2024.. వివాదాలతో వణికిన టాలీవుడ్

2024లో టాలీవుడ్ ఎన్ని హిట్స్ చూసిందో, అంతకుమించి వివాదాలు చవిచూసింది.

2024లో టాలీవుడ్ ఎన్ని హిట్స్ చూసిందో, అంతకుమించి వివాదాలు చవిచూసింది. అదేంటో ఈ ఏడాది మినిమం గ్యాప్స్ లో హిట్స్ రాకపోయినా, వివాదాలు మాత్రం పుట్టుకొచ్చాయి. నిజానికి టాలీవుడ్ కు వివాదాలు కొత్త కాదు, ఏటా ఉండేవే. కానీ ఈ ఏడాది కాంట్రవర్సీల డోస్ కాస్త పెరిగింది.

జైలుకెళ్లిన బన్నీ…

ఈ ఏడాది అతిపెద్ద వివాదం ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్ జైలుకెళ్లడమే. పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందింది. ఆ టైమ్ లో అల్లు అర్జున్ అక్కడే ఉన్నాడు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తీసుకెళ్లారు. ఆ వెంటనే హైకోర్టు అతడికి బెయిలిచ్చింది. అయినప్పటికీ ఒక రాత్రి బన్నీ జైళ్లో గడపాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

అక్కినేని పరువు నష్టం..

బన్నీ కోర్టు కేసు కంటే ముందే మరో కేసు అతిపెద్ద వివాదాస్పదమైంది. అదే అక్కినేని నాగార్జున, కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో అక్కినేని కుటుంబంపై, సమంతాపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. దీంతో నాగ్ హర్ట్ అయ్యారు. ఆమెపై క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిథిలో ఉంది.

మీడియాపై మోహన్ బాబు దాడి

ఇటు బన్నీ కేసు, అటు అక్కినేని పరువునష్టం దావా కేసు మధ్యలో మరో కేసు పడింది. ఇది మోహన్ బాబుకు సంబంధించిన వివాదం. ముందుగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వివాదం రేగింది. ఓవైపు ఆ వివాదం కొనసాగుతుండగానే, మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేయిచేసుకున్నారు. అది కాస్తా పెద్ద కేసు అయింది. దీంతో అసలు వివాదాన్ని పక్కనపెట్టి, మీడియా పెట్టిన కేసు నుంచి బయటపడేందుకు మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖ విడుదల చేసిన మోహన్ బాబు, తాజాగా హాస్పిటిల్ కు వెళ్లి తను దాడిచేసిన రిపోర్టర్ ను పరామర్శించారు. చిన్న కొడుకు మంచు మనోజ్ తో నడుస్తున్న పంచాయితీతో పాటు, జర్నలిస్ట్ ను కొట్టిన ఈ కేసును కూడా ఎదుర్కొంటున్నారు మోహన్ బాబు.

మైనర్ ను రేప్ చేశాడంటూ కేసు

ఈ ఏడాది టాలీవుడ్ లో అత్యంత వివాదాస్పదమైన మరో కేసు జానీ మాస్టర్ ది. తనను లైంగికంగా వేధించాడని, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది. అయితే ఇక్కడ అతిపెద్ద వివాదాస్పద అంశఁ ఏంటంటే.. ఆ టైమ్ లో తను మైనర్ నని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసుపై కొన్ని రోజులు జైళ్లో ఉన్న జానీ మాస్టర్, ప్రస్తుతం బెయిల్ పై బయటకొచ్చారు.

ప్రేయసితో రాజ్ తరుణ్ పాట్లు

టాలీవుడ్ ను ఉలిక్కిపడేలా చేసిన మరో వివాదం రాజ్ తరుణ్-లావణ్యల ప్రేమపురాణం. రాజ్ తరుణ్ తన భర్త అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది లావణ్య. ఆమె తన భార్య కాదు, ఎక్స్-గర్ల్ ఫ్రెండ్ అనేది రాజ్ తరుణ్ వాదన. వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం అప్పట్లో రోజుకో మలుపు తిరిగింది. మీడియాకు కావాల్సినంత మసాలా అందించింది. ఒక దశలో రాజ్ తరుణ్ తనను గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని కూడా ఆరోపించింది లావణ్య. ప్రస్తుతం రెండు పార్టీలు సైలెంట్ అయ్యాయి. కోర్టులో తేల్చుకుంటారా, కాంప్రమైజ్ అవుతారా అనేది కొత్త ఏడాదిలో తెలుస్తుంది.

ఆర్జీవీ లీగల్ కష్టాలు..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కష్టాలు పడ్డాడు. అతడిపై ఆంధ్రప్రదేశ్ లోని పలు పోలీస్ స్టేషన్లలో వరుసపెట్టి కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ నుంచి ప్రత్యేకంగా ఇద్దరు పోలీసులు హైదరాబాద్ వచ్చి వర్మ ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఒక దశలో ఆర్జీవీ పరారీలో ఉన్నాడనే కథనాలు కూడా వచ్చాయి. మొత్తానికి కోర్టు జోక్యంతో ఆర్జీవీ ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నారు.

హేమ డ్రగ్స్ కలకలం

గతేడాదిలానే ఈ ఏడాది కూడా టాలీవుడ్ ను డ్రగ్స్ వదల్లేదు. ఈసారి హేమ రూపంలో టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగింది. బెంగళూరులో జరిగిన ఓ పార్టీపై పోలీసులు దాడిచేసి హేమను అదుపులోకి తీసుకున్నారు. ఆమె డ్రగ్స్ సేవించినట్టు పోలీసులు చెప్పారు. అదే టైమ్ లో తను హైదరాబాద్ లో ఉన్నానంటూ హేమ బుకాయించే ప్రయత్నం చేశారు. ఆ మరుసటి రోజు చికెన్ బిర్యానీ రెసిపీ వీడియో కూడా పెట్టారు. తామిచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో, స్వయంగా హైదరాబాద్ వచ్చి హేమను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. అలా కొన్ని రోజుల పాటు జైళ్లో ఉన్న హేమ, బెయిల్ పై బయటకొచ్చారు. ఈ గ్యాప్ లో ఆమెపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెన్షన్ విధించడం, తిరిగి దాన్ని ఎత్తేయడం జరిగిపోయాయి.

నాగచైతన్య-వేణుస్వామి

నాగచైతన్య-వేణుస్వామి వివాదం కూడా టాలీవుడ్ లో ఈ ఏడాది హాట్ టాపిక్ గా మారింది. శోభితతో ఇలా నిశ్చితార్థం పూర్తయిందో లేదో అలా బ్లాక్ బోర్డ్, స్కెచ్ పెన్ తో రెడీ అయిపోయారు వేణుస్వామి. పెళ్లయిన మూడేళ్లకే వాళ్లిద్దరూ విడాకులు తీసుకుంటారంటూ జోస్యం చెప్పారు. దీంతో అంతా భగ్గుమన్నారు. వేణుస్వామిపై కేసులు కూడా పడ్డాయి. ప్రస్తుతం అవింకా నడుస్తున్నాయి.

ఈ ఏడాది టాలీవుడ్ లో వెలుగుచూసిన వివాదాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే మరికొన్ని కాంట్రవర్సీలు కూడా కనిపిస్తాయి. నటి పూనమ్ కౌర్, తొలిసారి నేరుగా త్రివిక్రమ్ పై ఆరోపణలు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, త్రివిక్రమ్ పై తను చేసిన ఫిర్యాదుపై స్పందించలేదన్నారు. అటు ప్రభాస్ పై బాలీవుడ్ కమెడియన్ అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి. ఇక హరీశ్ శంకర్, ఛోటా కె నాయుడు వివాదం కూడా చిన్నపాటి వివాదం రేపింది. ఇలా 2024లో చాలా వివాదాలు టాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటిలో చాలా వివాదాలు కొత్త ఏడాదిలో కూడా కొనసాగబోతున్నాయి.