తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్తున్నారంటూ విన్పిస్తోన్న వార్తలు అక్కినేని అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయసు మీద పడ్తున్నా పూర్తి ఆరోగ్యంతో కన్పించారు నిన్న మొన్నటిదాకా అక్కినేని నాగేశ్వరరావు. అయితే, తనకు క్యాన్సర్ వుందనే విషయాన్ని తనే స్వయంగా వెల్లడించి అందర్నీ షాక్‌కి గురిచేశారు.
‘వృద్ధాప్యంలో క్యాన్సర్ అంత తీవ్రంగా వుండదు.. నేను క్యాన్సర్‌ని జయిస్తా..’ అని చాలా ధీమాగా, ధైర్యంగా చెప్పిన అక్కినేని, అభిమానుల ఆందోళనను కొంతమేర తగ్గించే ప్రయత్నమైతే చేశారుగానీ, అప్పటినుంచీ ఆయన ఆరోగ్యంపై సరైన సమాచారం అభిమానులకు లభించడంలేదు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆయనకు ఆపరేషన్ జరిగిందనీ, ఆ తర్వాత వేగంగా కోలుకుంటున్నారనీ ఓ సారి అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున చెప్పారు.
అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా కలిసి ‘మనం’ సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. ఆ సినిమా షూటింగ్‌లో కూడా అక్కినేని హుషారుగా పాల్గొంటున్నట్లు వార్తలొచ్చాయి. దాంతో అభిమానులకు కొంత టెన్షన్ తగ్గింది అక్కినేని ఆరోగ్యంపై. ఈలోగా అక్కినేనికి తీవ్ర అనారోగ్యం.. అంటూ వస్తోన్న వార్తలతో ‘అక్కినేనికి ఏమైంది..’ అంటూ అక్కినేని ఆరోగ్యంపై అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఈ దశలో అక్కినేని కుటుంబం నుంచి, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అధికారికంగా బయటకొస్తే తప్ప అభిమానుల టెన్షన్ తగ్గేలా కన్పించడంలేదు.