నిజంగా ప్రభుత్వం కన్నెర్ర చేస్తే..?

ఆంధ్రలో థియేటర్ల అస్తవ్యస్థ పరిస్థితిపై కన్నేసి, అన్ని విధాల చెక్ చేయాలని జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని ఒక్కసారిగా వార్తలు సోషల్ మీడియాలో గుప్పు మన్నాయి. ఇవి నిజమో కాదో తెలియదు.…

ఆంధ్రలో థియేటర్ల అస్తవ్యస్థ పరిస్థితిపై కన్నేసి, అన్ని విధాల చెక్ చేయాలని జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని ఒక్కసారిగా వార్తలు సోషల్ మీడియాలో గుప్పు మన్నాయి. ఇవి నిజమో కాదో తెలియదు. నిజం కావడానికి అవకాశం తక్కువే అనుకోవాలి. జగన్ ప్రభుత్వం నిజంగా థియేటర్ల మీద అంత అక్కసుగా వుంటే కొత్త టికెట్ ల జీవో నే గట్టిగా అమలు చేసి వుండేది. 

జీవో ఇవ్వడం, దాని మీద రాద్దాంతం జరగడం తప్ప, దాన్ని బేస్ చేసుకుని బయ్యర్లు రేట్లు తగ్గించమనడం తప్ప, వాస్తవానికి రేట్లు తగ్గింది లేదు. యూనిఫారమ్ గా నూరు, నూట యాభై అమ్మేసారు. ప్రభుత్వం చేష్టలుడిగి కూర్చుంది. అంతెందుకు అనుమతి లేకుండానే ఈ మధ్య స్పెషల్ షోలు వేసేసినా అడిగే నాధుడు లేడు.

అలాంటి ప్రభుత్వం ఇప్పుడు థియేటర్లను ఏదో చేసేస్తుంది అనుకంటే అది అపోహే అనుకోవాలి. ఎందుకంటే నిజంగా ప్రభుత్వం నిబంధనలను కఠినంగా అమలు చేస్తే 90 శాతం థియేటర్లు మూతపడతాయి. సేఫ్టీ నిబంధనలు, శుభ్రత, ఎమ్మార్పీకి అమ్మడాలు ఇలాంటి విషయాల్లో చాలా థియేటర్లు నిబంధనలకు దూరంగా వుంటాయి. ఆ సంగతి అందరికీ తెలిసిందే. సింగిల్ థియేటర్లలో చాలా వాటిల్లో వాష్ రూమ్ లు పరమ దారుణంగా వుంటాయి.

చాలా చోట్ల పార్కింగ్ సదుపాయాలు సరిగ్గా వుండవు. చాలా చోట్ల థియేటర్ వదిలిన తరువాత బయటకు రావడం, లోపలకు పోవడం అన్నది ఇబ్బంది కరంగా వుంటుంది. ఇలాంటివి అన్నీ అధికారులు చూసీ చూడనట్లే వుంటారు. ఓ థియేటర్ ఓపెనింగ్ కు ముందు చాలా చూస్తారు. అన్నీ అలా అలా సెట్ చేసినా, ఎవ్వరికి వెళ్లాల్సినవి వారికి వెళ్లాక అనుమతి వస్తుంది.

ఇలాంటి నేపథ్యంలో అదే అధికారులు అవే ధియేటర్ల పట్ల కఠిన వైఖరి అవలంబించడం కష్టం. అందువల్ల ప్రభుత్వం ఏదో చేసేస్తుందనేది గాలి వార్తే కావచ్చు. ఒక వేళ నిజంగా ప్రభుత్వం అలా ఆలోచించినా, అది కూడా కొత్త టికెట్ ల జీవో అమలు మాదిరిగానే తూ తూ మంత్రంగా వుంటుంది తప్ప వేరు కాదు.