మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ దివంగత కె.రోశయ్య అజాత శత్రువు. ఇటీవల ఆయన మృతి చెందారు. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో రోశయ్య వైకుంఠ సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు హాజరై రోశయ్య గొప్పతనాన్ని ఆవిష్కరించారు. కొణిజేటి రోశయ్యను నేటి తరం రాజకీయ నేతలు ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రముఖులు సూచించారు.
ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆప్త మిత్రుడు, సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాల పర్యటనలకు వెళుతున్నప్పుడు తనతో ఆర్థిక మంత్రి హోదాలో రోశయ్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు.
వైఎస్సార్ పర్యటనలకు వెళుతున్న సమయంలో…. నిధులు లేవని, కొత్త పథకాలు ప్రకటించొద్దని ముఖ్యమంత్రి చెవిన వేయాలని తనతో రోశయ్య చెప్పినట్టు కేవీపీ సభా వేదికగా ప్రకటించారు. ఆ తర్వాత రోశయ్యతో చర్చించిన తర్వాతే వైఎస్సార్ ముందుకెళ్లే వారని చెప్పారు.
రోశయ్యకు వైఎస్సార్ ఎంతగా గౌరవం ఇచ్చేవారో కేవీపీ మాటల్లో తెలుసుకోవచ్చు. అలాగే వైఎస్సార్ మరణ వార్తను లోకానికి చెప్పే సందర్భంలోనూ, సీఎం సీట్లో కూచువాల్సిన సమయంలోనూ రోశయ్య ఎంతగా తల్లడిల్లారో ఆయన్ను దగ్గరగా చూసిన వాళ్లకు మాత్రమే తెలుసున్నారు.
వైఎస్సార్ మరణించిన సమయంలో రోశయ్య పడిన బాధ, మనోవేదన అంచనా వేయలేనిదని కేవీపీ చెప్పారు. అలాగే ఆర్థికవేత్త, నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను వైఎస్సార్ సులభంగా ఒప్పించే వారని, కానీ రోశయ్య విషయానికి వచ్చే సరికి కష్టమయ్యేదని గుర్తు చేసుకున్నారు.
ఇలా అనేక మంది రాజకీయ ప్రముఖులు రోశయ్యతో తమ అనుబంధాన్ని, ఆ మహనీయుడి విలువల గురించి గొప్పగా ఆవిష్కరించారు.