ఆ హీరోయిన్ మొదటి సినిమా ఏది?

ఈ రెండు సినిమాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

లవ్ టుడే.. తమిళనాట మాత్రమే కాదు, తెలుగులో కూడా సూపర్ హిట్టయిన బొమ్మ. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఇవానా. కుర్రాళ్ల గుండెల్లో గూడు గట్టేసింది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో టాలీవుడ్ లో ఓ మంచి ప్రాజెక్టుతో అడుగుపెట్టాలనుకుంది.

అందుకే దిల్ రాజు లాంటి నిర్మాత సినిమాలో నటించడానికి అంగీకరించింది. అదే సెల్ఫిష్. ఈ విషయంలో ఇవానా ప్లానింగ్ బాగానే ఉంది కానీ ఆ సినిమా ప్లానింగే బాగాలేదు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా, ఇంకా రీ-షూట్ మోడ్ లోనే ఉంది.

దీంతో మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పింది ఇవానా. ఇంకా పేరు పెట్టని శ్రీవిష్ణు కొత్త సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవానా నుంచి రాబోయే తొలి తెలుగు సినిమా ఏదనే చర్చ మొదలైంది.

సెల్ఫిష్ రీషూట్ మోడ్ లో ఉందని ఇంతకుముందే చెప్పుకున్నాం. సుకుమార్ అందుబాటులోకి రావడంతో, మరో 2 నెలల్లో సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది. అటు శ్రీవిష్ణు సినిమా కూడా దాదాపు 70 శాతం పూర్తయింది.

సో.. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఈ ఏడాది మాత్రం టాలీవుడ్ లో అడుగుపెట్టలేకపోయింది ఈ ‘లవ్ టుడే’ బ్యూటీ. కొత్త ఏడాదిలో ఆమె అదృష్టం ఎలా ఉందో చూడాలి.