సంక్రాంతి బరిలోకి వెంకీమామ వస్తోంది అంటూ రెండురోజుల నుంచి ఒకటే హడావుడి. ఆ సినిమా డేట్ ఎక్కడ వస్తుందో అని తొందరపడి రెండుభారీ సినిమాలు డేట్ లు ప్రకటించేసాయి. కానీ తీరాచూస్తే, ఇప్పుడు వెంకీమామ మళ్లీ పునరాలోచనలో పడినట్లు బోగట్టా. సంక్రాంతికి రావాలని లేట్ గా నిర్ణయించుకోవడంతో, అస్సలు థియేటర్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు.
ఉత్తరాంధ్రలాంటి ఏరియాలో సోలోగా వస్తే కనీసం 100 థియేటర్లలో సినిమా వేసే అవకాశం వుంటుంది. అలాంటిది ఇఫ్పుడు నలభై థియేటర్లు దొరకడం కష్టం అన్నది గ్రౌండ్ రియాల్టీగా వుంది. దాదాపు అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి వుందని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఎటూ తేల్చుకోలేక కిందామీదా అవుతోంది వెంకీమామ యూనిట్.
ఏ విషయం రెండురోజుల్లో చెబుతాను అని వెంకీమామ యూనిట్ కు నిర్మాత సురేష్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది. మరోపక్కన డిసెంబర్ మూడోవారంలో వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. సురేష్ బాబు ఇటు డిసెంబర్ రెండోవారం నుంచి జనవరి రెండోవారం మధ్య డేట్ ల మధ్య ఊగిసలాడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చెన్నయ్ లో వున్న సురేష్ బాబు తిరిగి వచ్చాక కానీ వెంకీ మామ డేట్ మీద క్లారిటీరాదు. వెంకీమామ డైలామా చూసి ఇటు డిసెంబర్ మూడోవారంలో షెడ్యూలు అయిన సినిమాలు, పండగకు వద్దామనుకుంటున్న సినిమాలు కూడా అంతో ఇంతో టెన్షన్ పడుతున్నాయన్నది వాస్తవం.