వలస నేతలను ఉత్తరాంధ్ర తిప్పికొడుతుంది!

ఎక్కడ నుంచి టికెట్ పుచ్చుకుని వచ్చి పడిన పారాచూట్ బ్యాచ్ ని ఉత్తరాంధ్ర ప్రజలు తిప్పికొడతారు అంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఉత్తరాంధ్ర అంటే సహనానికి మారు పేరు…

ఎక్కడ నుంచి టికెట్ పుచ్చుకుని వచ్చి పడిన పారాచూట్ బ్యాచ్ ని ఉత్తరాంధ్ర ప్రజలు తిప్పికొడతారు అంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఉత్తరాంధ్ర అంటే సహనానికి మారు పేరు అని ఆయన అన్నారు. అలాగని ఎవరు పడితే వారిని రుద్దితే సహించే మనస్తత్వం కూడా ఈ నేలకు లేదని అన్నారు.

లాబీయిస్టులు పోటీకి దిగడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడ నుంచి అయినా పోటీ చేయవచ్చునని అయితే అలా పోటీ చేసిన వారు ఆయా ప్రాంతాలకు తెలిసిన వారు అయిన ఉండాలని ఎంతో కొంత సేవ చేసిన వారు అయి ఉండాలని ఆయన అన్నారు.

ఏమీ కాకుండా ఎక్కడ నుంచో దిగిపోయి ఉత్తరాంధ్ర మీద రాజకీయ పెత్తనం చేస్తామంటే జనాలు చూస్తూ ఊరుకోరని ఆయన ఫైర్ అయ్యారు. సహనానికి హద్దు ఉంటుందని దాన్ని పరీక్షించవద్దు అని హెచ్చరించారు. ఆయన మాటలు అన్నీ అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మీదనే అని అనుకుంటున్నారు.

రమేష్ కి అనకాపల్లికి బీరకాయ పీచు సంబంధం కూడా లేదు అలాంటిది ఆయన లాబీయింగ్ చేసుకుని సీటు తెచ్చుకున్నారని కడప నుంచి పది జిల్లాలు దాటి వచ్చారని ఇప్పటికే మేధావులు విమర్శిస్తున్నారు. బొత్స దానికి తోడు అయ్యారు అని అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కూటమి తన అభిప్రాయం చెప్పి ప్రచారం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయమని బీజేపీ చేత ప్రకటన చేయించాలని ఆయన కోరారు. తమ పార్టీ స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిందని కార్మికుల ఉద్యమానికి మద్దతు ఇచ్చిందని బొత్స గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తూంటే వైసీపీ లోకల్ నినాదంతో పాటు స్టీల్ ప్లాంట్ ఇష్యూతో కూటమిని ఇరుకున పెట్టాలని అనుకుంటోందని అర్ధం అవుతోంది.