మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో అంటే ఆ సినిమాపై భారీ అంచనాలుండడం సర్వసాధారణమైన విషయమే. మరి, అలాంటప్పుడు ఆ సినిమాని డీల్ చేయడం ఏ దర్శకుడికైనా కత్తిమీద సాము కాకుండా ఎలా వుంటుంది.? ‘ముకుంద’ సినిమా విషయంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా కిందా మీదా పడ్డాడు. తాను అనుకున్నట్టుగానే సినిమాని తెరకెక్కించాడు. ‘జస్ట్’ ఓకే అనిపించుకుంది మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ తెరంగేట్రం.
ఇప్పుడిక వరుణ్, మరో సినిమాకి రెడీ అయ్యాడు. ఈ నెల 27న వరుణ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాకి క్రిష్ దర్శకుడు. క్రిష్ అనగానే, ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలు గుర్తుకొస్తాయి. సమాజానికి సినిమా ద్వారా మంచి మెసేజ్ ఇవ్వాలని పరితపిస్తుంటాడు క్రిష్. కంటెంట్ పరంగా భేష్ అనిపించుకున్నా, కమర్షియల్ సక్సెస్ విషయంలో క్రిష్ కాస్త వెనకబడ్తున్నాడు. ‘గమ్యం’ ఒక్కటే కమర్షియల్‌గా వర్కవుట్ అయిన సినిమా.
తొలి సినిమా ‘ముకుంద’తో జస్ట్ ఓకే అనిపించుకున్న వరుణ్, రెండో సినిమాని క్రిష్ డైరెక్షన్‌లో చేస్తుండడంతో, ఈ సినిమాపైనా కమర్షియల్‌గా అంచనాలు పెట్టుకునేందుకు ఆస్కారం వుండబోదేమో.! వరుణ్ మాత్రం, క్రిష్ డైరెక్షన్‌లో నటించనుండడం చాలా ఎక్సయిటింగ్‌గా అనిపిస్తోందని ట్వీటేశాడు. ఈ నెల 27న సినిమా ప్రారంభోత్సవం.. అని కూడా ట్వీట్‌లో పేర్కొన్నాడు వరుణ్.