యానర్ 2డి ఎంటర్ టైన్మెంట్స్ పై నిర్మిస్తున్నారు.
సూర్య సరసన అమలాపాల్ నటిస్తోంది. మన తెలుగు అమ్మాయి బిందు మాధవి కూడా వుందీ సినిమాలో. దీని తెలుగు హక్కులు ఇచ్చేసారు. సూర్య, అమలాపాల్ లాంటి పేర్లు వున్నా హక్కుల కోసం ఎవరూపోటీ పడలేదని వినికిడి. ఆఖరికి ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని సాయి మణికంఠ పిల్మ్స్ ఈ హక్కులు తీసుకుంది. సరైన హిట్ లు లేకుంటే పరిస్థితి ఇలాగే వుంటుంది. హిట్ అవుతుంది..భారీ సినిమా అనుకుంటే మళ్లీ స్టూడియో గ్రీన్ రంగంలోకి దిగిపోతుంది.