ఇవాళ్టితో మూడో దశ లాక్ డౌన్ ముగిసింది. రేపట్నుంచి నాలుగో దశ లాక్ డౌన్ మొదలవుతుంది. ఇప్పటికే కొన్ని మినహాయింపులు ఇచ్చిన కేంద్రం, నాలుగో దశ లాక్ డౌన్ లో మరిన్ని మినహాయింపులు ఇచ్చింది. వీటిలో కీలకమైనది బస్సు సర్వీసులు.
అవును.. లాక్ డౌన్ -4లో బస్సులు నడుపుకోవచ్చు. కాకపోతే రాష్ట్ర సరిహద్దులు దాటడానికి వీళ్లేదు. కంటైన్మెంట్ జోన్లు టచ్ చేయడానికి వీల్లేదు. ఈ రెండు నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నడుపుకోవచ్చు. కాకపోతే పొరుగు రాష్ట్రం అంగీకరిస్తే సరిహద్దులు దాటి కూడా బస్సులు నడుపుకోవచ్చు. ఎప్పట్నుంచి నడపాలనే నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది కేంద్రం.
రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లపై కూడా రాష్ట్రాలకు పూర్తి వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. ఇకపై తమ రాష్ట్రంలో ఏఏ ప్రాంతాల్ని రెడ్ జోన్లుగా ప్రకటించాలనే అంశాన్ని రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. దీనికి కేంద్రం అనుమతి అవసరం లేదు కానీ కొన్ని నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. కేంద్రానికి సమాచారం మాత్రం ఇస్తే సరిపోతుంది.
రేపట్నుంచి కార్గో సర్వీసులకు పూర్తి మినహాయింపు ఉంటుంది. అన్ని రకాల వస్తు రవాణా వాహనాల్ని అన్ని రాష్ట్రాల్లో అనుమతించాలని కేంద్రం సూచించింది. చివరికి ఖాళీ ట్రక్కుల్ని కూడా అనుమతించబోతున్నారు. వీటితో పాటు నర్సులు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లవచ్చు. వాళ్లకు ఎలాంటి నిబంధనలు వర్తించవు.
మరోవైపు కంటెన్మెంట్ జోన్లకు సంబంధించి తమ మార్గదర్శకాల్ని తప్పకుండా పాటించాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ఇక నిషేధం కొనసాగే జాబితాలో విమాన ప్రయాణాలు, మెట్రో రైలు సర్వీసులు ఉన్నాయి. వీటితో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ పై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయి. అయితే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో క్యాంటీన్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈనెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.