గత ఏడాది ప్రముఖంగా వార్తల్లో నిలిచిన అంశాల్లో ఒకటి బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అరెస్టు చేయడం. ఒక క్రూజ్ షిప్ లో పార్టీ సందర్భంగా ఆర్యన్ ఖాన్ తన సన్నిహితులతో కలిసి డ్రగ్స్ వాడారనే వార్తలు మొదట వచ్చాయి. ఆ తర్వాత ఆర్యన్ వద్ద డ్రగ్స్ పట్టుబడలేదని.. అతడితో పాటు ఉన్న మరొక యువకుడి వద్ద కొన్ని గ్రాముల మేరకు డ్రగ్స్ వాడినట్టుగా ఎన్సీబీ తన అభియోగాల్లో పేర్కొంది.
ఆ కేసుల్లో ఆర్యన్ ఖాన్ ను దాదాపు పాతిక రోజుల పాటు జైల్లో ఉంచింది ఎన్సీబీ. తన తనయుడిని విడిపించుకోవడానికి పలు సార్లు షారూక్ ఖాన్ కోర్టును ఆశ్రయించినా బెయిల్ దక్కలేదు. చివరకు ఇరవై ఐదు రోజుల తర్వాత ఆర్యన్ కు జైలు నుంచి విముక్తి లభించింది.
ఆ సమయంలో ఆర్యన్ ఫోన్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకుని.. బోలెడంత సమాచారం రాబట్టినట్టుగా ప్రచారం జరిగింది. ఆర్యన్ పలువురితో డ్రగ్స్ గురించి సంభాషించినట్టుగా మీడియాకు లీకులు వచ్చాయి. బాలీవుడ్ నటి అనన్య పాండే కూడా షారూక్ తనయుడికి డ్రగ్స్ ఆఫర్ చేసినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆ కేసులో ఆమెను కూడా ఎన్సీబీ అధికారులు ఒక పూట విచారించినట్టుగా ఉంది. ఆ తర్వాత వీరి పాత్ర గురించి ఎన్సీబీ ఏం తేల్చిందో మరి! ఆ సంగతలా ఉంటే.. ఈ కేసులో ఎన్సీబీ చార్జిషీటును దాఖలు చేయలేకపోయింది. ఏప్రిల్ రెండో తేదీ నాటికి ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయాల్సిన ఎన్సీబీ.. దీనిపై గడువు కోరింది!
ఏకంగా మరో మూడు నెలల సమయాన్ని ఎన్సీబీ కోరడం గమనార్హం. ఇంకో 90 రోజులు గడిస్తే కానీ.. తాము ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయలేమని కోర్టుకు నివేదించింది ఎన్సీబీ! మరి.. ఇప్పటికే కొన్ని నెలలు గడిచిపోయిన ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ ఎందుకు ఎన్సీబీ తదుపరి అంశాలపై దృష్టి సారించలేకపోయినట్టు? ఆర్యన్ ఖాన్ ను ఇరవై ఐదు రోజుల పాటు విచారించినా.. ఆ తర్వాత నెలలు గడిచినా ఈ కేసులో ఎన్సీబీ పురోగతి సాధించలేకపోయినట్టా! ఇంతకీ ఈ కేసు గుట్టు ఏమిటనేది సామాన్యులకు అంతుబట్టని విషయం!