బాలీవుడ్ లో వేగవంతంగా సినిమాలను చేసే హీరోల్లో ఒకరు అక్షయ్ కుమార్. పెద్ద గ్యాప్ లేకుండా సినిమాలను వదులుతూనే ఉంటాడు ఈ హీరో. ఈ క్రమంలో ప్రస్తుతం కూడా ఇతడి సినిమాలు రెండు రెడీ ఫర్ రిలీజ్ దశలో ఉన్నాయి. లెక్క ప్రకారం అయితే ఈద్ కు అక్షయ్ కుమార్ సినిమా లక్ష్మీ బాంబ్ విడుదల కావాల్సింది. అయితే ఇప్పుడు థియేటర్లలో విడుదల ముచ్చటే లేదు.
అలాగే మరో సినిమా సూర్యవంశీ కూడా దాదాపుగా మేకింగ్ పూర్తి చేసుకుంది. ఆ సినిమాకు సంబంధించి చాన్నాళ్ల కిందటే ట్రైలర్ కూడా వదిలారు. లక్ష్మీబాంబ్ తో పోలిస్తే సూర్యవంశీ బడ్జెట్ ఎక్కువ. దక్షిణాదిన హిట్ అయిన కాంచనకు రీమేక్ గా లక్ష్మీబాంబ్ రూపొందింది. ఎలాగూ రీమేక్ సినిమా కావడంతో.. దీన్ని ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి అక్షయ్ కు పెద్ద అభ్యంతరం లేనట్టుగా ఉంది. దాదాపు నెల కిందటే ఈ సినిమా ఒక డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ ద్వారా విడుదల అవుతుందనే ప్రచారం జరిగింది.
అప్పటి నుంచి చర్చలు కొనసాగుతూ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయని, ఈ సినిమాను త్వరలోనే ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారని సమాచారం. సూర్యవంశీ విషయంలో కూడా డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ వాళ్లు సంప్రదింపులు జరిపినా, దాన్ని థియేటర్లలో విడుదల చేయడానికే అక్షయ్ కట్టుబడ్డాడని, లక్ష్మీబాంబ్ మాత్రం పరిస్థితులకు అనుగుణంగా మంచి ధరకు ఒక డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ కు అమ్మేస్తున్నారనేది బాలీవుడ్ సమాచారం. ఊపు మీదున్న స్టార్ హీరో సినిమా ఇలా డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా రిలీజ్ అయితే, మరి కొన్ని చిన్న సినిమాలకూ ఆ రూట్ క్లియర్ అవుతున్నట్టే!