తిరుప‌తి జిల్లాలో భారీ వ‌ర్షం

తుపాను కార‌ణంగా తిరుప‌తి జిల్లాలో గ‌త రాత్రి నుంచి విస్తారంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి.

తుపాను కార‌ణంగా తిరుప‌తి జిల్లాలో గ‌త రాత్రి నుంచి విస్తారంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. మరీ ముఖ్యంగా తిరుప‌తి, తిరుమ‌ల‌లో గ‌త రాత్రి నుంచి ఏక‌ధాటిగా వాన ప‌డుతూనే వుంది. దీంతో తిరుమ‌ల‌లో భ‌క్తులు తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు. తిరుప‌తి న‌గ‌రంలో లోతట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర అల్ప‌పీడ‌నం వాయుగుండంగా బ‌ల‌ప‌డుతోంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్ర‌భావంతో ద‌క్షిణ కోస్తా, రాయ‌ల‌సీమ జిల్లాల్లో విస్తారంగా వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు పేర్కొన్నారు.

అయితే తిరుప‌తి జిల్లాలో వ‌ర్షాలు బాగా ప‌డుతున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ విద్యా సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం గురువారం సెల‌వు ప్ర‌క‌టించింది.

తిరుమ‌ల‌లో భారీ వ‌ర్షం కురుస్తుండ‌డంతో కొండ‌చ‌రియ‌లు ఘాట్ రోడ్ల‌లో విరిగి ప‌డే ప్ర‌మాదం వుంద‌ని టీటీడీ అధికారులు వాహ‌న‌దారుల్ని హెచ్చ‌రిస్తున్నారు. ఇటీవ‌ల తుపానులో కొండ చ‌రియ‌లు విరిగిప‌డి గంట‌ల త‌ర‌బ‌డి ఘాట్ రోడ్‌లో ప్ర‌యాణానికి ఇబ్బంది ఏర్ప‌డింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

అలాగే పాప‌వినాశ‌నం, శ్రీ‌వారి పాదాల‌కు వెళ్లే మార్గాల‌ను అధికారులు మూసేశారు. గోగ‌ర్భం, పాప‌వినాశ‌నం జ‌లాశ‌యాలు వ‌ర‌ద నీటితో నిండాయి. దీంతో అధికారులు గేట్లు ఎత్తి, నీటిని కిందికి వ‌దిలారు. వ‌రుస తుపానుల‌తో తిరుప‌తి, నెల్లూరు జిల్లాల ప్ర‌జానీకానికి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.