రెట్రో అనే సినిమా వస్తోంది. సూర్య-పూజ హెగ్డే నటించిన సినిమా. కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. అసలు కార్తీక్ సుబ్బరాజు సినిమాలు అంటేనే చిత్రంగా వుంటాయి. మే 1 న రాబోతున్న రెట్రో సినిమా మీద కాస్త ఆసక్తి వుంది. సూర్య ఈ సినిమాతో డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాడని, బౌన్స్ బ్యాక్ అవుతాడని అంతా వేచి చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ట్రయిలర్ వచ్చింది.
ట్రయిలర్ ఓ ట్రయిలర్ గా లేదు. మాష్ అప్ వీడియో మాదిరిగా వుంది. సినిమాలో వున్న పాత్రలు, వాటి వైవిధ్య, వివిధ సన్నివేశాల్లో వాటి హావభావాలు అన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి, జిగ్ షా పజిల్ మాదిరిగా పోగు పోసి వదిలేసినట్లు వుంది. సూర్య గెటప్ బాగుంది. పూజా పాత్ర అంతంత మాత్రం అన్నట్లు వుంది. ఇంకా చాలా పాత్రలు వున్నాయి.
ఈ పాత్రలు అన్నీ కలిసిన కథేంటో, దాంట్లో మలుపులు ఏమిటో అస్సలు ఎక్కడా కనిపించవు. జస్ట్ ఓ క్రేజీ, మ్యాడ్ ట్రయిలర్ అన్నట్లు వుంటుంది తప్ప, రెగ్యులర్ ఫార్మాట్ కట్ కానే కాదు. మరి ఇది ఇలా వుంటే సినిమా ఇంకెంత క్రేజీగా వుంటుందో చూడాలి.