టాలీవుడ్ ఇండస్ట్రీ భలేగా వుంటుంది. ఎదుట ఒకటి వెనుక మరొకటి. ఏ ఒక్క నిర్మాత మరో నిర్మాత సినిమా హిట్ కావాలని కోరుకోరు.. ఎక్కడో మాంచి సాన్నిహిత్యం వుంటే తప్ప. ఏ ఒక్క దర్శకుడు మరో దర్శకుడికి పేరు రావడం సహించలేడు. ఎలాంటి సినిమా వచ్చినా ఓపెన్ గా ఒకలా మాట్లాడతారు. పర్సనల్ గా ఇంకోలా మాట్లాడతారు. ఇలాంటి వ్యవహారాలు పెద్ద సినిమాలు విడుదలైనపుడు క్లారిటీగా తెలుస్తుంది.
ముందు రోజు అందరూ విసెష్ చెబుతూ ట్వీట్ లు వేస్తారు. విడుదలయ్యాక ఇంటర్వెల్ నుంచి అంత బాలేదటగా.. ఇలా వుందటగా.. అలా వుందటగా అంటూ సన్నాయి నొక్కలు నొక్కడం మొదలవుతుంది. ఆ తరువాత నుంచి ఇవతలి వారి మూడ్ కూడా అదే మోడ్ లో వుంటే ఇక ఫుల్ గా ఏకడం స్టార్ట్ అవుతుంది. లేదూ కాస్త తేడాగా వుంటే తమ ఒపినీయన్ ఇంజెక్ట్ చేయడం మొదలవుతుంది.
మానవ సంబంధాలే ఇప్పుడు అలా తయారయ్యాయి అనుకోవాలి. మామూలు మనుషులు అయితే నేరుగా తిట్టుకుంటారు.. ప్రేమించుకుంటారు. కానీ సినిమా జనాలు మాత్రం అలా కాదు. కౌగిలింతలు మామూలుగా వుంటాయి. కానీ వెనుక కబుర్లు వేరుగా వుంటాయి. ఇది ఏ ఒక్కరికీ పరిమితం అయింది కాదు. అందరూ అంతే.
కారణం ఇండస్ట్రీలో రిలేషన్లు ముఖ్యం. అవి అస్సలు పోకూడదు. అందువల్ల ట్వీట్ లు, పోస్ట్ లు, వేదికలు ఎక్కి మాట్లాడడం ఇవన్నీ ఒక జోనర్ లో, ఒక వేవ్ లెంగ్త్ తో సాగుతాయి. అసలు మాటలు, కొసరు మాటలు, నొసలు చిట్లించడం ఇదంతా వేరే జానర్. తెరవెనుక సాగుతుంది. ఎవరి ఆఫీసుల్లో, ఇళ్లల్లో ఎవరికి వారు, భజన బృందాలు చేరి సాయంత్రం వేళల్లో చేసేది ఇదే.
పెద్ద పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరూ ఈ తరహా వ్యవహారంలో పాత్ర ధారులే. వాళ్లతో కలిసి తిరిగే మీడియా జనాలూ సూత్ర ధారులే. నిజానికి తెరమీద నటించే వారి కన్నా వీరంతా మంచి నటులు.