మార్చి నెల నుంచి సమ్మర్ సినిమాల హవా మొదలవుతుంది. ఏటా ఈ నెలలో కచ్చితంగా ఓ హిట్ పడుతుంది. గతేడాది మార్చి నెలలో వచ్చిన బలగం, దాస్ కా ధమ్కీ సినిమాలు హిట్టవ్వగా.. అంతకుముందు ఏడాది మార్చిలో ఆర్ఆర్ఆర్ వచ్చింది. ఇంకాస్త వెనక్కి వెళ్తే జాతిరత్నాలు ఉంది. మరి ఈ ఏడాది మార్చి నెల బాక్సాఫీస్ పరిస్థితేంటి?
మార్చి 1, 2 తేదీల్లో ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. కాస్త అంచనాలతో వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ కూడా ఫెయిల్ అవ్వడం, టాలీవుడ్ కు చిన్నపాటి షాక్ తగిలినట్టయింది. వరుణ్ తేజ్ లుక్, అతడి యాక్టింగ్ మినహా.. మరే కోణంలోనూ ఈ సినిమా ఆకట్టుకోలేదు.
ఈ సినిమాతో పాటు వెన్నెల కిషోర్ లీడ్ రోల్ లో నటించిన చారీ111, శివ కందుకూరి చేసిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా కూడా ఇదే వారం రిలీజై, ఫ్లాప్ అయింది. కిక్, నరసింహనాయుడు లాంటి రీ-రిలీజెస్ కూడా మెప్పించలేకపోయాయి.
మొదటి వారంలో భీమా, గామి సినిమాలు పోటీపడ్డాయి. శివరాత్రి వీకెండ్ కూడా కలిసిరావడం ఈ సినిమాలకు ప్లస్ పాయింట్ గా మారింది. కానీ అలాంటి అనుకూలతలేవీ భీమాకు పనిచేయలేదు. రిలీజైన మొదటిరోజే గోపీచంద్ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. ఆ తర్వాత అది కాస్తా నెగెటివ్ టాక్ గా మారిపోయింది.
గామి సినిమాది మరో కథ. విశ్వక్ సేన్ చేసిన ఈ ప్రయోగాన్ని వెరైటీ కోరుకునే ప్రేక్షకులు మెచ్చుకున్నారు. గట్టిగా ప్రచారం చేయడంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. కానీ ఆ తర్వాత సినిమా ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది. ఓపిగ్గా కూర్చొని చూసే సామాన్య జనం తగ్గిపోయారు. అయితే వీటితో పాటు వచ్చిన మలయాళం డబ్బింగ్ మూవీ ప్రేమలు మాత్రం నిలబడింది. మల్టీప్లెక్సుల్లో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఇవి కాకుండా శివరాత్రి వీకెండ్ లో వచ్చిన మరో 5 సినిమాలు వేటికవే ఫ్లాప్ అయ్యాయి.
రెండో వారంలో… రజాకార్, తంత్ర, వెయ్ దరువెయ్ లాంటి సినిమాలొచ్చాయి. వీటిలో ప్రచారంతో ఆకట్టుకున్న సినిమా తంత్ర. అనన్య నాగళ్ల లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ బాగానే చొప్పించారు. కానీ సరైన ప్రచారం లేక, సినిమా జనాల్లోకి వెళ్లలేదు. ఇంకాస్త ప్రచారం చేసినట్టయితే పొలిమేర-2, పిండం సినిమాల టైపులో ఇంకొన్ని రోజులు నిలబడేది.
లాంగ్ గ్యాప్ తర్వాత సాయిరాం శంకర్ చేసిన వెయ్ దరువెయ్ సినిమా ఫ్లాప్ అవ్వగా.. రజాకార్ సినిమాకు చేసిన భారీ ప్రచారం థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించలేకపోయింది. ఇక దర్శకుడు కల్యాణ్ కృష్ణ నిర్మాతగా మారి తీసిన లంబసింగి అనే సినిమాతో పాటు, షరతులు వర్తిస్తాయి అనే మరో సినిమా కూడా ఈ వారం రిలీజై ఫెయిలయ్యాయి.
మూడో వారంలో ఓం భీమ్ బుష్ రిలీజైంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి చేసిన ఈ ఫార్స్ హారర్ కామెడీ చిత్రం అక్కడక్కడ నవ్వించింది. జాతిరత్నాలు టైపులో ఊహించుకొని వెళ్లిన ప్రేక్షకులకు ఆశాభంగం ఎదురైంది. అప్పటికీ మేకర్స్ చెబుతూనే ఉన్నారు, కానీ ప్రేక్షకులు మాత్రం వినలేదు. మరో జాతిరత్నాలు వస్తుందనుకొని అంచనాలు పెట్టుకున్నారు. అదే ఈ సినిమాకు శాపంగా మారింది.
ఈ వారం 2 సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒక మూవీ గురించి చెప్పుకోవాలి. అదే నువ్వు-నేను. ఉదయ్ కిరణ్ నటించిన ఈ సినిమా బి, సి సెంటర్లలో ఆకట్టుకుంది. లిమిటెడ్ రిలీజ్ కావడం వల్ల పెద్దగా సౌండ్ చేయలేదు కానీ.. చాలామంది థియేటర్లకు వెళ్లిచూశారు. మరో రీ-రిలీజ్ ‘ఈ రోజుల్లో’ ఆకట్టుకోలేకపోయింది.
ఇక మార్చి నెలకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ రిలీజ్ అయిన సినిమా టిల్లూ స్క్వేర్. ఈ నెలలో సిసలైన సక్సెస్ ఈ సినిమానే. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలుండేవి. ఆ అంచనాల్ని టిల్లూ నిలబెట్టుకున్నాడు. తన నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తున్నారో, వాటిని మాత్రమే అందించాడు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమా మంచి వసూళ్లు కళ్లజూసే అవకాశం ఉంది.
టిల్లూతో పాటు వచ్చిన గోట్ లైఫ్ (ఆడు జీవితం), తలకోన, కలియుగం పట్టణంలో లాంటి సినిమాలన్నీ ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి. ఓవరాల్ గా మార్చి నెలలో దాదాపు 35 సినిమాలు రిలీజ్ అవ్వగా.. వీటిలో టిల్లూ స్క్వేర్ మాత్రమే విజేతగా నిలిచింది.