శేఖర్ బాబును ఎవరు చంపారు.. ఎంక్వయిరీ మొదలుపెడదాం.. ఈ రెండు డైలాగ్స్ తో టోటల్ కల్కి ప్లాట్ ఏంటో చెప్పకనే చెప్పేశారు కల్కి మేకర్స్. కొద్దిసేపటి కిందట కల్కి ట్రయిలర్ రిలీజైంది. సినిమా కథేంటనే విషయాన్ని ఏమాత్రం దాయకుండా చూచాయగా లైన్ ఏంటనేది చెప్పేశారు. పోలీసాఫీసర్ రాజశేఖర్, శేఖర్ బాబు మర్డర్ మిస్టరీని ఎలా చేధించాడనేది కల్కి సినిమా. ఇంతకీ ఈ శేఖర్ బాబు ఎవరనేది సినిమాలో ట్విస్ట్.
ఈ కథ కోసం 1980ల నాటి తెలంగాణ గ్రామాన్ని నేపథ్యంగా ఎంచుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. సాంకేతిక అంశాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టే ఈ దర్శకుడు, కల్కి సినిమాను కూడా తన టేస్ట్ కు తగ్గట్టు టెక్నికల్లీ రిచ్ గా తీశాడు. ఇంతకుముందు విడుదలైన కమర్షియల్ ట్రయిలర్ లానే తాజాగా విడుదలైన హానెస్ట్ ట్రయిలర్ కూడా క్లిక్ అయింది.
ట్రయిలర్ కు శ్రవణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కాకపోతే ట్రయిలర్ లో అక్కడక్కడ వచ్చిన కొన్ని షాట్స్, వాటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తే.. తాజాగా వచ్చిన సాహో టీజర్ గుర్తొస్తుంది. ఓవరాల్ గా కల్కి సినిమా పక్కా యాక్షన్ మూవీ అనే విషయాన్ని ట్రయిలర్ తో క్లియర్ గా చెప్పేశారు.
అదాశర్మ, నందితశ్వేత, పూజిత పొన్నాడ లాంటి హీరోయిన్లు ఉన్నప్పటికీ ఇందులో ప్రత్యేకంగా ఒక్కర్ని హీరోయిన్ అని చెప్పడానికి వీల్లేదు. కేసును ఛేదించే క్రమంలో ఒక్కో దశలో ఒక్కొక్కరు హీరోకు ఎదురవుతారు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా (28న) థియేటర్లలోకి రానుంది కల్కి.