లైంగిక వేధింపులు బయటపెట్టిన అంజలి

చిన్నతనంలో, తండ్రితో సమానమైన ఓ వ్యక్తి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని అంజలి బయటపెట్టింది.

కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ సినిమాతో రణ్వీర్ సింగ్, అలియా భట్ తో కలిసి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నటి అంజలి ఆనంద్. ఈమె తనకు ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాన్ని బయటపెట్టింది.

చిన్నతనంలో, తండ్రితో సమానమైన ఓ వ్యక్తి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని అంజలి బయటపెట్టింది.

ఎనిమిదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది అంజలి. ఆ తర్వాత మరో వ్యక్తి ఆమె జీవితంలోకి అడుగుపెట్టాడు. బలవంతంగా అతడ్ని తమ కుటుంబంలో అంగీకరించాల్సి వచ్చిందని వెల్లడించిన అంజలి.. ఆ పసితనంలో తను ఒంటరిగా ఉన్నప్పుడు అతడు తనను ఏదో చేయడానికి ప్రయత్నించాడని, అదేంటనేది తనకప్పుడు తెలియదని తెలిపింది.

“నేను నీ నాన్నని అని అతడు నాతో చెప్పాడు. మెల్లమెల్లగా అతడు నాతో చెడుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ముందు గట్టిగా హత్తుకున్నాడు. ఆ తర్వాత నా పెదవులపై ముద్దు పెట్టాడు. నాన్నలు ఇలానే ప్రవర్తిస్తారని అతడు నాతో చెప్పాడు.”

ఆ తర్వాత అతడు అంజలిని పూర్తిగా నియంత్రించాడట. జుట్టు విరబూసుకోనివ్వలేదంట, ఫ్రెండ్స్ తో కలవనివ్వలేదంట, ఆడపిల్లలు వేసుకునే దుస్తులు కాకుండా తన టీ-షర్టులు వేయించేవాడంట.

ఇలా చాలా ఏళ్ల పాటు నడిచిందని, ఆ తర్వాత తన తండ్రికి స్నేహితుడైన ఓ వ్యక్తి కొడుకు తనకు దగ్గరయ్యాడని, అతడే తన తొలి ప్రియుడని చెప్పుకొచ్చింది అంజలి. అతడు తనకు దగ్గరైన తర్వాత తన జీవితంలో మార్పులొచ్చాయని, తండ్రి అని చెప్పుకునే ఆ వ్యక్తి నుంచి ఎన్నో సందర్భాల్లో తన బాయ్ ఫ్రెండ్ కాపాడాడని చెప్పుకొచ్చింది.

3 Replies to “లైంగిక వేధింపులు బయటపెట్టిన అంజలి”

Comments are closed.