ఏ వ్యవహారంలో అయిన తన మార్కు హల్చల్ చేయడం నటుడు, నిర్మాత బండ్లగణేష్ స్టైల్ గా మారింది. పవన్ కల్యాణ్, రాజకీయాలు, మా ఎన్నికలు.. ఇలా బండ్ల గణేష్ వివిధ అంశాల్లో టీవీ చర్చలు, ఇంటర్వ్యూల్లో హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఈయన డ్రగ్స్ వ్యవహారాన్ని కానీ ఎందుకు వదలాలి అన్నట్టుగా ఈడీ ఆఫీసు వద్ద హల్చల్ చేయడం గమనార్హం. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో మంగళవారం రాత్రి బండ్ల కూడా అక్కడ ప్రత్యక్షమై వార్తల్లోకి ఎక్కడు.
విచారణకు హాజరైన సందర్భంగా పూరీ కూడా మీడియాతో ఏమీ మాట్లాడలేదు. పూరీ ఫేస్ కూడా మాడిపోయింది. చిరనవ్వులు చిందిస్తూ, మీడియాకు అభివాదం చేసుకుపోయే సందర్భం ఏదీ కాకపోవడంతో పూరీ కూడా కామ్ గా కనిపించారు. ఏకంగా పది గంటల పాటు పూరీని అధికారులు అక్కడే పెట్టుకున్నారు. అందులో రెండు మూడు గంటల పాటు విచారణ జరిగిందట. రాత్రి వరకూ ఆ విచారణ జరగగా.. ఆ సమయంలో ఉన్నట్టుండి బండ్ల ఈడీ ఆఫీసు వద్ద హల్చల్ చేయడంతో.. మీడియా కెమెరాలన్నీ అటు వైపు తిరిగాయి.
పగలంతా అక్కడే మకాం పెట్టిన టీవీ ప్రతినిధులకు ఎంటర్ టైన్ మెంట్ కోసం అన్నట్టుగా బండ్ల అక్కడ చేరాడు. మిమ్మల్ని కూడా అధికారులు విచారణకు పిలిచారా అంటూ బండ్లతో మీడియా ప్రతినిధులు ఆరాతీయగా, తనకు అంత సీన్ లేదన్నట్టుగా బండ్ల చెప్పుకొచ్చాడు. తనకు వక్కపొడి నమిలే అలవాటు కూడా లేదని, డ్రగ్స్ కేసుతో తనకు ఏం సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నాడు.
మామూలుగా అయితే వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం బండ్లకు ఏమీ లేదు. అయినా అక్కడ కూడా తనకో స్పేస్ క్రియేట్ చేసుకోవడం బండ్లకే సాధ్యం అయ్యింది. ఈడీ అధికారులు పూరీని ఇంకా ఇంటికి పంపించకపోవడంతోనే..ఏమయ్యిందో తెలుసుకోవడానికి తను అక్కడకు వచ్చినట్టుగా బండ్ల చెప్పుకొచ్చాడు. పూరీ పట్ల ఇలా తన ఆత్మీయతను చాటుకున్నాడు. పనిలో పనిగా.. పూరీ కోసం వచ్చిన బండ్లను కూడా ఈడీ అధికారులు రేపో ఎల్లుండి.. కాసేపు విచారణకు పిలిస్తే ఎలా ఉంటుందో!