టీడీపీలో కన్నీళ్ల ఏరులు!

తెలుగుదేశం పార్టీ రంగు పసుపు. పసుపు శుభ సూచిక అని వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆనాడు ఆ రంగుని ఎంచుకున్నారు. తెలుగుదేశం చంద్రబాబు చేతిలో పడి మూడు దశాబ్దాలు దగ్గర పడుతోంది. ఉమ్మడి ఏపీ నుంచి…

తెలుగుదేశం పార్టీ రంగు పసుపు. పసుపు శుభ సూచిక అని వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆనాడు ఆ రంగుని ఎంచుకున్నారు. తెలుగుదేశం చంద్రబాబు చేతిలో పడి మూడు దశాబ్దాలు దగ్గర పడుతోంది. ఉమ్మడి ఏపీ నుంచి కేవలం సీమాంధ్రకే పరిమితం అయ్యే స్థాయికి వచ్చింది. ఈ ఎన్నికలు టీడీపీకి చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తేనే ఉనికి అన్నది అంతా అంటున్నదే. అలాంటపుడు టికెట్ల పంపిణీ ఎంత జాగ్రత్తగా చేయాలి. పొత్తుల పేరుతో చాలా చోట్ల సీట్లు పోయాయి. మరి కొన్ని చోట్ల సర్దుబాట్లు పేరుతో సీట్లు కాకుండా చేశారు. ఎన్నికల సమయంలో యువతకు అవకాశాలు అని అంటారు.

తీరా అసలైన టైం వచ్చేసరికి మాత్రం యూత్ ని పక్కన పెట్టేస్తారు. మాట ఇచ్చిన వారికి టికెట్లు లేవు. అయిదేళ్ళు సొంత ఖర్చుకు పెట్టి ఇంఛార్జిగా ఉన్న నియోజకవర్గాలలో టికెట్లు లేకుండా పోయాయి. దాంతో ఉత్తరాంధ్ర తమ్ముళ్ళు మరుగుతున్నారు. కన్నీళ్ళతో ఏరులు పారిస్తున్నారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి లాంటి వారు అయితే రాజకీయాలకు దండం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరో సీనియర్ నేత కళా వెంకట్రావుకి ఎచ్చెర్ల సీటు అడిగితే ఇష్టం లేని చీపురుపల్లికి పంపారు. అక్కడ పార్టీ కోసం పనిచేస్తున్న నాగార్జునకు షాక్ ఇచ్చారు.

దాంతో మీడియా ముందు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. యువత రాజకీయాల్లోకి రావద్దు అని పిలుపు ఇచ్చేశారు మీరు విలువైన సమయం ఇక్కడ పోగోట్టుకోవద్దు. రాజకీయం అన్నది విషవలయం అని ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానికి టికెట్ లేదు అంటే రగిలిపోతోంది. పాతపట్నంలో రాజకీయ కుటుంబంగా ఉన్న కలమట ఫ్యామిలీ కూడా టీడీపీ మీద నిప్పులు చెరుగుతోంది.

విజయనగరం జిల్లా ఎస్ కోటలో ఎన్నారై గొంప క్రిష్ణ తాను జనం అభిప్రాయం మేరకు నడచుకుంటాను అని రెబెల్ స్వరం వినిపించారు. మాడుగులలో మరో ఎన్నారైకి టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఫైర్ అవుతున్నారు. విశాఖ ఏజెన్సీలో అరకు పాడేరు రెండు సీట్లలో టీడీపీ అధినాయకత్వం వ్యవహరించిన తీరుతో తమ్ముళ్ళు మండిపడుతున్నారు. అరకులో సీటు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకుని బీజేపీకి ఇవ్వడంతో దన్ను దొర ఇండిపెండెంట్ గా ముందుకు వస్తున్నారు.

పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అయితే తనకు టికెట్ ఇవ్వనందుకు గానూ టీడీపీ అభ్యర్ధిని ఓడించి తీరుతామని శపధం చేస్తున్నారు. ఇవన్నీ పార్టీకి శుభ శకునాలేనా అన్న ప్రశ్నలు ఆ పార్టీ శిబిరంలో వస్తున్నాయి. కన్నీళ్ళు మంచివి కావు అని అంటున్న వారూ ఉన్నారు. ఉత్తరాంధ్రాలో ఇంతలా కకావికలు చేసుకోవడం వల్ల పార్టీకి లాభమా నష్టమా ఆలోచించాలని అంటున్నారు.