టీడీపీ మాజీ మంత్రిది విచిత్ర పరిస్థితి!

అనకాపల్లి రాజకీయాల్లో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన దాడి వీరభద్రరావు టీడీపీలో మళ్ళీ చేరారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆ పార్టీలోనే ఉన్నారు. ఈ ఇద్దరూ టీడీపీలో ఉన్నపుడు రెండు వర్గాలుగా ఉండేవారు. అలాగే మరో…

అనకాపల్లి రాజకీయాల్లో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన దాడి వీరభద్రరావు టీడీపీలో మళ్ళీ చేరారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆ పార్టీలోనే ఉన్నారు. ఈ ఇద్దరూ టీడీపీలో ఉన్నపుడు రెండు వర్గాలుగా ఉండేవారు. అలాగే మరో మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణతో ప్రత్యర్ధిగా దాడి ఉంటూ వచ్చారు. ఆయన ఇపుడు జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉన్నారు.

ఈ నేపధ్యంలో దాడి వీరభద్రరావుది చిత్రమైన పరిస్థితిగా మారింది. ఆయన తాను దశాబ్దాలుగా వ్యతిరేకించే వారితో పనిచేయడం ఈ ఎన్నికల్లో కనిపిస్తోంది. మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణను అనకాపల్లి ఎమ్మెల్యేగా జనసేన తరఫున గెలిపించుకోవాల్సిందే. అదే విధంగా సీఎం రమేష్ కూటమి ఎంపీ అభ్యర్ధిగా ఉన్నారు. ఆయన కోసం పనిచేయాల్సిందే. వైసీపీని వీడి వచ్చిన దాడికి ఆయన కుమారుడికి టికెట్ అయితే దక్కలేదు.

కానీ ఆయన రాజకీయ ప్రత్యర్ధులకు మాత్రం ఎన్నికల్లో టిక్కెట్లు దక్కాయి. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తే ఏదైనా మేలు జరుగుతుందని భావించి దాడి కుటుంబం టీడీపీ కోసం పనిచేయాల్సిందే అంటున్నారు. అలా హామీలు తీసుకున్న వారు టీడీపీలో చాలా మంది ఉన్నారు. ఇవన్నీ చూస్తూంటే పార్టీలు మారినా రాతలు కొందరికే మారుతాయన్నది అర్ధం అవుతోంది అంటున్నారు.

ఇదిలా ఉంటే అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి దాడిని అయ్యన్నపాత్రుడిని కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మొదట అయ్యన్నపాత్రుడుని కలసి వచ్చిన సీఎం రమేష్ తాజాగా దాడి వీరభద్రరావుని కూడా కలిశారు. ఆయన తన రాజకీయ గురువు అని ఆకాశానికి ఎత్తేశారు. దాడి వద్దనే తాను ఎన్నో నేర్చుకున్నాను అని వినయంగా చెప్పుకున్నారు.

దాడిని కూడా కలుపుకుని పోతేనే తప్ప అనకాపల్లిలో విజయం దక్కదని సీఎం రమేష్ గ్రహించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. దాడి సైతం తన ఇంటికి వచ్చిన కొణతాలను సీఎం రమేష్ వంటి వారిని ఆశీర్వదించి గెలిపించడం అనివార్యం అవుతోంది.