భారత దేశంలో పెళ్లి అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన అంశం. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిళ్లకు ఎంతో ప్రాధాన్యత. జీవితంలో ఒక్కసారి చేసుకునే కార్యంగా భారతీయుల్లో పెళ్లికి ఎనలేని ప్రాధాన్యత. ఎవరో కొందరు రెండో పెళ్లి చేసుకున్నా… మన దగ్గర పెళ్లంటే అంటే అది లైఫ్ టైమ్. అలాంటి పెళ్లి వేడుక అంటే లైఫ్ టైమ్ మెమొరీ! అలాంటి వేడుకను జ్ఞాపకంగా మార్చుకోవడానికి భారతీయులు తాపత్రయపడుతూ ఉంటారు. జనాల ఆర్థిక శక్తి పెరిగిన కొద్దీ పెళ్లిళ్లలో ఆర్బాటాలు పెరుగుతూ పోతూ ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇప్పుడు పెళ్లిళ్లలో ఎంతో హంగూ ఆర్బాటాలకు పోతూ ఉన్నారు. తినే తిండి, తాగే నీరు దగ్గర నుంచి పెళ్లంటే ధూంధాంగా ఉండాలనే అభిప్రాయం క్రమంగా ప్రబలిపోయింది.
తమ తాహతుకు మించి పిల్లల పెళ్లిళ్లు చేసే తల్లిదండ్రులు భారతదేశంలో ప్రతి చోటా కనిపిస్తారు. యువతీయువకుల్లో కూడా ఇలాంటి అభిప్రాయాలే బలపడిపోయాయి. పెళ్లంటే.. అదో వేడుక, అదో జ్ఞాపకం.. కాబట్టి వీలైనంత ఖర్చు పెట్టి దాన్ని అందంగా మలుచుకోవాలనే అభిప్రాయాలే యువతలో ఉన్నాయి. పెళ్లి వేడుకను సింపుల్ గా కానిచ్చేయమని ఎవరైనా ఈ తరం పిల్లల దగ్గర అని చూడండి.. వాళ్లు ససేమేరా అంటారు! తమ బంధువుల్లోనో, ఇంట్లో వాళ్లదో ఎవరి పెళ్లి అయినా ఘనంగా జరిగి ఉంటే.. ఆ స్థాయిలో తమ పెళ్లి కూడా జరగాలని స్పష్టం చేస్తారు! తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పెళ్లిని ప్రతిష్టగా తీసుకుంటారు కాబట్టి.. పిల్లల కోరిక మేరకు వేడుక నిర్వహించడానికి ఏ మాత్రం వెనుకాడని పరిస్థితి కొనసాగుతూ ఉంది.
ప్రతియేటా పెళ్లి వేడుకలపై భారతీయులు పెట్టినంత ఖర్చు ప్రపంచంలో మరే దేశస్తులూ పెట్టరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ మ్యారేజెస్ అనేవి అంతర్జాతీయ ఆర్థిక వేత్తలకు కూడా పరిశోధనాంశాలుగా మారిపోయాయి. భారతీయులు పెళ్లి వేడుకలు పెట్టే ఖర్చు పట్ల వారు ఆశ్చర్యపోతూ ఉంటారు. అంతంత ఖర్చులు పెట్టి వేడుకలు అవసరమా అని ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానిస్తూ ఉంటారు!
ఇలాంటి భారత దేశంలో ఇప్పుడు పెళ్లిళ్ల భాజాలు మరీ గట్టిగా మోగడం లేదు. కరోనా లాక్ డౌన్ నుంచి పాక్షిక మినహాయింపుల తర్వాత సామాన్యులు, అసామాన్యులు కూడా సింపుల్ గా పెళ్లి తంతును ముగిస్తూ ఉన్నారు. ఇటీవలే కొందరి ప్రముఖుల పెళ్లిళ్లు జరిగాయి. ఇదే సమయంలో గ్రామాల, పట్టణాల స్థాయిల్లో కూడా పెళ్లిళ్లు అంతే సింపుల్ గా జరుగుతున్నాయి. గుళ్లకు వెళ్లి తలంబ్రాలు పోసేసుకుంటున్నారు. ఎక్కువ మంది గెస్టులు లేరు, హంగూ, ఆర్బాటాలు, పెళ్లి ఊరేగింపులు.. భారీ డెకరేషన్లు లేవు. అంతా సింపుల్. అటువైపు ఓ పదిమంది, ఇటు వైపు ఓ పది మంది.. ఇలా జరుగుతున్నాయి పెళ్లిళ్లు. ఇది కొందరు అమ్మాయిల తల్లిదండ్రులకు ఊరటగా మారింది. ఖర్చులు తగ్గి వారు సులభంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా లాక్ డౌన్ కు ముందే కుదిరిన పెళ్లిళ్లు మినహాయింపుల తర్వాత సింపుల్ గా జరుగుతున్న వైనం ఆసక్తిదాయకంగా నిలుస్తూ ఉంది. మరి కొన్ని రోజులు పెళ్లిళ్లు భారీ సమూహంతో జరిగే అవకాశాలు లేనట్టే. దీంతో హంగూఆర్భాటాలు లేని సింపుల్ పెళ్లిళ్లు భారతీయులకు కూడా కామన్ అయ్యేలా ఉన్నాయి!